అమెరికాలో పోలింగ్‌ నేడే.. కమల వికాసమా! ట్రంప్‌కే పట్టమా! | USA Presidential Elections 2024: Dead heat continues in US president election | Sakshi
Sakshi News home page

USA Presidential Elections 2024: అమెరికాలో పోలింగ్‌ నేడే.. కమల వికాసమా! ట్రంప్‌కే పట్టమా!

Published Tue, Nov 5 2024 4:32 AM | Last Updated on Tue, Nov 5 2024 12:51 PM

USA Presidential Elections 2024: Dead heat continues in US president election

ఫలితాలపై సర్వత్రా అంతులేని ఉత్కంఠ  

హోరాహోరీగా తలపడ్డ హారిస్, ట్రంప్‌

భారత మూలాలున్న కమలా హారిస్‌ కొత్త చరిత్ర లిఖిస్తారా? అమెరికా అధ్యక్ష పీఠమెక్కిన తొలి మహిళగా రికార్డు సృష్టిస్తారా? లేక ఆమెతో హోరాహోరి పోరులో పైచేయి సాధించి డొనాల్డ్‌ ట్రంపే రెండోసారి గద్దెనెక్కుతారా? ఈ ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానం లభించనుంది. అగ్ర రాజ్యంలో అధ్యక్ష ఎన్నికల పోరు అతి కీలక ఘట్టానికి చేరింది. మంగళవారం దేశవ్యాప్తంగా పోలింగ్‌ జరగనుంది. అమెరికాకు 47వ ప్రెసిడెంట్‌ ఎవరన్నది రాత్రికల్లా తేలిపోయే అవకాశముంది. 

60 ఏళ్ల హారిస్, 78 ఏళ్ల ట్రంప్‌ కొద్ది నెలలుగా నువ్వా, నేనా అన్నట్టుగా పోటీపడ్డారు. దాంతో ఇవి గత కొన్ని దశాబ్దాల్లో అత్యంత పోటాపోటీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరుగా ఇప్పటికే చరిత్ర సృష్టించాయి. ఇప్పటిదాకా వెలువడ్డ అన్ని ముందస్తు పోల్స్‌లోనూ వారిద్దరూ సమవుజ్జీలుగా ఉంటూ వచ్చారు. అయితే పోలింగ్‌కు ఒక్క రోజు ముందు సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

 ఫలితాలను నిర్దేశించే కీలకమైన ఏడు స్వింగ్‌ రాష్ట్రాల్లో ఇప్పటిదాకా అభ్యర్థులిద్దరి మధ్యా హోరాహోరీ ఉండగా తాజాగా వాటన్నింట్లోనూ ట్రంపే ముందంజ వేసినట్టు పలు పోల్స్‌ తేల్చాయి. అదే సమయంలో రిపబ్లికన్ల కంచుకోటైన అయోవాలో హారిస్‌ పైచేయి సాధించినట్టు మరో పోల్‌లో వెల్లడవడం విశేషం. అంశాలవారీగా చూస్తే అమెరికన్లను ప్రధాన సమస్యలుగా భావిస్తున్న ఎనాకమీతో పాటు అక్రమ వలసలు తదితరాల్లో తొలినుంచీ ట్రంప్‌కే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోంది. 

అంతేగాక ప్రపంచవ్యాప్తంగా కల్లోల పరిస్థితులు  నెలకొన్న నేపథ్యంలో ఆయనైతేనే దేశానికి గట్టి నాయ కత్వం అందించగలరన్న అభిప్రాయమూ అమెరికన్లలో నెలకొంది. మరోవైపు హారిస్‌కేమో భార త, నల్లజాతి మూలాలు బాగా కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. 

ఆ నేపథ్యమున్న ఓటర్లంతా ఆమెకే ఓటేయడం ఖాయ మంటున్నారు. దీనికి తోడు ఈసారి స్వింగ్‌ స్టేట్లను తోసిరాజని అధ్యక్షున్ని తేల్చడంలో నిర్ణాయకంగా మారగలదని భావిస్తున్న మహిళా ఓటర్ల మద్దతూ హారిస్‌కే ఉండటం అతి పెద్ద సానుకూలాంశం. అబార్షన్ల వంటి పలు కీలకాంశాల్లో కూడా హారిస్‌దే పైచేయిగా ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. తటస్థ ఓటర్లే ఫలితాన్ని నిర్దేశించేలా ఉన్నారు...

ఓటేసిన కమల 
అధ్యక్షుడు జో బైడెన్‌ బాటలో హారిస్‌ కూడా ఈసారి ముందస్తుగా ఓటేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం డెట్రాయిట్‌లో ఈ మేరకు విలేకరులకు వెల్లడించారు. ‘‘నేనిప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేశాను. అది త్వరలో కాలిఫోరి్నయా చేరనుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకముంది’’ అని తెలిపారు. మెయిల్‌ ఓటింగ్‌ వ్యవస్థను ట్రంప్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బైడెన్‌ ఇటీవలే తన స్వస్థలం డెలావెర్‌లో ముందస్తు ఓటు వేయడం తెలిసిందే. 

స్వింగ్‌ స్టేట్లలో చివరి ప్రయత్నాలు 
హారిస్, ట్రంప్‌ ఇద్దరూ కొద్ది రోజులుగా స్వింగ్‌ స్టేట్లపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఆది, సోమవారాల్లో ట్రంప్‌ పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, జార్జియాల్లో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆదివారం మిషిగన్‌లో కలియదిరిగిన హారిస్‌ సోమవారం పెన్సిల్వేనియాలో ర్యాలీల్లో ప్రసంగించారు.

2020లో పోలింగ్‌ 66 శాతమే 
అమెరికాలో 24 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లున్నారు. కానీ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు మాత్రం 16.14 కోట్ల మందే. ఇది 2020 కంటే కూడా తక్కువ. 2020లో 16.8 కోట్ల మంది నమోదైన ఓటర్లుండగా వారిలో ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసింది 15.9 కోట్ల మంది మాత్రమే. అంటే కేవలం 66 శాతం ఓటింగ్‌ నమోదైంది.

అమెరికా జనాభా   -     34.6 కోట్లు 
అర్హులైన ఓటర్లు   -     23.5 కోట్ల పై చిలుకు 
నమోదైన ఓటర్లు  -      16,14,22,000 
ఇప్పటికే ఓటేసింది   -     7.7 కోట్ల పై చిలుకు 
తొలిసారి ఓటేస్తున్నది  -     1.9 కోట్ల పై చిలుకు  

ప్రచార నినాదాలు 
హారిస్‌ 
→ అమెరికన్ల స్వేచ్చా స్వాతంత్య్రాల పరిరక్షణ 
→ రాజ్యాంగ విలువలు, మహిళల హక్కులకు రక్షణ 
ట్రంప్‌ 
→ దేశ ఆర్థిక పునరి్నర్మాణం 
→ అక్రమ వలసలకు పూర్తి అడ్డుకట్ట 

పోలింగ్‌ వేళలు 
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7–9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా 
(భారత కాలమానం ప్రకారం రాష్ట్రాలవారీగా మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 9.30 మధ్య పోలింగ్‌ మొదలవుతుంది. బుధవారం ఉదయం దాకా
కొనసాగుతుంది)  

అసలు ఎన్నిక డిసెంబర్‌ 16న!
విజేతను తేల్చేది ఎలక్టోరల్‌ ఓట్లే
అమెరికాలో అధ్యక్షున్ని ఎన్నుకునేది ఆ దేశ ఓట ర్లు కాదు. ఎలక్టోరల్‌ కాలేజీ. అందులో 538 ఓట్లుంటాయి. వాటిలో కనీసం 270 సాధించిన వారే అధ్యక్షుడవుతారు. ఓటర్లు మంగళవారం నేరుగా ఎన్నుకునేది ఈ ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులనే. వారిని ఎలక్టర్లుగా పిలుస్తారు. పోలింగ్‌ ముగిశాక నెల పాటు వారి ఎన్నిక ప్రక్రియ సాగుతుంది. వారంతా డిసెంబర్‌ 16న సమావేశమై అధ్యక్షునికి, ఉపాధ్యక్షునికి ఓటేస్తారు. 

జనవరి 6న ఫలితం
జనవరి 6న అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమా వేశం జరుగుతుంది. ఎలక్టోరల్‌ ఓట్లను లెక్కించి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరో తేలేస్తారు. సెనేట్‌ అధ్యక్షుని హోదాలో ఉపాధ్యక్షుడు వారి పేర్లను ప్రకటిస్తారు. జనవరి 20న (ఆ రోజు ఆదివారమైతే మర్నాడు) ప్రమాణస్వీకారం జరుగుతుంది. ఇలా ఓటింగ్‌ తర్వాతా ఎన్నిక ప్రక్రియ మరో రెండు నెలలు సాగుతుంది!

హోరాహోరీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు

టై అయితే?
ట్రంప్, హారిస్‌ ఇద్దరిలో ఎవరికీ మెజారిటీ, అంటే కనీసం 270 ఎలక్టోరల్‌ ఓట్లు రాని పక్షంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం. అందుకు ఆస్కారం అతి తక్కువగా కనిపిస్తున్నా, ఇద్దరికీ చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్‌పై పడుతుంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకోసం జనవరి 6న సమావేశమవుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26, అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్షుడవుతారు. ఉపాధ్యక్ష ఎన్నికలో ఫలితం తేలని పక్షంలో ఎగువ సభ అయిన సెనేట్‌ ఉపాధ్యక్షున్ని ఎన్నుకుంటుంది. 100 సెనేట్‌ ఓట్లలో కనీసం 51 లేదా అంతకంటే ఎక్కువ సాధించేవారు విజేత అవుతారు. చివరిసారిగా రెండు శతాబ్దాల కింద, అంటే 1800లో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. థామస్‌ జెఫర్సన్, ఆరన్‌ బ్లర్‌ ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో ప్రతినిధుల సభ ఓటింగ్‌లో జెఫర్సన్‌ విజేతగా నిలిచారు.

అత్యధిక ఓట్లొచ్చినా గ్యారెంటీ లేదు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు (పాపులర్‌ ఓట్‌) సాధించే అభ్యర్థి గెలుస్తారన్న గ్యారెంటీ లేదు. 2016లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ప్రత్యర్థి ట్రంప్‌ కంటే 28 లక్షల పై చిలుకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయినా ఆమె 74 ఎలక్టోరల్‌ ఓట్ల తేడాతో ఓడారు. 2000లో అల్‌ గోర్‌ (డెమొక్రాట్‌) కూడా జార్జి డబ్లు్య.బుష్‌ కంటే 5.5 లక్షల ఎక్కువ ఓట్లు సాధించినా ఓడారు. మెయిన్, నెబ్రాస్కా మినహా 48 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విన్నర్‌ టేక్స్‌ ఆల్‌ విధానమే ఇందుకు కారణం. దాని ప్రకారం మెజారిటీ ఓట్లు వచ్చిన పార్టీకే ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్‌ ఓట్లన్నీ దక్కుతాయి.

న్యూయార్క్‌లో బెంగాలీ బ్యాలెట్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో న్యూయార్క్‌లో బ్యాలెట్‌ పేపర్లపై బెంగాలీ భాష చోటుచేసుకోవడం విశేషం. అధికారక భాషగా ఇంగ్లిష్‌ కాకుండా బెంగాలీతో పాటు చైనీస్, స్పానిష్, కొరియన్‌ భాషలకు బ్యాలెట్‌ పేపర్లపై చోటుదక్కింది. న్యూయార్క్‌లో బెంగాలీలతో పాటు బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వారి సంఖ్య అధికం. న్యూయార్క్‌లో ఏకంగా 200కు పైగా భాషలు మాట్లాడేవాళ్లు నివసిస్తుండటం విశేషం. 

హారిస్‌   సానుకూలతలు
1. ట్రంప్‌ పట్ల భయాందోళనలు
అమెరికన్లలో జాతి తదితర ప్రాతిపదికలపై విభజన తెచ్చిన అధ్యక్షునిగా ట్రంప్‌ అప్రతిష్టపాలయ్యారు. అందరినీ కలుపుకుపోయే నేతగా పేరుండటం హారిస్‌కు కలిసొచ్చే అంశం. అందుకే ట్రంప్‌ను ఫాసిస్టుగా, ప్రజస్వామ్యానికే ప్రమాదకారిగా హారిస్‌ తన ప్రచారంలో పదేపదే అభివర్ణించారు. ఆయన గెలిస్తే అమెరికన్లను మరోసారి విడదీస్తారని హెచ్చరించారు.

2. బైడెన్‌కు సమర్థ ప్రత్యామ్నాయం
డెమొక్రాట్ల అభ్యర్థిగా ఒక దశలో అధ్యక్షుడు బైడెన్‌ పేరు దాదాపుగా ఖరారైంది. వయోభారం, మతి మరుపు తదితర సమస్యలతో సతమతమవుతున్న ఆయన పట్ల ఓటర్లంతా పెదవి విరుస్తున్నట్టు అన్ని పోల్స్‌లోనూ స్పష్టమైంది. దాంతో ఒక దశలో డెమొక్రాట్లు గెలుపుపైనే ఆశలు వదిలేసుకున్నారు. అయితే సమయం మించిపోకుండా ఆయన్ను తప్పించి హారిస్‌ను తెరపైకి తీసుకురావడంతో పోరు ఒక్కసారిగా రసవత్తరంగా మారింది.
3. మహిళల హక్కుల యోధురాలు
మహిళల హక్కుల పరిరక్షణ విషయంలో ట్రంప్‌తో పోలిస్తే హారిస్‌ ఎంతో ఎత్తున నిలిచారు. ముఖ్యంగా కీలకమైన అబార్షన్‌ అంశంపై హారిస్‌కు మహిళల్లో ఆదరణ నానాటికీ విపరీతంగా పెరుగుతోంది. దాంతో ట్రంప్‌ కూడా అబార్షన్ల హక్కును వ్యతిరేకించే విషయంలో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. 10 రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికతో పాటే అబార్షన్‌ హక్కులపైనా ఓటింగ్‌ జరుగుతోంది. ఇది హారిస్‌కు మరింత కలిసొస్తుందని చెబుతున్నారు.

4. ఓటింగ్‌ శాతం
ట్రంప్‌ అభిమానులు ఎక్కువగా గ్రామీణులు, పట్టణ శివారు ప్రాంతాల ప్రజలే. హారిస్‌ మద్దతుదారుల్లో జాబితాలో వృద్ధులు, విద్యాధికుల సంఖ్య ఎక్కువ. గ్రామీణులు, శివారు ప్రజలతో పోలిస్తే ప్రతి ఎన్నికలోనూ వారే అధిక సంఖ్యలో ఓటేస్తూ వస్తున్నారు. ఈ ట్రెండు హారిస్‌కు బాగా సానుకూలంగా మారేలా కనిపిస్తోంది.

5. ముమ్మర ప్రచారం, వ్యయం
అమెరికా ఎన్నికలు అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారం. ట్రంప్‌తో పోలిస్తే హారిస్‌ భారీగా ఎన్నికల విరాళాలు సేకరించడమే గాక ప్రచారంపై ఎక్కువ వ్యయం చేశారు. ఆలస్యంగా జూలైలో రేసులోకి వచ్చిన ఆమె, జనవరి నుంచి 11 నెలల వ్యవధిలో ట్రంప్‌ సేకరించిన దానికన్నా ఎక్కువ మొత్తం సేకరించడం విశేషం. ముఖ్యంగా కీలకమైన ఏడు స్వింగ్‌ రాష్ట్రాల్లో విరాళాల సేకరణలో హారిసే ముందున్నారు. 

ట్రంప్‌   సానుకూలతలు
1. ప్రభుత్వ వ్యతిరేకత
అమెరికా ఓటర్లలో అత్యధికులకు ఈసారి ఎకానమీయే అతి పెద్ద సమస్యగా మారింది. నిరుద్యోగం కూడా వారిని బాగా కలవరపెడుతున్న మరో అంశం. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో బైడెన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొని ఉన్న తీవ్ర వ్యతిరేకత ట్రంప్‌కు బాగా కలిసి రానుంది. ఉపాధ్యక్షురాలు హారిస్‌కు ఇది బాగా ప్రతికూలంగా మారవచ్చు. తమ ఆర్థిక స్థితిగతులు అధ్వానంగా మారాయని ఏకంగా 62 శాతం మంది అమెరికన్లు చెబుతుండటం విశేషం. 79 శాతం మంది దేశం తిరోగమన బాటలో ఉందని భావిస్తున్నారు.

2. తగ్గని ప్రజాదరణ
2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా క్యాపిటల్‌ హిల్‌పైకి దాడులకు మద్దతుదారులను ఉసిగొల్పినా, క్రిమినల్‌ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడన్న చెత్త రికార్డును మూటగట్టుకున్నా ట్రంప్‌కు జనాదరణ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది పొడవునా కనీసం 40 శాతం, అంతకంటే ఎక్కువ మంది అమెరికన్లు ఆయనకు మద్దతు పలకడం విశేషం.

3. అక్రమ వలసలు
రెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానన్న ట్రంప్‌ ప్రకటన అమెరికన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఏకంగా 10 లక్షల మందిని స్వదేశాలకు పంపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అబార్షన్లపై హారిస్‌ వైఖరిపైనే డెమొక్రాట్లు ఆశలు పెట్టుకోగా ట్రంప్‌ ప్రధానంగా అక్రమ వలసల అంశమే తనను గట్టెక్కిస్తుందని నమ్మకం పెట్టుకున్నారు.

4. సామాన్యుల దన్ను
గ్రామీణులు, డిగ్రీ కంటే తక్కువ విద్యార్హతలున్న వారు ట్రంప్‌ను మొదట్నుంచీ అభిమానిస్తూ వస్తున్నారు. వారిలో ఆయనకు ఆదరణ ఈసారి మరింత పెరిగింది. దీనికి తోడు డెమొక్రాట్ల మద్దతిచ్చే కార్మిక సంఘాలు కూడా ఈసారి ట్రంప్‌కు జై కొడుతున్నాయి. గ్రామీణ ఓటర్లు, స్వింగ్‌ స్టేట్లలోని పట్టణ శివారు ప్రాంత ఓటర్లు భారీగా ఓటేసేలా చూడగలిగితే ట్రంప్‌ విజయావకాశాలు భారీగా పెరుగుతాయి.

5. గట్టి నేతగా పేరు
అంతర్జాతీయంగా నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ పెద్దన్నగా అమెరికా ఆధిప త్యాన్ని పరిరక్షించగల సామర్థ్యం ట్రంప్‌కే ఉందని మెజా రిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆయన అధ్యక్షు నిగా ఉండగా ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు జర గని విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement