
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో డొమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మరింత ముందుకు దూసుకెళుతున్నట్లుగా అనిపిస్తుంది. జార్జియాలో ఇప్పటికే ఆధిక్యంలోకి వచ్చిన జో బైడెన్ తాజాగా కీలకమైన పెన్సిల్వేనియాలోనూ ఆధిక్యంలోకి వచ్చినట్లు తెలుస్తుంది. పెన్సిల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.దీంతో పెన్సిల్వేనియాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనాలు తలకిందులవుతున్నాయి. (చదవండి : జార్జియా, నెవెడాలో దూసుకుపోతున్న బైడెన్)
ఇక డొనాల్డ్ ట్రంప్ చేతిలో కేవలం నార్త్ కరోలినా, అలస్కా రాష్ట్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకవేళ కౌంటింగ్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మాత్రం జో బైడెన్‌కు 300 ఎలక్టోరల్ ఓట్లు దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చూసుకుంటే బైడన్‌కు 264 ఎలక్టోరల్ ఓట్లు, ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. మొత్తం ఎలక్టోరల్ ఓట్లు 538 కాగా.. మెజారిటీకి 270 ఎలక్టోరల్ ఓట్లు కావాలి. ఇప్పటికే అనధికారికంగా బైడెన్ 290 ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకునే అవకాశం ఉంది.