లాక్‌డౌన్ కాలంలో సెలూన్ షాపులు మూతపడిన నేపథ్యంలో కొంతమంది పురుషులు పెరిగిన జుట్టుతో చికాకు పడుతూ సొంతంగానే కటింగ్ చేసుకున్నారు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు చాలా మంది స్వయంగా క్షవరం చేసుకుని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు రిలీఫ్‌గా ఉందని, హెయిర్ కటింగ్ షాపులు ఇంకొన్నాళ్లు మూసి ఉంటే తమ పరిస్థితి ఏమయ్యేదోనంటూ కామెంట్లు చేశారు. అలాంటి వాళ్లు వియత్నాంకు చెందిన 92 ఏళ్ల గుయెన్ వాన్ చిన్ గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.
ఎందుకంటే దాదాపు 80 ఏళ్లుగా చిన్ ఒక్కసారి కూడా తన జుట్టును కత్తిరించుకోలేదు. దీంతో సుమారు ఐదు మీటర్ల పొడవు మేర పెరిగిన జుట్టుతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మూడో తరగతి చదువుతున్న సమయంలోనే జీవితంలో ఎప్పుడూ హెయిర్‌కట్ చేయకూడదని నిశ్చయించుకున్నారట. అయితే చిన్ ఇలా చేయడం వెనుక ఓ బలమైన కారణం కూడా ఉందని చెబుతున్నారు. (చదవండి: కాలు చూపిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు)
ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఒకవేళ నేను నా జట్టు కత్తిరించుకుంటే చనిపోతానని నమ్ముతాను. అందుకే కనీసం ఒక్కసారి కూడా దువ్వెన ఉపయోగించలేదు. ముడివేసి కొప్పులా మార్చి దానిపై ఓ వస్త్రాన్ని చుడతాను. ఎల్లపుడూ పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకుంటాను. చిన్నప్పటి నుంచి నా జుట్టు ఎంతో బలంగా, నల్లగా, ఒత్తుగా ఉండేది. అప్పుడు చక్కగా దువ్వుకొనేవాడిని. అయితే దేవుడి పిలుపు విన్న తర్వాత అంతా మారిపోయింది. జుట్టుకు, అమరత్వానికి మధ్య బలమైన సంబంధం ఉందని నేను నమ్ముతాను’’ అని రాయిటర్స్‌తో చెప్పుకొచ్చారు.(చదవండి: స్కిన్ ఎలర్జీ.. ఈ అమ్మాయి ఏం చేసిందంటే!)
కాగా స్థానికంగా ప్రాచుర్యం పొందిన ‘కొకొనట్’ మత విశ్వాసాన్ని ఆచరిస్తున్నారు. 1963లో స్థాపించిన ఈ మతాచారం ‘దువా’పై ప్రస్తుతం వియత్నాంలో నిషేధం ఉంది. ఇక తాను కేవలం కొబ్బరికాయల వల్లే తమ మనుగడ కొనసాగిందని, వాటి కారణంగానే శారీకరంగా దృఢంగా ఉన్నానని ఈ మత స్థాపకులు బోధించినట్లు స్థానికులు చెప్పుకొంటారు.
Comments
Please login to add a commentAdd a comment