వాషింగ్టన్: మహమ్మారి కరోనా కాలంలో ఫేస్‌మాస్కుల వినియోగం భారీగా పెరిగిపోయింది. కోవిడ్-19 బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు దాదాపు ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరిస్తున్నారు. కొంతమంది సర్జికల్, రిస్పిరేటర్ మాస్కులు ధరిస్తుంటే, చాలా మంది ప్రజలు ఇంట్లో అందుబాటులో ఉన్న వస్త్రంతో మాస్కు తయారు చేసుకుంటున్నారు. దీంతో క్లాత్ ఫేస్ కవరింగ్ మాస్కులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అయితే ఇలాంటి మాస్కులు సురక్షితమేనా? వైరస్ కణాలను అడ్డుకోవడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయా? లేదా అన్న సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మార్కెట్లో లభించే వివిధ రకాల మాస్కుల కంటే ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులే(సింగిల్ లేయర్‌వి అయినా సరే) ఉత్తమమైనవని పేర్కొన్నారు. (చదవండి: ‘కోవిడ్’ పెరుగుతున్నా మరణాలు ఎందుకు తక్కువ!)
అదే విధంగా అవతలి వ్యక్తి దగ్గినపుడు, లేదా తుమ్మినపుడు వెలువడే నీటి తుంపరలు మనల్ని చేరకుండా ఆపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. సాధారణ వస్త్రం (ఉదా: టీషర్టు క్లాత్)తో తయారు చేసిన మాస్కులు మెడికల్ మాస్కుల కంటే ఏమాత్రం తీసిపోవని, పైగా గాలి పీల్చుకోవడంతో పాటు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు జర్నల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ మెకానిక్స్ లెటర్స్ అధ్యయనంలో తమ పరిశోధనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నావల్ కరోనా వైరస్ కణాల పరిమాణంలో ఉన్న కణాలతో కూడిన డిస్టిల్డ్ వాటర్‌ను ఇన్‌హెల్లర్‌లో నింపి, ఓ ప్లాస్టిక్ పాత్రలో దానిని అధిక ద్రవ్యరాశి గల తుంపరల రూపంలో వాటిని వదిలిపెట్టారు. వివిధ రకాల మెటీరియళ్లతో వాటిని వడకట్టి, వేటికైతే కణాలను ఆపగల శక్తి ఎక్కువగా ఉందో పరిశీలించారు. (చదవండి: ఫేస్‌మాస్క్‌ల గురించి మనకు ఏం తెలుసు?)
ఈ విషయం గురించి అధ్యయనకర్త తాహిర్ సైఫ్ మాట్లాడుతూ.. ‘‘పాత్రలో పడుతున్న ప్రతీ నానో- పార్టికల్‌ను అత్యాధునిక మైక్రోస్కోపు ద్వారా పరిశీలించాం. వాటిని లెక్కించాం. వివిధ రకాల ఫ్యాబ్రిక్‌లను అడ్డుపెట్టి లేదా నేరుగా నీటి తుంపరలను వదిలి, ఏ ఫ్యాబ్రిక్ ఎంతమేర కణాలను బ్లాక్ చేయగలిగిందో పరిశీలించినపుడు సాధారణంగా ఇంట్లో ఉపయోగించే వస్త్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించాం. నిజానికి శ్వాస పీల్చుకోకుండా అసౌకర్యాన్ని కలిగించే మాస్కుల వల్ల ఊపిరాడటం కష్టమవడమే గాకుండా, వైరస్ కణాలు కూడా లీకయ్యే అవకాశం ఉంటుంది.
మరి అలాంటి మాస్కులు ధరించినా ఉపయోగం ఉండదు కదా. నిజానికి మెడికల్ మస్కులు అందరికీ అందుబాటులో లేకపోయిన్పటికీ ఇంట్లో వాడే కామన్ ఫ్యాబ్రిక్‌లతో కూడా వైరస్ బారిన పడకుండా రక్షించుకునే అవకాశం ఉంటుందని నిరూపించడమే మా ఉద్దేశం. ఈ ప్రయోగంలో మేం మొత్తం 11 రకాల వస్త్రాల(బెడ్‌షీట్లు, కర్చిఫ్‌లు వంటివి)ను పరిశీలించాం. ఇందులో కొత్తవాటితో పాటుగా వాడినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అత్యంత వేగంతో ప్రయాణించే 100 నానోమీటర్ పార్టికల్స్‌ను కూడా సమర్థవంతంగా అడ్డుకోగలవని నిరూపితమైంది. ఇలాంటివి సింగిల్ లేయర్ మాస్కులైనా సరే ఎదుటి వ్యక్తి మాట్లాడినపుడు, తుమ్మినపుడు లేదా దగ్గినపుడు మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు’’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment