![Russia Says it will Drastically cut Military Activity near Kyiv, Chernihiv - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/29/russia_0.jpg.webp?itok=QfFOXfB8)
ఇస్తాంబుల్: ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునేందుకు నెల రోజులుగా రష్యా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవడమనేది అనుకున్నంత సులభం కాదని రష్యా నిర్ధారణకొచ్చినట్లు తెలుస్తోంది. అయినా పట్టువీడకుండా అత్యాధునిక ఆయుధాలను సైతం రష్యా ఉపయోగిస్తోంది. అయితే ఇదంతా ఒకవైపు కొనసాగుతుంటే.. మరోవైపు మంగళవారం రోజున ఇస్తాంబుల్‌లో జరిగిన ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి చర్చల్లో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది.
శాంతి చర్చల్లో విశ్వాసాన్ని పెంచడానికి కీవ్, చెర్నీవ్ నుంచి బలగాలను వెనక్కి తీసుకుంటామని రష్యా ప్రకటించింది. పరస్పర విశ్వాసం, తదుపరి చర్చలు జరగడానికి అవసరమైన పరిస్థితుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి అలెగ్జాండర్ ఫోమిన్ తెలిపారు. రష్యా ప్రతినిధి బృందం మాస్కోకు తిరిగొచ్చిన తర్వాత ఇస్తాంబుల్‌లో చర్చించిన విషయాలు, తీసుకున్న నిర్ణయాలను మరింత విపులంగా వెల్లడిస్తామని రష్యా జనరల్ స్టాఫ్ ఫోమిన్ చెప్పారు.
చదవండి: (రష్యా సైనికుల దురాగతం... ఉక్రెయిన్ మహిళపై అత్యాచారం)
యుద్ధం మొదలై నెలరోజులు దాటిపోయిన వేళ.. ఉక్రెయిన్, రష్యా మధ్య మరోసారి శాంతి చర్చలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఇస్తాంబుల్ చేరుకున్న ఇరుదేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా దీనికి హాజరయ్యారు. తమ ప్రాథమిక లక్ష్యాలను ఈ చర్చల ద్వారా సాధిస్తామని రష్యా విదేశాంగమంత్రి సెర్గె లవ్రోవ్ వెల్లడించారు. యుద్ధం మొదలైన తర్వాత ఇరువర్గాల మధ్య బెలారస్, పొలాండ్ సరిహద్దుల్లో మూడు దఫాలు చర్చలు జరిగాయి. అయితే శాంతి దిశగా ఎలాంటి ముందడుగూ పడలేదు.
Comments
Please login to add a commentAdd a comment