ఓస్లో: ఆమె ఒక దేశానికి యువరాణి. కనుసైగ చేస్తే చాలు వందిమాగధులు కోరినదేదైనా కాదనకుండా తెస్తారు. అష్టైశ్వర్యాలతో తులతూగే జీవితం. కానీ ఆమె కాబోయే భర్త కోసం అవన్నీ వదులుకుంది. అతను చేసే ఆల్టర్నేటివ్ మెడిసన్ వ్యాపారాలపై దృష్టి పెట్టడానికి యువరాణి బాధ్యతల్ని నుంచి బయటపడింది. ఆమే నార్వే యువరాణి మార్తా లూయిస్. ఆమెకు కాబోయే భర్త డ్యూరెక్ వెరెట్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తూంటారు. ఇదేదో సంప్రదాయ వైద్యం కాదు. ప్రత్యామ్నాయ వైద్యంపై పరిశోధనలు చేయాలి.
దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి డ్యూరెక్ చేస్తున్న కృషికి అండగా నిలవడానికి మార్తా లూయిస్ రాచరిక విధుల నుంచి బయటకు వచ్చారు ‘‘నా వ్యక్తిగత పనులకి, రాజకుటుంబంలో పోషించే పాత్రకి మధ్య విభజన ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. రాజు హరాల్డ్–5 కూడా ఇందుకు అంగీకరించారు. ప్రిన్సెన్స్ టైటిల్ మాత్రం నాతోనే ఉంటుంది. ప్రత్యామ్నాయ వైద్యం ప్రాముఖ్యతను ప్రజలకు చెప్పడంలో ఎంతో ఆనందముంది’’ అని యువరాణి వెల్లడించారు. మరోవైపు తనని తాను దివ్యశక్తులున్న వ్యక్తిగా చెప్పుకునే డ్యూరెక్‌పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఆయన చేసే వైద్య విధానం మంచిదేనని గొప్పగా చెప్పుకుంటే, మరికొందరు తాంత్రికవాది అంటూ కొట్టి పారేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment