పరిశీలనలో గల్ఫ్ దేశాలు, ఫిన్లండ్
న్యూఢిల్లీ/లండన్: బంగ్లాదేశ్ తాజా మాజీ ప్రధాని షేక్ హసీనాకు రాజకీయ ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్ వెనకాడుతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఆమె ఇతర అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొంతకాలం ఆమె భారత్‌లోనే ఉండనున్నారు. రిజర్వేషన్ల రగడ శ్రుతి మించి పరిస్థితి చేయి దాటిపోవడంతో సోమవారం మధ్యాహ్నం ఆమె రాజీనామా చేసి సోదరి షేక్ రెహానాతో కలిసి ఢిల్లీ చేరుకోవడం తెలిసిందే. తాత్కాలిక ఆశ్రయం నిమిత్తం వీలైనంత త్వరగా లండన్ వెళ్లాలని భావించారు.
కానీ బంగ్లాతో తాజాగా చెలరేగిన హింసాకాండకు బాధ్యురాలిగా హసీనాపై విచారణ జరిగే పక్షంలో ఆమెను స్వదేశానికి అప్పగించకుండా చట్టపరమైన రక్షణ కలి్పంచలేమని బ్రిటన్ సంకేతాలిచి్చంది. తాజా హింసాకాండపై ఐరాస సారథ్యంలో స్వతంత్ర దర్యాప్తు జరగాలని బ్రిటన్ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియాతో పాటు బెలారస్ వంటి దేశాలకు వెళ్లే అవకాశాలను హసీనా పరిశీలిస్తున్నట్టు సమాచారం. తన కుటుంబ సభ్యులున్న ఫిన్లండ్ వెళ్లే ఆలోచన కూడా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం హసీనా, రెహానా ఢిల్లీలోనే రహస్య ప్రాంతంలో ఉన్నారు. రెహానాకు బ్రిటన్ పౌరసత్వముంది. ఆమె కూతురు తులిప్ సిద్దిఖ్ బ్రిటన్‌లో అధికార లేబర్ పార్టీ ఎంపీ కూడా.
దేశం వీడే ముందు...
హసీనా రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను వీడేముందు జరిగిన నాటకీయ పరిణామాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆమె సోమవారం ఉదయం ఢాకాలో తన అధికారిక నివాసంలో త్రివిధ దళాధిపతులు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆందోళనలను అదుపు చేయలేకపోతున్నారంటూ ఆగ్రహించారు. పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. ఆ దశ ఎప్పుడో దాటిపోయిందని వారు బదులిచ్చారు. అధికారం వీడేలా హసీనాను ఒప్పించేందుకు నాలుగు గంటల పాటు ప్రయత్నించారు రాజీనామా చేసి దేశం వీడటమే మార్గమని చెల్లెలు రెహానాతో కూడా చెప్పించారు.
అదే సమయంలో విద్యార్థులు, యువకులు కర్ఫ్యూను ధిక్కరించి మరీ ప్రధాని అధికార నివాసాన్ని ముట్టడించేందుకు దేశ చరిత్రలోనే కనీవినీ ఎరగని సంఖ్యలో ఢాకా వీధుల గుండా పోటెత్తసాగారు. దాంతో, ‘‘పరిస్థితి చేయి దాటుతోంది. గంటలోపే జనప్రవాహం వచ్చిపడొచ్చు, 45 నిమిషాల్లో సర్వం సర్దుకుని దేశం వీడా’లంటూ హసీనాకు సైనిక ఉన్నతాధికారులు స్పష్టం చేశారు! విదేశాల్లో ఉన్న కుమారుడు కూడా ఫోన్లో అదే మాట చెప్పిన మీదట ఆమె అంగీకరించారు. ప్రజలనుద్దేశించి చివరగా సందేశమివ్వాలని భావించినా, అంత సమయం లేదని అధికారులు చెప్పడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. సోదరితో కలిసి ఇంటి ఆవరణలో సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ ఎక్కారు. అధ్యక్ష నివాసం చేరుకుని ఆయనకు లాంఛనంగా రాజీనామా సమర్పించారు. హుటాహుటిన విమానాశ్రయం చేరుకుని, సిద్ధంగా ఉన్న సైనిక రవాణా విమానమెక్కి దేశం వీడారు.
Comments
Please login to add a commentAdd a comment