
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాలుస్తోంది. నిధుల లేమితో దేశ అవసరాలకు తగ్గ ఇంధనం దిగుమతి చేసుకోలేక ప్రభుత్వం చేతులెత్తింది. దీంతో దేశమంతా విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
మంగళవారం దేశ పవర్ గ్రిడ్‌ను రెండుగంటలు నిలిపివేస్తున్నట్లు లంక ప్రజావసరాల కమిషన్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో విడతలవారీగా కోతలుంటాయని తెలిపింది. ఇంధన కొరతతో జాతీయ గ్రిడ్‌కు 541 మెగావాట్ల విద్యుత్ నష్టం వాటిల్లుతోందని తెలిపింది. ఒకపక్క విద్యుత్ సంక్షోభం కొనసాగుతున్న వేళ డ్యాముల్లో నీటి నిల్వలు తగ్గడంతో జలవిద్యుదుత్పత్తి తగ్గింది.
(ఇది చదవండి: యుద్ధం ముంగిట యూరప్.. ఉక్రెయిన్‌లోకి రష్యా సైన్యం)
కాగా, కరోనా కారణంగా శ్రీలంకలో టూరిజం దెబ్బతినడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే శ్రీలంక పెట్రోలియం కార్పొరేషన్, సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ బ్యాంకులకు ప్రభుత్వం 3.3 బిలియన్ డాలర్లు మేర చెల్లింపులకు బాకీ పడింది. ప్రభుత్వం వద్ద తగినంత నిధులు లేకపోవడంతో చెల్లింపులు జరగక దేశంలోకి వచ్చిన చమురు సైతం పోర్టుల్లోనే నిలిచిపోయిందని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్నన్‌పిలి వెల్లడించారు. ఇదిలా ఉండగా పెట్రో ఉత్పత్తుల కోసం.. ఇటీవలే భారత్ సైతం లంకకు 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే.
అయితే, వంద శాతం సేంద్రియ ఉత్పత్తులను పండిచాలని శ్రీలంక ప్రభుత్వం 2021లో తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అక్కడ సంక్షోభం ఏర్పడింది. దీంతో, బ్లాక్ మార్కెట్‌లో బియ్యం, చక్కెర, ఉల్లిపాయలు సహా నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీటికి తోడు గతేడాది అక్టోబర్‌లో వంట గ్యాస్ ధర సిలిండర్ రూ. 2,657 కు చేరి రికార్డు సృష్టించింది. తాజాగా కరెంట్ కోతలుసైతం విధించడంతో ప‍్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
(ఇది చదవండి: బంగారు గనిలో పేలుడు.. 59 మంది దుర్మరణం)
Comments
Please login to add a commentAdd a comment