హైదరాబాద్/బెల్లంపల్లి: ‘రాజకీయాల్లోకానీ, పాలనలో కానీ వ్యక్తిపూజను ప్రోత్సహించేవారిలో నేను చివరి వ్యక్తిని. నా జన్మదిన వేడుకలకు హాజరుకాలేదంటూ అత్యుత్సాహం కలిగిన ఓ మున్సిపల్ కమిషనర్ ఉద్యోగులకు మెమో జారీ చేసిన వార్త నా దృష్టికి వచ్చింది. అసంబద్ధ వైఖరి ప్రదర్శించిన కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని పురపాలక శాఖ కమిషనర్(సీడీఎంఏ)ను ఆదేశించా’ అని కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్‌లో వెల్లడించారు.
ఈ నెల 24న కేటీఆర్ బర్త్‌డే వేడుకలకు హాజరుకాలేదని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ నలుగురు సిబ్బందికి మెమోలు జారీ చేసిన విషయం తెలిసిందే. మెమోల జారీపై ఈ నెల 27న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్త కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో ట్విట్టర్‌లో స్పందించారు. గంగాధర్ విధుల్లో చేరిన 50 రోజుల్లోనే సస్పెండ్ కావడం గమనార్హం.
కాగా, ‘కేంద్రంలోని ఎన్పీయే(నిరర్థక) ప్రభుత్వానికి కనీస ప్రణాళిక లేనందునే దేశీయంగా బొగ్గుకొరత ఏర్పడింది. దీంతో పది రెట్లు ఎక్కువ ధర పెట్టి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు పెరిగితే ఎవరికి కృతజ్ఞతలు తెలపాలో మీకు తెలుసు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే భారతదేశంలో వచ్చే వంద ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి’అని కేటీఆర్ మరో ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment