![Pentagon Move Jeff Bezos Hits Wealth all time Record - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/7/Jeff-Bezos.jpg.webp?itok=aU_P2mIY)
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థపాకుడు జెఫ్ బెజోస్ సంపద మరోసారి ఆల్ టైం రికార్డుకు చేరింది. పెంటగాన్ కీలక ప్రకటనతో ఆయన ఆస్తులు కనీవినీ ఎరగని రీతిలో ఆకాశమే హద్దుగా దూసుకు పోయాయి. తద్వారా బెజోస్ నికరసంపద ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరింది. ప్రధానంగా అమెజాన్ షేర్లు 4.7 శాతం పెరగడంతో ఆయన నికర ఆస్తుల విలువ 211 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15.69 లక్షల కోట్లు) చేరడం విశేషం.
ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ సంస్థతో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్టును రద్దుచేసుకున్నట్లు పెంటగాన్ ప్రకటించడంతో అమెజాన్ షేర్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి నెలకొంది. 2019 లో మైక్రోసాఫ్ట్ సంస్థతో 10 బిలియన్ డాలర్ల క్లౌడ్-కంప్యూటింగ్ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు పెంటగాన్ మంగళవారం తెలిపింది. దీంతో షేర్లు అమాంతం పుంజుకున్నాయి. మంగళవారం అమెజాన్ షేర్ విలువ 8.4 బిలియన్ డాలర్ల మే లాభపడింది. ఈ ర్యాలీతో జెఫ్ బెజోస్ సంపదన 8.4 బిలియన్ డాలర్లు పుంజుకుంది. ఫలితంగా ఆయన నికర విలువ 211 బిలియన్ డాలర్లకు చేరింది.
మాకెంజీ స్కాట్ : ఇచ్చిందంతా తిరిగొచ్చింది
తాజా పరిణామంతో అటు బెజోస్ మాజీ భార్య ,ప్రపంచంలోని 15 వ రిచెస్ట్ పర్సన్ మాకెంజీ స్కాట్ సంపద ఏకంగా 2.9 బిలియన్ డాలర్లు పెరిగింది. అంతేకాదు ఈ సంవత్సరం ఇప్పటివరకు ఆమె దానం చేసిన 2.7 బిలియన్ల డార్లను మించిపోవడంమరో విశేషం.
కాగా ఈ ఏడాది జనవరిలో 210 బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ టాప్ ప్లేస్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రికార్డును జెఫ్ బెజోస్ బద్దలుకొట్టి అపరకుబేరుడి రికార్డును మరోసారి చేజిక్కించుకున్నారు. 57 ఏళ్ల బెజోస్ 27 సంవత్సరాల సుదీర్ఘ కరియర్ తరువాత ఇటీవల అమెజాన్ సీఈఓ పదవి నుంచి తప్పుకుని, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment