
జుబీహుల్లా ముజాహిద్(ఫైల్ ఫొటో)
కాబూల్: అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తైన సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ అఫ్గన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ చరిత్రలో ఇదొక గొప్ప విజయం అంటూ హర్షం వ్యక్తం చేశారు. తమకు పూర్తిగా స్వేచ్ఛ, స్వాత్రంత్యాలు లభించాయని, ఆక్రమణదారులకు ఇదొక గుణపాఠమని వ్యాఖ్యానించారు. అయితే, తాము అమెరికాతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
ఈ మేరకు హమీద్ కర్జాయి ఎయిర్‌పోర్టు నుంచి అమెరికాకు చెందిన సీ-17 విమానం వెళ్లిపోయిన అనంతరం రన్‌వే నుంచే ప్రజలకు సందేశం అందించారు. ‘‘అఫ్గనిస్తాన్‌కు శుభాభినందనలు. ఈ విజయం మనందరిదీ. అమెరికాతో పాటు ఇతర ప్రపంచ దేశాలతో కూడా మేం సత్సంబంధాలు కోరుకుంటున్నాం. అంతర్జాతీయ సమాజంతో దౌత్యపరమైన సంబంధాలను మేం స్వాగతిస్తున్నాం’’ అని జుబీహుల్లా పేర్కొన్నారు. కాగా దాదాపు 20 ఏళ్లుగా అఫ్గనిస్తాన్‌లో మోహరించిన సేనలను ఉపసంహరించుకున్నట్లు, ఈ ప్రక్రియ పూర్తైందని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: Antony Blinken: అఫ్గన్‌తో దౌత్య సంబంధాలు.. అమెరికా కీలక ప్రకటన