వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లెయిన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పాలనా అధికారుల నియామకంపై గట్టి కసరత్తు చేస్తున్నారు. చాలా ఏళ్లుగా తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాన్ క్లెయిన్‌కు అత్యంత శక్తిమంతమైన పదవిని అప్పగించారు. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఆయనను నియమిస్తూ బుధవారం బైడెన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అగ్రరాజ్య అధ్యక్షుడు రోజు వారీ కార్యక్రమాల్ని చూడాలి. ఆయనను అధ్యక్షుడి గేట్ కీపర్ అని పిలుస్తారు. ప్రభుత్వం ఎదుర్కోబోయే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే ఇతర సిబ్బంది నియామకంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
‘‘నేను, రాన్ గత ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేశాం. 2009లో అమెరికా చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని గట్టెక్కించాం. 2014లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కూడా మేము కలిసి కట్టుగా అధిగమించాం. వైట్ హౌస్ పదవికి ఆయనను మించిన వారు లేరు’’ అని బైడెన్ ట్రాన్సిజన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాన్ క్లెయిన్‌కున్న అపారమైన అనుభవం, అత్యంత సమర్థతతో ఇద్దరం కలిసి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కిస్తామని బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు వార్షిక ఆదాయం 4 లక్షల డాలర్ల కంటే తక్కువగా ఉన్న వారికి పన్ను పెంచబోమని కమలా హ్యారిస్ హామీ ఇచ్చారు. ధనవంతుల దగ్గర్నుంచి పన్ను వసూలు చేస్తామని ఒక ట్వీట్‌లో స్పష్టం చేశారు.
అలాస్కాలో ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్ష పదవిని విడిచిపెట్టేది లేదని చెబుతున్న డొనాల్డ్ ట్రంప్ అలాస్కా రాష్ట్రంలో నెగ్గారు. దీంతో ఆయన ఖాతాలోకి మరో మూడు ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అలాస్కా విజయంతో ట్రంప్ ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 217కి చేరుకుంది. ట్రంప్‌కి 56.9శాతం ఓట్లు వస్తే, అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు 39.1శాతం ఓట్లు వచ్చాయి. 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు గాను బైడెన్‌కు ఇప్పటికే 279 ఓట్లు లభించాయి. అలాస్కా సెనేట్ స్థానంలో రిపబ్లికన్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. దీంతో 100 స్థానాలున్న సెనేట్‌లో ఆ పార్టీ బలం 50కి చేరుకుంది.
బైడెన్‌కి తోడుగా ప్రపంచదేశాధినేతలు
ఒకవైపు ట్రంప్ ఓటమిని అంగీకరించకుండా, అధికార బదలాయింపు ప్రక్రియ క్లిష్టరతమౌతోన్న వేళ, కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌కి ప్రపంచ దేశాధినేతలు కరోనా మహమ్మారి, వాతావరణ మార్పు, ఇతర విషయాలపై సహకరిస్తామని మద్దతు తెలుపుతున్నారు. ఉత్తర కొరియాతో అణ్వాయుధ ఉద్రిక్తతలను తగ్గించడానికి, దక్షిణ కొరియాతో కలిసి పనిచేస్తానని జోబైడెన్ తెలిపినట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే –ఇన్ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతని పెంపొందించడానికి దక్షిణ కొరియాతో భాగస్వాములమౌతామని బైడెన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య అణ్వాయుధ ఉద్రిక్తతల నివారణకు ట్రంప్ కాలంలో కృషి జరిగిందని, దాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని మూన్ అన్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా బైడెన్‌ని కోరినట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించినట్లు జపాన్ ప్రధాని యోషిహిడే సుగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment