ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు దేశ రాజధానిలో అడుగుపెట్టడంతో హస్తీనాలో కోలాహలం పెరిగింది. 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం ఢిల్లీ చేరుకుంది. శనివారం సైతం మరికొందరు నేతలు విచ్చేస్తున్నారు.మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా జీ20 సదస్సుకు హాజరుకావడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం ఈ భేటీకి గైర్హాజరు అవుతున్నారు.
జీ-20 శిఖరాగ్ర సదస్సుకు వేదికగా నిలిచిన భారత్‌కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. తన భార్య అక్షితా మూర్తితో కలిసి ఢిల్లీలోని విమానాశ్రయంలో దిగారు. కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే వీరికి స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనను రిషి సునాక్ దంపతులు కాసేపు వీక్షించారు. అనంతరం షాంగ్రీలా హోటల్‌కు చేరుకొని బస చేశారు.
భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని సునాక్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పలు అసక్తికర విషయాలు పంచుకున్నారు. హిందువుగా తాను గర్విస్తున్నానని అన్నారు. భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఇండియాకు రావడం వ్యక్తిగతం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. భారత్ అల్లునిగా.. జీ20 పర్యటన తనకు చాలా ప్రత్యేకమైనదని అన్నారు. తనను ప్రేమగా భారతదేశ అల్లునిగా పిలుస్తారని గుర్తు చేశారు. కాగా భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని సునాక్ వివాహామాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సునాక్ ఈ విధంగా చమత్కరించారు.
చదవండి: జీ20 సదస్సు.. ప్రత్యేకంగా వాతావరణ కేంద్రం.. ఇంకా ఎన్నో!
ఖలిస్థానీ తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు బ్రిటన్ (యునైటెడ్ కింగ్‌డమ్) భారత్‌తో కలిసి పనిచేస్తోందని రిషి సునాక్‌పేర్కొన్నారు. హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని అన్నారు. దీనికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు సహకరిస్తున్నాయని చెప్పారు.
‘తీవ్రవాదం, హింస వంటివి ఏ రూపంలో ఉన్న బ్రిటన్‌లో వాటికి తావులేదు. అందుకే ఖలిస్థానీ అనుకూల తీవ్రవాదాన్ని అధిగమించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఇటీవల బ్రిటన్ భద్రతా మంత్రి టామ్ తుగేన్‌ధాట్ భారత్‌లో పర్యటించారు. లండన్‌లోని భారతీయ దౌత్య సిబ్బందికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. భారత్ ఆందోళనలు బ్రిటీష్ ప్రభుత్వానికి తెలుసు. ఇది భారత్ సమస్య మాత్రమే కాదు బ్రిటన్‌ది కూడా. కాబట్టి కీలక సమాచారాన్ని పంచుకుంటూ.. ఈ తరహా హింసను నిర్మూలించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నాం. హింసాత్మక చర్యలు సరైనవి కావు. బ్రిటన్‌లో దానిని నేను సహించను’ అని సునాక్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలిస్థానీ వాదులు గత మార్చిలో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఖలిస్థానీ కార్యకలాపాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన యూకే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల భారత్‌కు వచ్చిన ఆదేశ భద్రతా మంత్రి కూడా దీనిపై ప్రధానంగా చర్చలు జరిపిన అనంతరం తీవ్రవాదంపై కలసికట్టు పోరుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ స్పష్టం చేసింది. అక్కడ ఖలిస్థానీ తీవ్రవాదం నిరోధానికి ప్రత్యేకంగా 95,000 పౌండ్లు(కోటి రూపాయలు) కూడా కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment