లండన్: రెండేళ్ల క్రితమే మృతి చెందిన ఓ మహిళ నుంచి ఇప్పటికీ ఇంటి రెంటు తీసుకుంటున్నారు ఆ ఇంటి యజమాని. ఈ సంఘటన బ్రిటన్ రాజధాని లండన్‌లో వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగింది. మృతి చెందిన మహిళ నుంచి ఇంటి రెంటు ఎలా తీసుకోగలుగుతున్నారు? అనే అంశాన్ని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. లండన్, పెఖమ్ నగరంలోని ఓ అపార్ట్ మెంట్‌లో 61 ఏళ్ల శీలా సెలియోవన్ అనే మహిళ అస్తికలను గుర్తించారు పోలీసులు. మూడో అంతస్తులో ఉంటున్న ఆమె ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు ఆమె ఎముకలు మాత్రమే కనిపించాయి. డెంటల్ రికార్డ్స్ ప్రకారం బాధితురాలిని గుర్తించారు పోలీసులు. ఆమె మరణానికి ఎలాంటి అనుమానాస్పద కారణాలు కనిపించలేదన్నారు. 2019, ఆగస్టులో ఆమె మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు.
రెండేళ్లుగా కనిపించకపోయినా..
అవివాహిత అయిన 61 శీలా కుటుంబం దక్షిణాఫ్రికాలో ఉంటోంది. ఆమె మృతి చెందినట్లు 2022, ఫిబ్రవరిలో గుర్తించినట్లు డైలీ మెయిల్ నివేదించింది. 2019, అక్టోబర్‌లో ఆమె ఫ్లాట్ నుంచి కుల్లిపోయిన వాసన విపరీతంగా వచ్చినట్లు ఇరుగు పొరుగువారు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు సార్లు ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చినా తెరిచేందుకు సరైన కారణం లేదని తిరిగి వెళ్లిపోయారు పోలీసులు. ఆమెను చివరి సారిగా 2019, ఏప్రిల్‌లో చూసినట్లు స్థానికులు తెలిపారు. అదే ఏడాది ఆగస్టులో చివరిసారిగా ఇంటి రెంటు చెల్లించారు శీలా. ఆ తర్వాత చెల్లించకపోవటం వల్ల ఆమె యూనివర్సల్ క్రెడిట్ పేమెంట్స్ నుంచి ఆటోమెటిక్‌గా రెంట్ పే చేసేందుకు హౌసింగ్ గ్రూప్ అంగీకరించింది. ఆ తర్వాత 2020, మార్చి నుంచి ప్రతి నెలా యజమానికి ఆటోమేటిక్‌గా రెంటు అందుతోంది. అయితే.. ఆమెను పలకరించేందుకు ఏ ఒక్కరు ప్రయత్నించకపోవటం గమనార్హం.
2020, జూన్‌లో గ్యాస్ తనిఖీల్లో భాగంగా అధికారులు ఫ్లాట్‌కు వెళ్లగా.. ఎవరూ స్పందించలేదు. దీంతో శీలా ఉండే ఇంటికి గ్యాస్ కనెక్షన్ తొలగించారు. ఆమె ఫ్రిడ్జ్‌లో ఉన్న ఆహారపదార్థాలపై తేదీల ఆధారంగా ఆమె 2019, ఆగస్టులో చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేశారు. ఆమె 2019, ఆగస్టు 14న టెలిఫోన్ ద్వారా వైద్యుడితో మాట్లాడారు. తనకు ఇబ్బందిగా ఉందని, ఒక్కోసారి శ్వాస తీసుకోలేకపోతున్నట్లు తెలిపింది. ఆ తర్వాతి రోజు వైద్యుడిని కలవాల్సి ఉంది. కానీ ఆమె హాజరవ్వలేదు.
ఇదీ చూడండి: స‍్విమ్మింగ్‌పూల్ సింక్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి.. వీడియో వైరల్!
Comments
Please login to add a commentAdd a comment