
శ్రీలంకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వివరాలను ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలియజేశారు. వరదలు, ఇతర విపత్కర ఘటనలలో 10 మంది మృతిచెందారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు.
భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలకూలాయి. పొలాలు నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా పలుచోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రాజధాని కొలంబోతో పాటు రతన్‌పురా జిల్లాలో వరదల కారణంగా ఆరుగురు మృతిచెందారు. కొండచరియలు విరిడిపడటంతో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చెట్టు కూలడంతో ఒకరు మృతి చెందారు. పలు ఘటనల్లో ఆరుగురు అదృశ్యమయ్యారు.
ముంపు ప్రాంతాల నుంచి ఐదువేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వివిధ ఘటనల్లో 400కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నావికాదళంతో పాటు ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలను చేపడుతున్నారు. మే మధ్య నుంచి శ్రీలంకలో వాతావరణం ప్రతికూలంగా మారింది.