చైనా లేఖ; గెట్‌ లాస్ట్‌ అన్న తైవాన్!‌ | Taiwan Strong Counter To China Over Note To Indian Media | Sakshi
Sakshi News home page

భారత మీడియాకు చైనా లేఖ.. తైవాన్‌ కౌంటర్‌!

Published Thu, Oct 8 2020 6:19 PM | Last Updated on Thu, Oct 8 2020 8:14 PM

Taiwan Strong Counter To China Over Note To Indian Media - Sakshi

తైపీ/బీజింగ్‌/ న్యూఢిల్లీ: ‘‘తైవాన్‌ నేషనల్‌ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మాకు శుభాకాంక్షలు తెలిపే వారందరికి ధన్యవాదాలు చెబుతున్నాం. ఎన్నో కష్టనష్టాలకోర్చి స్వాత్రంత్ర్యం పొందిన ఆ రోజును పండుగలా నిర్వహించుకుంటాం. ప్రజాస్వామ్య దేశంగా మేం సాధించిన విజయాలను ఆస్వాదిస్తాం. మాతో పాటు మీరు ఇందులో భాగస్వాములు అవ్వండి. తైవాన్‌ ఎదుగుదల పట్ల మీరు కూడా గర్విస్తున్నారని ఇక్కడ తెలియజేయండి’’ అంటూ తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌- వెన్‌ నెటిజన్లను ఆహ్వానించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ప్రకటన విడుదల చేసిన ఆమె..  కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించే తమ స్వతంత్ర వేడుకలను వీక్షించాలంటూ విజ్ఞప్తి చేశారు. కాగా 1949 నాటి పౌర యుద్ధం తర్వాత తైవాన్‌ స్వతంత్ర పాలనకు మొగ్గుచూపిన విషయం తెలిసిందే.(చదవండి: యుద్ధం మొదలవుతుంది: చైనా హెచ్చరిక)

ఈ క్రమంలో 2016లో త్సాయి ఇంగ్‌‌- వెన్‌ తైవాన్‌ తొలిసారి అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత చైనాలో భాగంగా తమను గుర్తించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే, చైనా మెయిన్‌లాండ్‌లో భాగమైన తైవాన్‌ను వేరు చేసే ఏ చర్యను తాము సహించబోమని చైనా పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇక జనవరిలో రెండోసారి బాధ్యతలు చేపట్టిన త్సాయి ఇంగ్‌‌- వెన్‌.. ‘‘ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రజాస్వామ్య విలువలకు, స్వాతంత్ర్య కాంక్షకు కట్టుబడే ఉన్నాం. బీజింగ్‌ అధికారులు చెప్పే మాటలను తైవాన్‌ ఎన్నటికీ అంగీకరించబోదు. మన సార్వభౌమత్వాన్ని కాలరాసే హక్కు ఎవరికీ ఇవ్వదు’’ అంటూ మరోసారి తమ వైఖరిని స్పష్టం చేశారు. అంతేగాక అగ్రరాజ్యం అమెరికాతో సహా భారత్‌ వంటి పలు ప్రధాన దేశాలతో దౌత్య సంబంధాలు ఏర్పరచుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసి చైనాకు కంట్లో నలుసులా తయారయ్యారు.(చైనా క్షమాపణ చెప్పాల్సిందే.. నాన్‌సెన్స్‌ అన్న డ్రాగన్‌)

ఈ నేపథ్యంలో శనివారం (అక్టోబరు 10న) నేషనల్‌ డే ఉత్సవాల నిర్వహణకు సిద్ధమైన త్సాయి ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి పలు మీడియాలో ప్రకటనలు విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత రాజధాని ఢిల్లీ కేంద్రంగా పనిచేసే వార్తా పత్రికలు ప్రకటనలు (ఫుల్‌ పేజీ) ప్రచురితం చేశాయి. త్సాయి ఇంగ్‌- వెన్‌ ఫొటోతో పాటు.. ‘‘తైవాన్‌- భారత్‌ సహజ మిత్రులు’’అనే నినాదం కూడా ఇందులో దర్శనమిచ్చింది. కోవిడ్‌- 19పై పోరులో పరస్పరం సహకరించుకున్నామన్న ఉద్దేశంతో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. (‘జిన్‌పింగ్‌ను అంతగా విశ్వసించలేం’!)

మండిపడుతున్న చైనా.. భారత మీడియాకు లేఖ
ఇక ఇప్పటికే త్సాయి ఇంగ్‌- వెన్‌పై భగ్గుమంటున్న చైనా ఈ పరిణామంతో మరింత గుర్రు మీద ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఏకంగా భారత్‌తో బంధాన్ని చాటుతూ తైవాన్ వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం, భారత మీడియా సంస్థలను ఉద్దేశించి బుధవారం ఓ లేఖను విడుదల చేసింది. ‘‘సోకాల్డ్‌ ‘‘నేషనల్‌ డే ఆఫ్‌ తైవాన్‌’’ సమీపిస్తున్న సందర్భంగా మీడియా మిత్రులకు ఓ విజ్ఞప్తి చేయదలచుకున్నాం. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క చైనా ఉంది. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా ప్రభుత్వమే చైనా భూభాగమంతటినీ పాలిస్తోంది. తైవాన్‌ కూడా చైనా భూభాగంలో అంతర్భాగం. 

కాబట్టి మాతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న దేశాలన్నీ కూడా ‘‘వన్‌- చైనా పాలసీ’’ని గౌరవస్తాయని, మా విధానం పట్ల నిబద్ధతను కలిగి ఉంటాయని ఆశిస్తున్నాం. భారత ప్రభుత్వంతో కూడా మాకు అధికారిక దౌత్య సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి భారత మీడియా కూడా ప్రభుత్వ విధానాలకు కట్టుబడి తైవాన్‌ విషయంలో చైనా అనుసరిస్తున్న విధానాలను ఉల్లంఘించదని భావిస్తున్నాం. ముఖ్యంగా తైవాన్‌ను దేశంగా(నేషన్‌) అభివర్ణిస్తూ, అధ్యక్షురాలు వంటి పదాలు ఉపయోగిస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. నిజానికి మీడియా మిత్రుల పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం’’అంటూ తైవాన్‌ పట్ల తమ వైఖరిని తెలియజేస్తూ, మీడియాకు విజ్ఞప్తి చేసింది.

గెట్‌ లాస్ట్‌: తైవాన్‌ విదేశాంగ శాఖ
తమ గురించి మీడియాను ఉద్దేశించి చైనా ఎంబసీ రాసిన లేఖపై తైవాన్‌ విదేశాంగ మంత్రి జౌషిష్‌ జోసెఫ్‌ వూ ఘాటుగా స్పందించారు. ‘‘ఈ భూమీ మీద ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. అక్కడ మీడియాకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ విధానాలను ప్రేమించే ప్రజలు ఉంటారు. కానీ చైనా వంటి కమ్యూనిస్టు దేశం మాత్రం ఉపఖండ మీడియాపై సెన్సార్‌షిప్‌ విధించాలని చూస్తోంది. తైవాన్‌కు ఉన్న భారత స్నేహితులు ఇందుకు ఇచ్చే సమాధానం ఒక్కటే: గెట్‌ లాస్ట్‌!’’ అంటూ ట్వీట్‌ చేశారు. భారత మీడియాకు చైనీస్‌ ఎంబసీ జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను భారత ట్విటర్‌ యూజర్లు జోసెఫ్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ మేరకు స్పందించారు.

కాగా తైవాన్‌తో భారత్‌కు అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ, న్యూఢిల్లీలో తైపీ ఎకనమిక్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక తైపీలో ఉన్న ఇండియా- తైపీ అసోసియేషన్‌ టూరిజం, వ్యాపారం, వాణిజ్యం తదితర అంశాలను ప్రమోట్‌ చేస్తూ పలు భిన్న కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఇక తైవాన్‌- చైనా మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని భారత్‌ నిశితంగా పరిశీలిస్తోంది. అయితే అమెరికా మాత్రం డ్రాగన్‌ దేశానికి కౌంటర్‌ ఇస్తూ అన్ని విధాలా అండగా నిలబడుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement