విమానం ఎక్కుతున్న అమెరికా సైనికుడు(ఫొటో: అమెరికా రక్షణ శాఖ)
The last American soldier to leave Afghanistan: దాదాపు ఇరవై ఏళ్లుగా అఫ్గనిస్తాన్‌లో మోహరించిన అమెరికా బలగాలు మంగళవారంతో పూర్తిగా వెనక్కి మళ్లాయి. కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి అమెరికాకు చెందిన సీ-17 విమానం బయల్దేరడంతో సేనల ఉపసంహరణ పూర్తైంది. కాగా న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు సంబంధించిన సెప్టెంబరు 11, 2001 నాటి ఉగ్రదాడి(ఆల్‌ఖైదా) తర్వాత అమెరికా సేనలు.. అఫ్గనిస్తాన్‌లో ప్రవేశించిన విషయం తెలిసిందే. తాలిబన్ ప్రభుత్వాన్ని పడగొట్టి అగ్రరాజ్యం పూర్తి ఆధిపత్యం సాధించింది.
అశ్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి తాలిబన్ల అరాచకాలకు చెక్ పెట్టే విధంగా ఎన్నో ఆపరేషన్లు చేపట్టింది. ఈ క్రమంలో కొన్ని లక్షల కోట్ల డాలర్లకు పైగానే ఖర్చు పెట్టింది. అయితే, 2020లో తాలిబన్లతో కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం నేపథ్యంలో తమ సేనలను ఉపసంహరించుకునేందుకు నాటి ట్రంప్ ప్రభుత్వం అంగీకరించింది. దశల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది.
ఈ క్రమంలో వేగంగా పుంజుకున్న తాలిబన్లు.. అఫ్గన్ సైన్యాన్ని ఓడించి ప్రధాన పట్టణాలు సహా రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకుని అఫ్గన్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న అశ్రఫ్ ఘనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పారిపోయి తలదాచుకుంటున్నారు. మరోవైపు తాలిబన్ల గత పాలనలోని అరాచకాలు తెలిసిన అఫ్గన్ ప్రజలు, విదేశీయులు సైతం దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమయ్యారు.
అమెరికా, మిత్ర దేశాలు చేపట్టిన తరలింపు ప్రక్రియ ద్వారా ఇప్పటికే వేలాది మంది అఫ్గన్‌ను వీడారు. ఈ క్రమంలో అమెరికా అమెరికా సేనలు ఆగష్టు 31 నాటికి ఖాళీ చేయాలని తాలిబన్లు బైడెన్ సర్కారుకు డెడ్‌లైన్ విధించగా నేటితో అది పూర్తైంది. ఈ నేపథ్యంలో.. 20 ఏళ్ల యుద్ధంలో ఎంతో మంది సైనికులను పోగొట్టుకొట్టున్న అమెరికా ఎట్టకేలకు నేటితో అమెరికా తమ బలగాలను ఉపసంహరించుకుంది.
చదవండి: అఫ్గన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ.. బైడెన్ కీలక వ్యాఖ్యలు
చిట్ట చివరి సైనికుడు ఈయనే!
ఈ విషయాన్ని ధ్రువీకరించిన అమెరికా రక్షణ శాఖ అఫ్గన్‌ను వీడిన చివరి సైనికుడి పేరిట ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసింది. ‘‘82వ ఎయిర్‌బోర్న్ డివిజన్, 18 ఎయిర్‌బోర్న్ కార్‌్ప్స కమాండర్, మేజర్ జనరల్ క్రిస్ డోనా.. ఆగష్టు 30, 2021న అమెరికా వైమానిక దళ విమానం సీ-17లో ప్రవేశించడంతో కాబూల్‌లో యూఎస్ మిషన్ ముగిసింది’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది అమెరికా పెత్తనం ఇక ముగిసిందని పేర్కొంటుండగా.. మరికొందరు.. తాలిబన్ల అరాచకాలు మళ్లీ చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక బలగాల ఉపసంహరణ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌లో మిగిలిపోయిన యుద్ధ విమానాలను అమెరికా సైన్యం విచ్ఛిన్నం చేసింది. ఇకపై అవి ఎగురలేవని, వాటిని ఎవరూ ఆపరేట్ చేయలేరని యూఎస్ జనరల్ కెన్నెత్ మెకాంజీ పేర్కొన్నారు.
-వెబ్‌డెస్క్
చదవండి: ఇది మనందరి విజయం.. వారికి గుణపాఠం.. కంగ్రాట్స్: తాలిబన్లు
Comments
Please login to add a commentAdd a comment