Moonwalker Buzz Aldrin Gets Married At 93 Age - Sakshi
Sakshi News home page

పుట్టినరోజు నాలుగో పెళ్లి.. యూత్‌లా ఫీలైపోతూ..

Published Sat, Jan 21 2023 4:15 PM | Last Updated on Sat, Jan 21 2023 5:14 PM

Moonwalker Buzz Aldrin Gets Married At 93 Age - Sakshi

వాషింగ్టన్‌: ఆయనకు ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయ్యి.. విడాకులు అయ్యాయి. తాజాగా నాలుగో పెళ్లి చేసుకున్నారు. అదీ పుట్టినరోజు నాడే. అంతలా ఆయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారా?. చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు?.. నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ కదా!. మరి రెండో వ్యక్తి ఎవరు?.. 

ఈయనే ఆయన. పేరు ఎడ్విన్‌ బజ్‌ అల్డ్రిన్‌. అమెరికా మాజీ వ్యోమగామి. అపోలో 11 మిషన్‌ ద్వారా చంద్రుడిపై పాదం మోపి.. సంచరించిన ముగ్గురు వ్యోమగాముల్లో ఈయన కూడా ఒకరు. పైగా ఆ బ్యాచ్‌లో ఇంకా బతికి ఉంది కూడా ఈయనే. 

ఎడ్విన్‌ బజ్‌ అల్డ్రిన్‌.. నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ తర్వాత చంద్రుడిపై పాదం మోపిన రెండో వ్యక్తి. ఆర్మ్‌స్ట్రాంగ్‌తో పాటు 19 నిమిషాల చంద్రుడిపై సంచరించారీయన. నీల్‌ ఆర్మ్‌స్టాంగ్‌ ఈ మిషన్‌లో కమాండర్‌గా వ్యవహరించగా.. ఎడ్విన్‌ బజ్‌ అల్డ్రిన్‌ ‘లునార్‌ మాడ్యుల్‌ పైలట్‌’గా వ్యవహరించారు. ఇక మైకేల్‌ కోలిన్స్‌ కమాండ్‌ మాడ్యుల్‌ పైలట్‌గా పని చేశారు. అపోలో 11 మిషన్‌ 1969 జులై 16వ తేదీన లాంఛ్‌ కాగా, జులై 20వ తేదీన చంద్రుడిపై తొలిసారిగా మానవుడు అడుగుపెట్టాడు. 

ఇక.. మూడుసార్లు అంతరిక్షంలో సంచరించిన వ్యోమగామిగానూ అల్డ్రిన్‌ పేరిట ఓ రికార్డు ఉంది. 1971లో నాసా నుంచి రిటైర్‌ అయిన ఈ పెద్దాయన.. 1998లో షేర్‌స్పేస్‌ ఫౌండేషన్‌ను స్థాపించి అంతరిక్ష అన్వేషణ సిబ్బందికి శిక్షణ ఇస్తూ వస్తున్నారు. గతంలో ఆయనకు మూడు సార్లు వివాహం అయ్యింది. 1954-1974, 1975-78, 1988-2012.. ఇలా మూడుసార్లు ఆయన వివాహాలు విడాకులు అయ్యాయి. అయితే ఆ తర్వాత ఆయన డాక్టర్‌ అంకా ఫౌర్‌తో డేటింగ్‌ చేస్తూ వస్తున్నారు.

తాజాగా తన 93వ పుట్టినరోజున.. 63 ఏళ్ల అంకాను వివాహం చేసుకున్నాడాయన. లాస్‌ ఏంజెల్స్‌ కలిఫ్‌లో దగ్గరి వాళ్ల మధ్య సింపుల్‌గా ఈ వివాహం జరిగింది.   ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేసిన ఆ పెద్దాయ.. ఇంట్లోనుంచి పారిపోయే కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని ఉద్వేగాన్ని ప్రదర్శిస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement