సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌కు మరో దేశంలో భారీ షాక్ తగిలింది. దేశంలో ట్విటర్ కార్యకలాపాలను నిరవధికంగా నిలుపుదల చేస్తూ నైజీరియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కార్పొరేట్ ఉనికిని అణచివేసే చర్యలకు ట్విటర్‌ను వినియోగిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరల్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు నైజీరియా సమాచార, సాంస్కృతిక మంత్రి అల్‌హాజి లాయ్ మొహ్మద్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దేశాధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ ట్విటర్ ఖాతా సస్పెన్షన్ జరిగిన రెండు రోజుల తరువాత శుక్రవారం (స్థానిక సమయం) తాజా పరిణామం చోటు చేసుకుంది.
రెండు రోజుల క్రితం నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారి పోస్ట్ చేసిన ట్వీట్‌ను అభ్యంతరకరమైన పోస్ట్‌గా పేర్కొన్న ట్విటర్ ఆ ట్వీట్‌ను తొలగించడంతో పాటు ఆయన ఖాతాను 12 గంటల పాటు సస్పెండ్ చేసింది. అయితే దీనిపై బుహారీ మద్దతు దారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ప్రతి స్పందనగానే దేశంలో ట్విటర్ కార్యకలాపాలను నిరవధింగా బ్యాన్ చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సోషల్ మీడియా వేదికలను నియంత్రించేలా కొత్త లైసెన్సింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు కూడా ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. కాగా చైనా, ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబా, తుర్క్‌మెనిస్థాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ తదితర దేశాలు ట్విటర్‌ను శాశ్వతంగా లేదా తాత్కాలికంగా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.
చదవండి : Twitter దుందుడుకు చర్య: ఉపరాష్ట్రపతికి బ్లూటిక్ తొలగింపు
Comments
Please login to add a commentAdd a comment