ప్రతీకాత్మక చిత్రం
మోర్తాడ్ (బాల్కొండ): ఒమన్ దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న విదేశీయులు స్వచ్ఛందంగా వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి ప్రకటించిన క్షమాభిక్ష గడువును ఆ దేశ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2020 డిసెంబర్ 31 వరకు క్షమాభిక్ష పొందడానికి గడువు నిర్ణయించిన ఒమన్ ప్రభుత్వం.. అంతర్జాతీయ విమానాల నిలుపుదల నేపథ్యంలో మొదటిసారి ఈ నెల 15 వరకు పొడిగించింది. క్షమాభిక్ష పొందేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మరోసారి మార్చి 31 వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఆ దేశ కార్మిక శాఖ, కార్మిక సంక్షేమ డైరెక్టర్ జనరల్ సేలం బిన్ సయీద్ అల్‌బాడి వెల్లడించారు. గడిచిన నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన క్షమాభిక్షతో ఇప్పటివరకు 12,378 మంది విదేశీయులు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు.(చదవండి: వీసా లేకుండానే ఒమన్ వెళ్లొచ్చు)
ఇదిలా ఉండగా మరో 57,847 మంది క్షమాభిక్ష కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు గడువు పెంచడంతో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒమన్‌లో అమలవుతున్న క్షమాభిక్ష వల్ల లబ్ధిపొందే వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు క్షమాభిక్ష పొందిన వారికి ఎలాంటి సహకారమైనా అందిస్తామని, ఆర్థిక పరిస్థితి బాగాలేని వారికి విమాన టికెట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తామని ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నరేంద్ర పన్నీరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment