కీవ్: ‘మీ వద్ద చాలా ఆయుధాలున్నాయి.. ఆ విషయం మాకు తెలుసు. కానీ మీకు బలం లేదు. మమ్మల్ని గెలిచే సత్తా అంతకన్నా లేదు’ అని రష్యాను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఇప్పటికే ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం చోటు చేసుకుని వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అటు రష్యా సైనికులు, ఇటు ఉక్రెయిన్ సైనికులే కాకుండా సాధారణ పౌరులు సైతం ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్ వీడి వెళ్లాలని యత్నించిన పలువురిపై రష్యా దాడి చేయడంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. అందులో ఓ చిన్నారి కూడా ఉండటం అక్కడ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.
కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒకవైపు చర్చలకు తాము సన్నద్ధమంటూనే మరొకవైపు రష్యాను మరింతగా రెచ్చగొట్టే యత్నం చేస్తున్నాడు. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మీకు ఆ సత్తా లేదు. మమ్మల్ని గెలవలేరు అంటూ తాజాగా ఓ వీడియో సందేశాన్ని ఇవ్వడం మళ్లీ పరిస్థితి మొదటికే వచ్చేలా ఉంది. ‘రష్యా మళ్లీ గత పరిస్థితిని రిపీట్ చేయాలని చూస్తోంది. సూడో రిపబ్లిక్స్ గత అనుభవాన్ని గుర్తుచేస్తున్నారు. స్థానిక నాయకుల్ని భయపెట్టే యత్నం చేస్తోంది రష్యా. పదవుల్లో ఉన్నవారిపై ఒత్తిడి తెస్తోంది. ఏదో ఒక రకంగా దోచుకునే యత్నం చేస్తోంది. మీరు ఎన్ని యత్నాలు చేసినా మమ్మల్ని మాత్రం జయించలేరు. మీ దగ్గర ఆయుధాలే ఉన్నాయి. గెలిచే సత్తా లేదు’ అంటూ జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు.
12 వేల మంది రష్యా సైనికుల్ని మట్టుబెట్టాం..
ఇప్పటివరకూ 12వేల మంది రష్యా సైనికుల్ని మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ చెప్పుకొంటుంది. సుమారు 1,300 మంది ఉక్రెయిన్ సైనికులు మాత్రమే ఇప్పటివరకూ మృతిచెందినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment