
Military Strengths Of Russia And Ukraine: ట్యాంకుల నుంచి శతఘ్నుల వరకు పదాతి దళం నుంచి మారణాయుధాల వరకు యుద్ధ విమానాల నుంచి నౌకల వరకు ఉక్రెయిన్‌పై మూడువైపులా రష్యా పకడ్బందీగా బలగాలను మోహరించింది. రష్యా, బెలారస్‌లు సంయుక్తంగా పది రోజులుగా చేస్తున్న సైనిక విన్యాసాలతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతుందన్న ఆందోళన నెలకొంది.
ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత రష్యా పకడ్బందీగా ఒక దేశంపై యుద్ధ సన్నాహాలు చేయడం ఇదే మొదటి సారి. రష్యాకి చెందిన సకల రక్షణ వ్యవస్థలు గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ చుట్టూ మోహరించి ఉన్నాయి. రష్యాకు చెందిన 100 బెటాలియన్ టాక్టికల్ గ్రూప్స్ (బిటిజి) సరిహద్దుల్లో మాటువేశాయి. ఒక్కో గ్రూప్‌లోని వెయ్యిమందికి పైగా సైనికులు ఉన్నారు. వివిధ ప్రాంతాలలో దాదాపు 2 లక్షల మంది సైనికులు మోహరించి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు.
2014లో జరిగిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో డజను కంటే తక్కువ బిటిజిలను మోహరించిన రష్యా ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 100కి పెంచింది. యుద్ధం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని చెప్పడానికి రష్యా దగ్గర కంబైన్డ్ ఆర్మీస్ 11 ఉంటే వాటిలో 10 ఉక్రెయిన్ సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఏ క్షణంలో ఏ అవసరం వస్తుందేమోనని వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. యుద్ధ సన్నాహాల్లో భాగంగా ఫిబ్రవరి 10 నుంచి రష్యా–బెలారస్ సంయుక్తంగా సైనిక విన్యాసాలు, క్షిపణి పరీక్షల్ని నిర్వహిస్తోంది.
వీటిని చూస్తుంటే రష్యా సమరశంఖాన్ని పూరించినట్టేనని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సలివాన్ హెచ్చరించారు. రష్యా ఉత్తరం, మధ్య, దక్షిణం దిశల్లో ఎటు వైపు నుంచైనా దాడులకి దిగే అవకాశముంది. ఉత్తరం వైపు నుంచి వస్తే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ రూట్ అయిన డోంటెస్క్ నుంచి, లేదంటే దక్షిణవైపు నుంచి అంటే సముద్ర మార్గం ద్వారా దాడులు చేయడానికి స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
రష్యా మిలటరీ సత్తాపై అధ్యయనం చేసిన రాండ్ కార్పొరేషన్‌కు చెందిన విశ్లేషకుడు స్కాట్ బాస్టన్ ఇరు దేశాల ఉద్రిక్తతల గురించి మాట్లాడుతూ ‘‘అధినేత నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే దాడులు చేయడానికి సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఉద్రిక్తతలు చల్లారతాయనడానికి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఆధారాలు లేవు. అయితే మిలటరీని సన్నద్ధం చేసిన స్థాయిలో రష్యా వాస్తవంగా యుద్ధానికి దిగుతుందని భావించడం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
ఎవరిదెంత వ్యయం
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలటరీ ఉన్న దేశాల్లో రష్యా అయిదో స్థానంలో ఉంది. రక్షణ రంగానికి ఆ దేశం మొత్తం బడ్జెట్‌లో 11.4 శాతం ఖర్చు చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ తమ బడ్జెట్‌లో 8.8శాతం ఖర్చు చేస్తోంది. 2020లో రష్యా రక్షణపై 6170 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే, అదే ఏడాది ఉక్రెయిన్ 590 డాలర్లు ఖర్చు చేసినట్టుగా స్టాక్‌హోమ్ ఇంటర్నేనషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది.
రష్యా–ఉక్రెయిన్ బలాబలాలు
రష్యా, ఉక్రెయిన్ మిలటరీ బలాబలాలను చూస్తే ఎక్కడా పొంతన కుదరదు. రష్యా మిలటరీని ఉక్రెయిన్ నామమాత్రంగా కూడా ఢీ కొనలేదు. అయినప్పటికీ అమెరికా, బ్రిటన్ అండదండలతో ఆ దేశం ధీమాగా ఉంది. అగ్రరాజ్యాలు తమ రక్షణ కోసం నాటో బలగాల్ని తరలిస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఆశతో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 12 దేశాలు సభ్యులుగా మొదలైన నాటోలో ప్రస్తుతం 30 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, డెన్మార్క్ వంటి దేశాలతో కూడిన నాటో బలగాలు ఉక్రెయిన్‌కి అండగా నిలిస్తే ఇరు పక్షాల మధ్య భీకర పోరు జరుగుతుంది. రష్యా, ఉక్రెయిన్ సైనిక శక్తిలో ఎంత అసమతుల్యత ఉందో ఇది చూస్తే అర్థమవుతుంది.
– నేషనల్ డెస్క్, సాక్షి.
Comments
Please login to add a commentAdd a comment