
వాషిగ్టంన్: కాబూల్‌లోని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని జరిపిన డ్రోన్ దాడులు గురించి ప్రస్తావిస్తూ, ఇది మా ఇంటెలిజెన్సీ వర్గాల తప్పిదమే అని యూఎస్ జనరల్ అత్యున్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. గత నెలలో యూఎస్ బలగాలు అఫ్గనిస్తాన్ నుంచి వైదొలగే సమయంలో జరిపిన డ్రోన్ దాడిలో చిన్న పిల్లలతో సహా 10 మంది మరణించిన సంగతి తెలిసిందే.
ఆ దాడిని అర్థం లేని దారుణమైన చర్యగా కమాండర్ జనరల్ కెనత్ మెకెంజీ అభివర్ణించారు. ఇది ఒక విషాదకరమైన దాడిగా పేర్కొన్నారు. ఈ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు యూఎస్ రకణ శాఖ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. ఈ ఘటన నుంచి తాము చాలా నేర్చుకున్నామని అన్నారు.
తెల్లని టయోట కారు...
ఈ సందర్భంగా మెకెంజీ మాట్లాడుతూ..." ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆగస్టు 29న కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నట్లు యూఎస్ ఇంటెలిజెన్సీ గుర్తించింది. ఈ క్రమంలో ఆ ఐఎస్‌ఐ ఉగ్రవాద బృందం తెల్లని టయోట కారుని వాడుతున్నట్లు తెలిసి లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాం. కానీ విషాదమేమిటంటే ఆ దాడిలో చనిపోయిన వాళ్లెవ్వరికీ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధం లేదు" అని అన్నారు.
ఆగస్టు 26న తాలిబన్లు చేసిన ఆత్మహుతి బాంబు దాడిలో యూఎస్ సర్వీస్ సభ్యులతో సహా సుమారు 13 మంది చనిపోయిన సంగతిని గుర్తు చేశారు. ఈ మేరకు తమని తాము రక్షించుకునే ప్రయత్నంలోనే ఈ దాడులను నిర్వహించామంటూ. .కెనెత్ మెకెంజీ తన ఆవేదనను వ్యక్తం చేశారు.