రాణి కడసారి చూపునకు... మెగన్‌ను రానివ్వలేదు! | Meghan Markle may not attend Queen Elizabeth II funeral | Sakshi
Sakshi News home page

రాణి కడసారి చూపునకు... మెగన్‌ను రానివ్వలేదు!

Published Sun, Sep 11 2022 5:14 AM | Last Updated on Sun, Sep 11 2022 5:14 AM

Meghan Markle may not attend Queen Elizabeth II funeral - Sakshi

లండన్‌: బ్రిటన్‌ నూతన రాజు చార్లెస్‌–3 కుటుంబంలో కొన్నేళ్లుగా నెలకొన్న విభేదాలు రాణి ఎలిజబెత్‌–2 అస్తమయం సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. చార్లెస్, ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్‌ విలియంతో చిన్న కుమారుడు ప్రిన్స్‌ హ్యారీకి చాలా ఏళ్లుగా సత్సంబంధాలు లేని విషయం తెలిసిందే. రాజకుటుంబం అభ్యంతరాలను పట్టించుకోకుండా అమెరికా నటి మెగన్‌ మార్కెల్‌ను హ్యారీ పెళ్లాడటంతో విభేదాలు బాగా ముదిరాయి. తర్వాతి పరిణామాల నేపథ్యంలో హ్యారీ దంపతులు సంచలన రీతిలో రాజరిక హోదానే వదులుకునేందుకు దారితీశాయి.

ఈ నేపథ్యంలో గురువారం స్కాట్లండ్‌లోని బాల్మోరల్‌ కోటలో మృత్యుశయ్యపై ఉన్న రాణిని చూసేందుకు మెగన్‌ రావడానికి వీల్లేదని చార్లెస్‌ పట్టుబట్టారట. హ్యారీ దంపతులు గురువారం లండన్లోనే ఉన్నారు. రాణి కడసారి చూపుకు వారిద్దరూ బాల్మోరల్‌ బయల్దేరుతున్నట్టు తెలియగానే చార్లెస్‌ నేరుగా హ్యారీకి ఫోన్‌ చేసి, ‘‘అతి కొద్దిమంది రక్త సంబంధీకులం తప్ప ఎవరూ రావడం లేదు. కేట్‌ మిడిల్టన్‌ (విలియం భార్య) కూడా రావడం లేదు. కాబట్టి మెగన్‌ రాక అస్సలు సరికాదు’’ అని చెప్పినట్టు సమాచారం. దాంతో హ్యారీ ఒంటరిగానే వెళ్లి నాయనమ్మకు నివాళులు అర్పించారు. గురువారమే మొదటిసారిగా కొత్త స్కూల్‌కు వెళ్తున్న తన ఇద్దరు పిల్లల కోసం మిడిల్టన్‌ లండన్లోనే ఉండిపోయారు.

ముందునుంచీ విభేదాలే
విలియం, హ్యారీ సోదరుల మధ్య ఏనాడూ పెద్దగా సఖ్యత లేదు. తండ్రితో, అన్నతో మనస్ఫర్ధలను పలుమార్లు టీవీ ఇంటర్వ్యూల్లో హ్యారీ బాహాటంగానే వెల్లడించారు. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అమెరికా నటి అయిన మెగన్‌తో తన ప్రేమాయణం వారికి నచ్చకపోయినా పట్టించుకోలేదు. గొడవల నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదాను వదులుకుని రెండేళ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 2021లో ప్రఖ్యాత అమెరికా టాక్‌ షో హోస్ట్‌ ఓప్రా విన్‌ఫ్రేకు వారిచ్చిన ఇంటర్వ్యూ పెను సంచలనం సృష్టించింది.

రాజ కుటుంబీకుల జాత్యహంకార వ్యాఖ్యలు, ప్రవర్తన తననెంతగానో గాయపరిచాయంటూ మెగన్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘‘పెళ్లికూతురుగా ముస్తాబవుతున్న సమయంలో మిడిల్డన్‌ నన్ను సూదుల్లాంటి మాటలతో తీవ్రంగా గాయపరిచింది. తట్టుకోలేక ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నా’’ అంటూ దుయ్యబట్టింది. ఈ ఆరోపణలు, మొత్తంగా బ్రిటన్‌ రాచరిక వ్యవస్థపైనే ఆమె ఎక్కుపెట్టిన పదునైన విమర్శలు అప్పట్లో పెను దుమారం రేపాయి. రాజ కుటుంబానికి మాయని మచ్చగా మిగల్చడమే గాక వారి హృదయాల్లో మంటలు రేపాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలను మరింత పెంచాయి.

తల్లిదండ్రులుగా చార్లెస్, కెమిల్లా పూర్తిగా విఫలమయ్యారంటూ హ్యారీ కూడా దుయ్యబట్టారు. తండ్రి అయితే తన ఫోన్‌ కూడా ఎత్తడం మానుకున్నారని ఆరోపించారు. ఒకవైపు రాణి ఎలిజబెత్‌ భర్త ఫిలిప్‌ మరణించిన దుఃఖంలో ఉన్న రాజ కుటుంబాన్ని ఈ ఆరోపణలు మరింత కుంగదీశాయి. ఆ సమయంలో నిండుచూలాలిగా ఉన్న మెగన్‌ ఫిలిప్‌ అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. అయితే హ్యారీతో పాటు మెగన్‌ను కూడా రాణి ఎంతో ఇష్టపడేవారనే చెబుతారు. మెగన్‌ అమెరికా వెళ్లి రాణి అంత్యక్రియల సమయానికి లండన్‌ తిరిగొస్తారని సమాచారం. దూరమైన కుటుంబీకులను విషాద సమయాలు దగ్గర చేస్తాయంటారు. బ్రిటిష్‌ రాజ కుటుంబం విషయంలో అది నిజమవుతుందో లేదో అంత్యక్రియల నాటికి స్పష్టత వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement