తాలిబన్ల ఆక్రమణ తర్వాత అఫ్గన్ పరిణామాలు.. అంతర్యుద్ధం దిశగా దారి తీశాయి. ఆఫ్గన్ రెబల్స్ చేతుల్లోకి వెళ్లిన ప్రాంతాలను.. తిరిగి చేజిక్కిచ్చుకునేందుకు చర్చలతో ముందుకెళ్తోంది తాలిబన్ గ్రూప్. అయితే దేశంలో చాలా భాగాలు తిరిగి తాలిబన్ల స్వాధీనంలోకి వచ్చినప్పటికీ.. పంజ్ షీర్ లోయ మాత్రం ఇంకా ప్రతిఘటన దళాల స్వాధీనంలోనే ఉండడం ఆసక్తికరంగా మారింది. ఓవైపు చర్చల ప్రస్తావన వినిపిస్తున్నప్పటికీ.. మరోవైపు సమరానికి సై అంటూ పంజ్‌షీర్ దళం ప్రకటన ఇవ్వడం గందరగోళానికి దారితీస్తోంది.
మేజర్ అమీర్ అక్మల్.. పంజ్‌షీర్ ప్రతిఘటన దళ సభ్యుడు. చిట్టచివరి అవుట్‌పోస్ట్‌ని సమర్థవంతంగా నడిపిస్తున్న కమాండర్. తాలిబన్ల గందరగోళ ప్రకటనల నేపథ్యంలో.. పోరుకే సిద్ధమని బహిరంగంగా ప్రకటించాడు. ‘మా దళంలో యువతే ఎక్కువగా ఉంది. సైనికులు.. మాజీ జిహాదీ కమాండర్ల అనుభవం మాకు కలిసి వస్తుంది. అందరికీ ఆమోద యోగ్యమైన వ్యవస్థకే మేం లోబడి ఉన్నాం. దేశాన్ని(అఫ్గనిస్థాన్)ను మళ్లీ నరకంలోకి దించం. సమరానికి మేం సిద్ధం. యుద్ధానికి కావాల్సిన సైన్యం, సరంజామా సరిపడా మాకు ఉంది’ అని ప్రకటించాడు అమీర్.
పటిష్టమైన పద్మవ్యూహం
హిందూఖుష్ పర్వత శ్రేణుల్లో పంజ్‌షిర్ లోయ ఉంది. పంజ్‌షిర్(పంజ్‌షేర్) అంటే ఐదు సింహాలు అని అర్థం. ఇక్కడి జనాభా లక్షకు పైనే. చుట్టూ కొండలు, ఇరుకైన పర్వత శ్రేణులు, పంజ్‌షిర్ నదీ ప్రవహిస్తుంటాయి. ఈ లోయలోనే తజిక్ యుద్ధవీరులు ఉంటారు. చొరుబాటుదారుల్ని చంపి పాతరేస్తారు ఇక్కడ. అహ్మద్ షా మసూద్ లాంటి తజిక్ పోరాటయోధుల ఆధ్వర్యంలో సోవియట్ సైన్యాన్ని, తాలిబన్లను సైతం నిలవరించగలిగింది ఈ దళం. భీకర యోధులుగా వీళ్లకు పేరుంది. అయితే పాక్ వెన్నుదన్నులతో నడిచే తాలిబన్లను వీళ్లు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించరు. అందుకే ఇప్పుడు అఫ్గన్ సైన్యం నుంచి భారీగా ఈ దళంలోకి చేరికలు వస్తున్నాయి. సుమారు తొమ్మిదివేల మంది ప్రస్తుతం ఈ దళంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో స్థానిక మిలిటెంట్లు, స్టాఫ్ ఉన్నారు. ‘‘ఆర్మీతో మేం సాధించింది ఏం లేదు. ఇప్పుడు మా మాతృభూమిని తాలిబన్ల చెర నుంచి విడిపించుకోవాలనుకుంటున్నాం’ అని తజిక్ ప్రకటించింది.
లొంగుబాటు కథనాలు
పంజ్ షీర్ లీడర్ అహ్మద్ మసూద్ గౌరవపూర్వకంగా లొంగిపోవాలనుకుంటున్నారని, ఈ మేరకు తాలిబన్‌లతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ‘‘40 మందితో కూడిన తాలిబన్ల బృందం.. డిమాండ్లు అంగీకరించడమా? లేదా తిరుగుబాటును ఎదుర్కోవడమా? అనే రెండు ఆప్షన్లతో ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక నియంతృత్వానికి వ్యతిరేకమని ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్(ఉపాధ్యక్షుడు).. చర్చలు సానుకూలంగా సాగితే తిరుగుబాటు దళాలు దేనికైనా సిద్ధంగా ఉంటాయ’ని ఆ కథనం ప్రచురించింది. మరోవైపు ఈ కథనాలను మసూద్ కొట్టిపడేశాడు.
నిజంగా ఆక్రమించారా?
మంగళవారం తాలిబన్లు దక్షిణ్ ప్రావిన్స్‌కు ఆనుకుని ఉండే అంజుమాన్ పాస్ గుండా పంజ్ షీర్ లోయలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, తిరుగుబాటు దళాలు వారిని అడ్డుకున్నాయని, పంజ్ షీర్ బలగాల్లో చేరిన ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీ కమాండో వజీర్ అక్బర్ పేరుతో ఒక ప్రకటన రిలీజ్ అయ్యింది. అయితే అది నిజం కాదని తాలిబన్ కమాండర్ ముల్లా ఖాక్సర్ ప్రకటన వెలువరించాడు. ‘మాకింకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే పంజ్‌షిర్‌లో అడుగుపెడతాం. మేమేం అతివాదులం కాదు. సామరస్యంగా సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాం. చర్చలకే మా మొగ్గు’ అని ఖాక్సర్ ప్రకటనలో ఉంది.
చదవండి: భారత్.. మరి తాలిబన్లు ఏమంటారో?
Comments
Please login to add a commentAdd a comment