సియోల్ : ఓ మహిళా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్య ఎయిర్ ఫోర్స్ చీఫ్ రాజీనామాకు దారితీసింది. ఉద్యోగి మరణానికి బాధ్యత వహిస్తూ.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ లీ సియాంగ్‌యాంగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పురుష సహోద్యోగి లైంగిక వేధింపుల కారణంగా ఓ మహిళా మాస్టర్ సార్జంట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దీంతో జనరల్ లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్... జనరల్ లీ రాజీనామాను ఆమోదించారు. కాగా, మహిళా సార్జంట్ వేధింపులకు సంబంధించి ఓ ఎయిర్ ఫోర్స్ మాస్టర్ సార్జంట్‌ను అరెస్ట్ చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. మార్చి నెలలో సదరు నిందితుడు కారులో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
అయితే, ఉన్నతాధికారులు ఈ సంఘటనను బయటకు రాకుండా చూడ్డానికి ప్రయత్నించారని, నిందితుడితో ప్రైవేటు సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ బాధితురాలపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలి కుటుంబం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమె మే నెలలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. ప్రెసిడెన్షియల్ పిటిషన్‌ను దాఖలు చేసింది. కేసును తుడిచిపెట్టడానికి ప్రయత్నించిన ఉన్నతాధికారులకు శిక్ష విధించాలంటూ శుక్రవారం మధ్యాహ్నం 34వేలకు పైగా మంది ఆ పిటిషన్‌పై సంతకం చేశారు. దీనిపై ప్రెసిడెంట్ మూన్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment