ఉక్రెయిన్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది, అక్కడున్న భారతీయులు సహా అంతా బంకర్లలోకి వెళ్లి తలదాచుకుంటున్నారు. నాలుగైదు రోజులుగా ఈ వార్తలు వింటున్నాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా బంకర్‌లో దాక్కున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. అసలు ఏమిటీ బంకర్లు, వాటిలోకి వెళితే ఉండే రక్షణ ఏంటి? వాటిని ఎందుకు కట్టారు? ఎలా కట్టారు? మన దేశంలోనూ ఉన్నాయా? అనే ప్రశ్నలెన్నో తలెత్తుతున్నాయి.ఆ వివరాలేమిటో తెలుసుకుందామా..
యుద్ధం, విపత్తు ఏదైనా.. రక్షణ
బంకర్ల ఏర్పాటు ప్రధాన లక్ష్యం యుద్ధాలు, విపత్తుల నుంచి రక్షణ పొందడం కోసమే. సింపుల్‌గా చెప్పాలంటే.. భూమిలో (అండర్‌గ్రౌండ్) రహస్యంగా కట్టుకునే గదులు, ఇళ్లనే బంకర్లు అనొచ్చు. నలుగురికి సరిపడే స్థాయి నుంచి.. పదుల సంఖ్యలో తలదాచుకోవడానికి వీలుగా బంకర్లను కట్టుకుంటుంటారు. అత్యవసర పరిస్థితిలో పనికొచ్చే మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, నీళ్లు, ఆహారం, జనరేటర్లు వంటివాటిని బంకర్లలో సిద్ధంగా ఉంచుకుంటారు.
చదవండి: ఊహించని పరిణామం.. రష్యాకు మరో షాకిచ్చిన ఉక్రెయిన్ సైనికులు
బంకర్ ఏదైనా సరే.. ఓ వైపు నుంచి చిన్నగా ఉపరితలానికి దారి, మెట్లు ఉంటాయి. ఎలాంటి కిటికీలుగానీ, ఇతర మార్గాలుగానీ దాదాపుగా ఉండవు. లోపల దాక్కున్నవారికి ఊపిరి ఆడేందుకు వీలుగా గాలి వచ్చిపోయేలా వెంటిలేషన్ ఏర్పాటు చేస్తారు.యుద్ధ సంక్షోభ ప్రాంతాల్లో..బంకర్ల వినియోగం చాలాకాలంగా ఉన్నా.. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వాటి వినియోగం ఎక్కువైంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో వైమానిక దాడుల కారణంగా బంకర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రధానంగా యూరప్, మధ్య ఆసియా దేశాలు, అమెరికాలో ఆయా దేశాల సైన్యం, రహస్య విభాగాలు బంకర్లు కట్టుకుని పోరాడగా.. జనం కూడా రక్షణ కోసం పెద్ద సంఖ్యలో బంకర్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్‌లో ఉన్న బంకర్లలో చాలా వరకు ఆ సమయంలో కట్టినవే.
చదవండి: పుతిన్ తలను తెగనరకండి.. రష్యా కుబేరుడి సంచలన ప్రకటన
► తరచూ యుద్ధాలు, తిరుగుబాట్లు జరిగే ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పలు ఇతర గల్ఫ్ దేశాలు, చైనాతో సరిహద్దుల్లోని దేశాలు, ఆఫ్రికా ఖండంలోని సంక్షుభిత దేశాల్లో బంకర్లు నిర్మించుకోవడం సాధారణ విషయమే.
► ఎప్పుడూ ఏదో అలజడి ఉండే దేశాల్లో చాలా మంది ధనికులు, రాజకీయ నాయకులు.. విలాసవంతమైన బంకర్లు నిర్మించుకుంటుంటారు.
► అమెరికా, చెక్ రిపబ్లిక్, చైనా వంటి కొన్నిదేశాల్లో.. అణు బాంబుల దాడిని కూడా తట్టుకునేలా భూమిలో ఏకంగా పది, పదిహేను అంతస్తుల లోతు వరకు ఉండే భారీ బంకర్లు ఉన్నాయి. పలుచోట్ల కొండలు, గుట్టలను తొలిచి బంకర్లు నిర్మించారు. అవి సమీపంలో అణుదాడి జరిగినా తట్టుకునేలా ఉంటాయి.
గుహల్లా కొన్ని.. ఇళ్లలా కొన్ని..
