జాబ్స్‌ కాదు.. ఏఐతో ఇంకా చాలా పోవచ్చు: సత్య నాదెళ్ల | Satya Nadella Warns Of Bigger AI Threat Beyond Job Losses, Says Power Must Not Rest With A Few Companies | Sakshi
Sakshi News home page

జాబ్స్‌ కాదు.. ఏఐతో ఇంకా చాలా పోవచ్చు: సత్య నాదెళ్ల

Jun 15 2026 9:00 AM | Updated on Jun 15 2026 11:04 AM

The Real Danger of AI Goes Beyond Jobs Says Satya Nadella

కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల ఉద్యోగాలను తినేస్తుందనే భయాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ వల్ల సృష్టించే విలువ, సంపద, జ్ఞానం అన్నీ కొద్ది కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమైతే ఏం జరుగుతుందో చెబుతూ ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగాలు పోవడమే కాదు.. అంతకు మించిన ముప్పు పొంచి ఉందని అంటున్నారాయన.

ఏఐ వల్ల వచ్చే లాభాలు, జ్ఞానం, వ్యాపార విలువ అంతా కొద్ది కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమవడం అసలు ముప్పని సత్య నాదెళ్ల హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన సుదీర్ఘ పోస్టులో నాదెళ్ల.. ఏఐ విప్లవాన్ని కేవలం మరో సాంకేతిక మార్పుగా చూడకూడదన్నారు. అలా జరిగితే మిగతా సంస్థలు తమ సొంత పరిజ్ఞానం, అనుభవం, పోటీపడే సామర్థ్యాన్ని కోల్పోయి పూర్తిగా వాటిపైనే ఆధారపడాల్సి వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.

గతంలో డిజిటల్‌ టూల్స్‌ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడానికి మాత్రమే ఉపయోగపడేవని.. కానీ ఇప్పుడు మనుషులు, ఏఐ వ్యవస్థలు పరస్పరం నేర్చుకునే కొత్త దశలోకి ప్రపంచం అడుగుపెడుతోందని వివరించారు. దీనిని ఆయన "కాగ్నిటివ్‌ లూప్‌"గా అభివర్ణించారు. భవిష్యత్తులో సంస్థల విజయాన్ని నిర్ణయించేది కేవలం డబ్బు లేదంటే యంత్రాలో కాదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అనుభవం, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం, సృజనాత్మకత ఎంత ముఖ్యమో.. ఏఐ ఆధారంగా సంస్థలు సొంతంగా అభివృద్ధి చేసుకునే సామర్థ్యాలు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. అయితే ఈ రెండింటిలోనూ మనిషే కేంద్రబిందువుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. 

ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. లక్ష్యాలను నిర్దేశించడం, కొత్త ఆలోచనలను సృష్టించడం, విభిన్న రంగాల మధ్య సంబంధాలను గుర్తించడం వంటి అంశాల్లో మనుషుల పాత్ర కీలకంగానే ఉంటుందని పేర్కొన్నారు. అయితే నాదెళ్ల ఆందోళన ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది కాదు. కొద్ది సంఖ్యలో ఉన్న శక్తివంతమైన ఏఐ మోడళ్లపై ప్రపంచంలోని కంపెనీలు పూర్తిగా ఆధారపడిపోతే.. తమ సొంత పరిజ్ఞానం, మేధోసంపత్తి, అనుభవాన్ని క్రమంగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. 

"ప్రతి రంగంలోని ప్రతి సంస్థ సృష్టించిన విలువ అంతా కొద్ది ఏఐ మోడళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రపంచాన్ని మనలో ఎవరూ కోరుకోరు" అని వ్యాఖ్యానించారాయన.

ఈ సందర్భంలో ఆయన ప్రపంచీకరణ తొలి దశను ఉదాహరణగా ప్రస్తావించారు. తయారీ పరిశ్రమలు ఒక దేశం నుంచి మరో దేశానికి తరలిపోవడంతో ఆర్థిక వృద్ధి కాగితాలపై కనిపించినా.. అనేక ప్రాంతాలు, వర్గాలు శాశ్వతంగా నష్టపోయాయని గుర్తు చేశారు. అదే పరిస్థితి ఇప్పుడు ఏఐ యుగంలోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. కంపెనీలు దశాబ్దాలుగా కూడబెట్టుకున్న అనుభవం, పరిజ్ఞానం, వ్యాపార విలువ మొత్తం ఏఐ వ్యవస్థల్లో కలిసిపోతే.. దాని ద్వారా వచ్చే లాభాలు మాత్రం కొద్ది సంస్థలకే పరిమితమయ్యే ప్రమాదాన్ని ఆయన ఎత్తిచూపారు. అందుకే "ఫ్రాంటియర్‌ మోడల్‌" కాకుండా "ఫ్రాంటియర్‌ ఎకోసిస్టమ్‌" అవసరమని నాదెళ్ల సూచించారు. అంటే.. 

కొద్ది కంపెనీలు మాత్రమే ఏఐని నియంత్రించే పరిస్థితి కాకుండా.. వివిధ దేశాలు, సంస్థలు, పరిశ్రమలు తమ సొంత ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే ఏఐ వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరుతాయని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా.. ఏఐ భవిష్యత్తుపై ఇతర సాంకేతిక దిగ్గజాలు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంత్రోపిక్‌ సీఈవో డారియో అమోడీ ఇటీవల ఏఐ కారణంగా దీర్ఘకాలిక ఉద్యోగ నష్టాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏఐ మానవ మేధస్సుతో చేసే అనేక పనులను భర్తీ చేస్తే.. ఉద్యోగాలపై శాశ్వత ప్రభావం పడొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితి మరింత తీవ్రమైతే ప్రభుత్వాలు ఉద్యోగుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాల్సి రావచ్చని కూడా సూచించారు.

మరోవైపు, ఎన్విడియా అధినేత జెన్సెన్‌ హువాంగ్‌ మాత్రం ఉద్యోగ కోతలన్నింటికీ ఏఐనే కారణమని చెప్పడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. జనరేటివ్‌ ఏఐ అనేది విస్తృతంగా అందుబాటులోకి రాకముందే అనేక సంస్థలు ఉద్యోగులను తొలగించాయని గుర్తుచేశారు. ఉద్యోగాల కోత వెనుక ఆర్థిక పరిస్థితులు, వ్యాపార వ్యూహాలు, మార్కెట్‌ మార్పులు వంటి అనేక కారణాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏఐపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ఇప్పుడు కొత్త దశకు చేరుకుంది. ఒకవైపు అపార అవకాశాలు కనిపిస్తుంటే.. మరోవైపు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల చేసిన హెచ్చరిక ఒక కీలక ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఏఐ మనిషిని మరింత శక్తివంతం చేసే సాధనంగా మారుతుందా? లేదంటే కొద్ది కంపెనీల చేతుల్లోనే శక్తిని కేంద్రీకరించి మిగతా ప్రపంచాన్ని ఆధారపడేలా చేస్తుందా? రానున్న దశాబ్దంలో ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement