అందమైన జంట, అన్యోన్య దాంపత్యం, ముచ్చటైన జంట.. ఇలాంటి పదాలను తరచూగా వింటూనే ఉంటాం. ఎవరైనా భార్యాభర్తలు కలహాలు లేకుండా కాపురం చేస్తున్నా,, ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా జీవిస్తున్నా ఈ పదాలతోనే వాళ్లను పొగడ్తల్లో ముంచేస్తాం. ఇద్దరు మనుషులు, వారి మనసులు కలిసి చేసే జీవనప్రయాణమే దాంపత్యం. ఏ సంప్రదాయం అయినా ఒక భర్తకు ఒక భార్య ఉండటమే చూడటానికి బాగుంటుంది. కానీ కొన్ని ఆచారాల్లో ఓ వ్యక్తి ఇద్దరు లేదా ఎంతమందినైనా పెళ్లి చేసుకునే వీలు కూడా ఉంటుంది.
అయితే ఇష్టమొచ్చినన్ని పెళ్లిళ్లు చేసుకునే స్వేచ్ఛ మహిళలకు ఎందుకు ఉండకూడదు. ఈ ఆలోచన మనలో ఎంతమందికి వచ్చిందో తెలియదు. కానీ దక్షిణాఫ్రికాలో మహిళలు, పురుషులకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న సామాజికవేత్తలు దీనిపై పోరాడుతున్నారు. ప్రపంచంలో అత్యంత ఉదారమైన రాజ్యాంగవ్యవస్థల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ఇప్పటికే అక్కడ స్వలింగ వివాహాలు, బహుభార్యత్వం అమల్లో ఉన్నాయి. తాజాగా బహుభర్తృత్వంపై వెల్లువెత్తిన ప్రతిపాదనలను ఆ దేశ ప్రభుత్వం స్వీకరించింది. దేశంలోని మహిళలు అనేక మంది పురుషులను పెళ్లాడేందుకు చట్టబద్ధమైన అనుమతులు ఇవ్వడాన్ని పరిశీలిస్తూ సమగ్ర ప్రతిపాదనలతో ఓ ఫైలును డాక్యుమెంట్‌ను సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు హోంమంత్రిత్వశాఖ గ్రీన్ పేపర్‌ను జారీ చేసింది.
మహిళలకు ఒకరి కంటే ఎక్కువ భర్తలను అనుమతించాలన్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం చేసిన ప్రతిపాదన దేశంలో విస్తృత చర్చకు దారితీసింది. బహుభర్తృత్వ ప్రతిపాదనలను అక్కడి మతసంస్థల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరిలో అక్కడి బుల్లితెర ప్రముఖుడు మౌసా సెలేకూ సైతం ఉన్నారు. నలుగురు భార్యలున్న ఈయన.. బహుభర్తృత్వం ఆఫ్రికన్ సంస్కృతి సర్వనాశనమవుతుందని విమర్శించారు. ఓ మహిళ ఎన్నడూ పురుషుడి స్థానాన్ని భర్తీ చేయలేదని, బహుభర్తృత్వం ద్వారా పిల్లలు పుడితే ఎవరి తండ్రి ఎవరనేది ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఓ మహిళకు ఒకరిని మించి భర్తలున్నప్పుడు వారంతా ఆమె ఇంటి పేరును స్వీకరిస్తారా? అని ప్రశ్నించారు.
అలాగే ఆఫ్రికన్ క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు రెవరెండ్ కెన్నెత్ మెషో మాట్లాడుతూ.. బహుభార్యాత్వం ఆచరణలో ఆమోదయోగ్యమైనది. కానీ బహుభార్యత్వం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అసూయ, నాదీ అన్న అధిపత్య ధోరణితో ఉండే పురుషాధిక్య సమాజంలో ఒక మహిళ ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చనేది పనిచేయదన్నారు. అయితే చట్టాన్ని మార్చుతూ చేసిన ప్రతిపాదనలోని కీలక సమస్యలపై సాంప్రదాయ నాయకులతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు, ఇతర గ్రూప్‌లో ఆ దేశ హోంమంత్రిత్వశాఖ సంప్రదింపులు జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment