అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్విట్టర్‌లో ప్రకటనలు ఇవ్వబోమని శుక్రవారం వెల్లడించింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. అయితే ట్విట్టర్‌లో తమ కస్టమర్లతో మాత్ర యథావిధిగా ఇంటరాక్ట్ అవుతామని జనరల్ మోటార్స్ స్పష్టం చేసింది. కొత్త యాజమాన్యంలో ట్విట్టర్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూసి ప్రకటనలు ఇచ్చే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వివరించింది.
ప్రత్యర్థి సంస్థ..
ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో నెం.1గా ఉన్న టెస్లాకు జనరల్ మోటార్స్ ప్రధాన ప్రత్యర్థి సంస్థ. ఎలాన్ మస్క్ తర్వాత విద్యుత్ వాహన రంగంలో వేల కోట్లు పెట్టుబడి పెట్టింది కూడా జనరల్ మోటార్సే కావడం గమనార్హం.
టెస్లాకు మరో ప్రత్యర్థి అయిన ఫోర్డ్ మోటార్స్ కూడా ట్విట్టర్‌లో ప్రకటనలపై స్పందించింది. ఎలాన్ మస్క్-ట్విట్టర్ మధ్య డీల్‌కు ముందు కూడా తాము ఈ సామాజిక మాధ్యమంలో ప్రకటనలు ఇవ్వలేదని చెప్పింది. కొత్త యాజమాన్యం తీరును బట్టి ప్రకటనలపై నిర్ణయం ఉంటుందని చెప్పింది. అయితే కస్టమర్లతో మాత్రం ట్విట్టర్‌లో సంబంధాలు కొనసాగిస్తామని పేర్కొంది.
రివియాన్, స్టెలాంటిస్, ఆల్ఫబెట్‌కు చెందిన వేమో సంస్థలు మాత్రం ట్విట్టర్‌లో ప్రకటనల నిలిపివేతపై ఇంకా స్పందించలేదు. మరో సంస్థ నికోలా మాత్రం ట్విట్టర్‌లో యథావిధిగా ప్రకటనలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
44 బిలయన్ డాలర్లు వెచ్చింది ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను శుక్రవారం అధికారికంగా పూర్తి చేశారు ఎలాన్ మస్క్. అనంతరం పక్షికి స్వేచ్ఛ వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను కూడా పునరుద్ధరించే విషయంపై ఆలోచిస్తామని చెప్పారు.
చదవండి: ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్
Comments
Please login to add a commentAdd a comment