అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని కుమారులు దాదాపు పదేళ్లపాటు తప్పుడు ఆర్థిక నివేదికలను సమర్పించారని న్యూయార్క్ న్యాయమూర్తి స్పష్టం చేశారు. ట్రంప్ మోసానికి పాల్పడ్డారంటూ ఆయన తేల్చిచెప్పారు.
ట్రంప్ తన కంపెనీ ఆస్తుల విలువను అధికంగా అంచనా వేయడం ద్వారా పలు ఒప్పందాలు చేసుకోవడంతోపాటు, అక్రమంగా రుణాలు పొందారని న్యాయమూర్తి ఆర్థర్ ఎంగ్రోన్ తెలిపారు. తన ఆస్తుల విలువను డాక్యుమెంట్లలో భారీగా చూపించి, పలు బ్యాంకులు, బీమా సంస్థలను, ఇతరులను ట్రంప్ మోసం చేశారన్నారు.
జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం కేసు విచారణ నేపధ్యంలో ట్రంప్‌కు సంబంధించిన కొన్ని వ్యాపార సంస్థల లైసెన్స్‌లను రద్దు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా ట్రంప్, అతని ముగ్గురు పిల్లలు సంయుక్తంగా వారి కంపెనీల విలువను పెంచి, బ్యాంకులు, బీమా సంస్థలకు చూపారని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఆరోపించారు. ట్రంప్‌కు, ఆయన సంతానానికి 250 మిలియన్ డాలర్ల జరిమానా విధించాలని, న్యూయార్క్ లో ట్రంప్ వ్యాపారం చేయకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు.
ట్రంప్‌కు విధించాల్సిన శిక్షపై నిర్ణయం తీసుకునే ముందు న్యూయార్క్ జడ్జి ఆర్థర్ ఎంగ్రోన్ అక్టోబర్ 2న నాన్-జ్యూరీ ట్రయల్‌ని నిర్వహించాలని భావిస్తున్నారు. కాగా తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ చాలా కాలంగా వాదిస్తున్నారు. విచారణకు ముందే తనపై ఉన్న కేసును కొట్టివేయాలని అతని లాయర్లు న్యూయార్క్ న్యాయమూర్తిని గతంలో కోరారు. కాగా న్యూయార్క్ జడ్జి ఇచ్చిన తీర్పు.. 2024 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బకానుంది.
ఇది కూడా చదవండి: చైనా ముంగిట మాద్యం ముప్పు? ఆమెరికాతో చెలిమికి డ్రాగన్ సై?
Comments
Please login to add a commentAdd a comment