► భూమి అడుగున గుహల్లా తవ్వి వాడుకునే బంకర్లు సాధారణమైనవి. తీవ్రవాద ప్రాంతాల్లో, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వంటి దేశాల్లో తిరుగుబాటు దారులు ఇలాంటి బంకర్లను వాడుతుంటారు. మిగతావాటితో పోలిస్తే వాటికి ఖర్చు తక్కువ. కానీ రక్షణ, సదుపాయాలు కూడా తక్కువే.
► భూమిలో పెద్ద గుంత తవ్వి, దాని అడుగు నుంచీ కాంక్రీట్‌తో ఇల్లులా నిర్మించి.. పైన కొంత ఎత్తున మట్టిని కప్పేసేవి పెద్ద, భారీ బంకర్లు. సైన్యం వాడేందుకు, రహస్య ఆపరేషన్ల కోసం, యుద్ధాలు జరిగే ప్రాంతాలు, సరిహద్దుల్లో ప్రజల కోసం ఇలాంటివి నిర్మిస్తారు. వీటిలో రక్షణ సదుపాయాలు ఎక్కువ.
► కంటెయినర్లలా రెడీమేడ్‌గా ఉక్కుతో తయారు చేసే బంకర్లూ ఎక్కువే. భూమిలో అవసరమైన మేర గుంత తవ్వి ఈ రెడీమేడ్ బంకర్లను అందులో పెట్టి.. పైన మట్టి కప్పేస్తారు. అమెరికా, యూరప్ దేశాల్లో జనం ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటుంటారు.
► ఏర్పాటు చేసుకునే బంకర్‌ను బట్టి కనీసం రూ.10 లక్షల నుంచి ఖర్చు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
► చాలాచోట్ల బంకర్లపైన భూమిపై చిన్నపాటి పార్కులు, లాన్, గోల్ఫ్ కోర్సులు, చిన్నపాటి రేకుల షెడ్లు వంటివి ఏర్పాటు చేస్తుంటారు.
దేశంలో.. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో..
మన దేశంలోనూ జమ్మూకశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో విదేశీ సరిహద్దుల వెంబడి బంకర్లు ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో మన ఆర్మీతోపాటు సాధారణ జనం కూడా బంకర్లు కట్టుకుంటుంటారు. పాకిస్తాన్ సైన్యం తరచూ కాల్పులు జరుపుతుండటం, ఉగ్రవాదుల చొరబాట్ల నేపథ్యంలో.. సరిహద్దుల్లోని ప్రజలకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వేల సంఖ్యలో బంకర్లను నిర్మించి ఇస్తోంది. అందులో కుటుంబాలకు వ్యక్తిగత బంకర్లతోపాటు ఎక్కువ మంది తలదాచుకునేలా కమ్యూనిటీ బంకర్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే సుమారు 10వేల బంకర్లను నిర్మించినట్టు అధికారులు తెలిపారు. ఇవన్నీ పాకిస్తాన్, ఆక్రమిత కశ్మీర్ సరిహద్దులకు మూడు కిలోమీటర్ల లోపు.. కీలకమైన రాజౌరీ, పూంఛ్, ద్రాస్ వంటి సెక్టార్లలో ఉన్నట్టు వివరించారు.
మనకు ఆపద వస్తే ఎలా?
మన దేశంలో అత్యవసర పరిస్థితి వస్తే.. రాష్ట్రప తి, ప్రధాని, ఇతర కీలక ప్రముఖులకు రక్షణ కల్పించేలా బంకర్లు ఉన్నట్టు ప్రచారంలో ఉంది. కానీ కచ్చితమై ధ్రువీకరణ లేదు. దేశంలో పాకి స్తాన్, చైనా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనే బంక ర్లున్నాయి. అంతేతప్ప ఎక్కడా బంకర్లు అనేవే లే వని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో భారతదేశం ఎప్పుడూ ప్రధాన యుద్ధరంగంలో లేదని.. అందువల్ల మన దేశానికి బంకర్ల అవసరమే రాలేదని అంటున్నారు. అంతేకాదు.. ఒకవేళ వైమానిక, క్షిపణి దాడులు జరిగినప్పుడు సురక్షితంగా ఉండేందుకు ఏం చేయాలి?, ఎక్కడికి వెళ్లాలన్న దానిపై మన దేశంలో ఎవరికీ అవగాహన కూడా లేదని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment