
జెరూసలేం: పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం నబ్లాస్ సిటీపై జరిపిన దాడిలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు. 40 మంది స్థానికులు గాయపడ్డారు. గాజా స్ట్రిప్‌లో మూడ్రోజుల కాల్పుల విరమణ ముగిసిన మరునాడే ఈ దాడి జరగడం గమనార్హం.
ఈ ఏడాది తొలినాళ్లలో వెస్ట్‌బ్యాంక్‌లో వరుస దాడులకు కారకుడైన అల్–అక్సా సాయుధ దళం నేత ఇబ్రహీం అల్–నబుల్సీను ఆయన ఇంట్లోనే హతమార్చామని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నబుల్సీ, మరో ఇద్దరు సాయుధులు మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గత మూడ్రోజుల గాజా దాడులు, ప్రతిదాడుల ఘటనల్లో మొత్తంగా 46 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 311 మంది గాయపడ్డారు. పాలస్తీనాతో ఇజ్రాయెల్ ఉగ్ర సంఘర్షణలో నబుల్సీ మరణం ఒక మేలిమి ముందడుగు అని ఇజ్రాయెల్ ఆపద్ధర్మ ప్రధాని యాయిర్ లాపిద్ వ్యాఖ్యానించారు. 1967 నాటి మధ్యప్రాశ్చ్య యుద్ధానంతరం వెస్ట్ బ్యాంక్ ప్రాంతం ఇజ్రాయెల్ వశమైంది. ఆనాటి నుంచి దశాబ్దాలుగా పాలస్తీనా, ఇజ్రాయెల్ సంఘర్షణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment