గజాలు,ఎకరాల్లో కాదు..కిలోమీటర్లలో భూ కొనుగోళ్లు! | Various countries that bought islands countries | Sakshi
Sakshi News home page

గజాలు,ఎకరాల్లో కాదు..కిలోమీటర్లలో భూ కొనుగోళ్లు!

Published Sun, Jul 30 2023 1:38 AM | Last Updated on Sun, Jul 30 2023 4:43 AM

Various countries that bought islands countries - Sakshi

అలాస్కా

వివిధ దేశాలు, దీవులను కొన్న దేశాలు 
సాధారణంగా ఎక్కడైనా భూమిని చదరపు అడుగులు, చదరపు గజాలు లేదా ఎకరాల్లో కొంటారని అందరికీ తెలుసు. కానీ కొన్ని దేశాలు ద్వీపాలు లేదా వేరే దేశాలను కొనుగోలు చేశాయని తెలుసా? దాదాపు 20 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌ల్యాండ్‌ను కొనేందుకు అమెరికా పలుమార్లు విఫలయత్నం చేసిందని తెలుసా? అలా దేశాలను లేదా ద్వీపాలను ఇతర దేశాలు కొనాల్సిన అవసరం.. దాని వెనకున్న  ఉద్దేశమేంటి? అందుకు ఎంత వెచ్చించాయి. ఇలాంటి వెరైటీ భూకొనుగోళ్లలో కొన్నింటి గురించి క్లుప్తంగా...     

అలాస్కా 
ఉత్తర అమెరికా ఖండం ఎగువ భాగాన 17 లక్షల చ.కి.మీ.పైగా విస్తీర్ణం మేర విస్తరించిన ఈ ప్రాంతాన్ని అమెరికా 1867లో రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అప్పటి రష్యన్‌ చక్రవర్తి కేవలం 72 లక్షల డాలర్లకు ఈ ప్రాంతాన్ని అమ్మేశాడు. అమెరికా కొనుగోలు చేసిన అతిస్వల్పకాలంలోనే అలాస్కాలో అత్యంత విలువైన బంగారు గనులు బయటపడ్డాయి. అంతేకాదు.. ఆపై చమురు నిక్షేపాలతోపాటు అనేక ఖనిజాలు లభించాయి. ఇప్పుడు అలస్కాలో ఏటా 8 కోట్ల టన్నుల చమురును అమెరికా వెలికితీస్తోంది. 


సింగపూర్‌
బ్రిటన్‌ 1819లో సింగపూర్‌ను కొన్నది. ఈస్టిండియా కంపెనీ వాణిజ్య అవసరాల కోసం మలేసియాలోని జోహర్‌ రాజ్యం నుంచి సింగపూర్‌ను కొనుగోలు చేసింది. దీనికోసం జోహర్‌ సుల్తాన్‌ హుస్సైన్‌షాకు ఏడాదికి 5,000 స్పెయిన్‌ డాలర్లు అదే రాజ్యానికి సైన్యాధికారి అయిన అబ్దుల్‌ రహమాన్‌కు 3,000 డాలర్లు ఇచ్చేట్లు బ్రిటన్‌ ఒప్పందం చేసుకుంది. అయితే రెండో ప్రపంచ యుద్ధం ఫలితంగా బ్రిటన్‌ సింగపూర్‌ను వదుకోవాల్సి వచ్చింది. తిరిగి మలేసియాలో భాగమైన సింగపూర్‌ 1965లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.

 
ఫ్లోరిడా
బ్రిటన్‌ సింగపూర్‌ను కొనుగోలు చేసిన 1819­లోనే అక్కడ అమెరికా ఫ్లోరిడాను స్పెయిన్‌ నుంచి కొన్నది. దీనికోసం అమెరికా కేవలం 50 లక్షల డాలర్లను వెచ్చించింది. 1845లో ఫ్లోరిడా అమెరికా 27వ రాష్ట్రంగా అవతరించింది. 


ఫిలిప్పైన్స్‌ 
సుదీర్ఘ పోరాటం తరువాత స్వాతంత్య్రం సాధించిన ఫిలిప్పైన్స్‌ను ఒకప్పుడు స్పెయిన్‌ నుంచి అమెరికా కొనుగోలు చేసింది. 1898లో ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా 2 కోట్ల డాలర్లు వెచ్చించి అమెరికా ఫిలిప్పైన్స్‌ను సొంతం చేసుకుంది.


గ్వదర్‌
బలూచిస్తాన్‌ రాష్ట్రంలో భాగమైన ఈ తీరప్రాంత పట్టణాన్ని పాకిస్తాన్‌ 1958లో ఒమన్‌ నుంచి కొనుగోలు చేసింది. దీనికోసం 550 కోట్ల పాకిస్తాన్‌ రూపాయలను వెచ్చించింది. చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా గ్వదర్‌ పోర్టును పాకిస్తాన్‌ 2013లో చైనాకు అప్పగించింది. అప్పట్లో ఈ పోర్టు విలువను 4,600 కోట్ల డాలర్లుగా విలువ కట్టారు.

 
వర్జిన్‌ ఐలాండ్స్‌ 
అమెరికా 1917లో డెన్మార్క్‌ నుంచి వర్జిన్‌ ఐల్యాండ్స్‌ను కొనుగోలు చేసింది. దీనికోసం 2.5 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని అమెరికా డెన్మార్క్‌కు అప్పగించింది. అప్పట్లోనే 10 కోట్ల డాలర్లతో గ్రీన్‌ల్యాండ్‌ను కూడా కొంటామని అమెరికా ప్రతిపాదించినా డెన్మార్క్‌ అంగీకరించలేదు. 1867 నుంచి 2019 వరకు అమెరికా పలుమార్లు గ్రీన్‌ల్యాండ్‌ను కొనే ప్రయత్నాలు చేసింది. కానీ గ్రీన్‌ల్యాండ్‌పై సార్వభౌమాధికారంగల డెన్మార్క్‌ మాత్రం ఈ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తోంది. 


ఆఖరి కొనుగోలు
ప్రపంచంలో ఇతర దేశాలను లేదా ప్రాంతాలను కొనుగోలు చేసే ప్రక్రియ చివరగా సౌదీ అరేబియా ఈజిప్టు మధ్య జరిగింది. 2017లో ఎర్ర సముద్రంలోని రెండు చిన్నదీవులైన టీరన్, సనఫిర్‌లను సౌదీకి అప్పగించేందుకు ఈజిప్టు అంగీకరించింది. దీనికోసం 2 కోట్ల అమెరికన్‌ డాలర్లను సాయంగా ఇచ్చేందుకు సౌదీ ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటికీ ఈజిప్టు పౌరులు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 


కట్నంగా నాటి బొంబాయి
ప్రస్తుత ముంబై ఒకప్పటి బొంబాయిని బ్రిటన్‌ రాజు చార్లెస్‌–2 కట్నంగా పొందారు. ప్రస్తుత ముంబైలో ఉన్న అనేక ప్రాంతాలు, ద్వీపాలు అప్పట్లో పోర్చుగీసు రాజ్యం అదీనంలో ఉండేవి. చార్లెస్‌–2 పోర్చుగీసు యువరాణి కేథరీన్‌ను పెళ్లి చేసుకున్నందుకు కట్నంగా కింగ్‌ జాన్‌–4 బొంబాయిని కట్నంగా రాసిచ్చారు. అప్పట్లో పోర్చుగీసు వాళ్లు బొంబాయిని బోమ్‌బెహియాగా పిలిచేవారు. తరువాత ఆంగ్లేయులు బాంబేగా మార్చారు. కట్నంగా పొందిన బొంబాయిని చార్లెస్‌... బ్రిటన్‌కు చెందిన ఈస్టిండియా కంపెనీకి అప్పగించారు. 


నటోవతు ద్వీపం
2014లో ఫిజికి చెందిన నటోవతు అనే దీవిలో 5,000 ఎకరాలను కిరిబటి రిపబ్లిక్‌ 87 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. రానున్న రోజుల్లో సముద్ర మట్టాలు పెరిగితే తమ దేశం మునిగిపోతుందని ముందుజాగ్రత్త చర్యగా కిరిబటి తన జనాభా సంరక్షణ కోసం ఈ భూమిని కొనుగోలు చేసింది. 

అమ్మకానికి మరెన్నో దీవులు
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మానవరహిత దీవులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌ మాదిరిగానే దీవుల అమ్మకం, కొనుగోళ్ల కోసం ఏజెంట్లు, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు కూడా సేవలు అందిస్తున్నాయి. ధనవంతులు వెకేషన్ల కోసం ఇలాంటి దీవుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రదేశాన్ని బట్టి వాటి రేట్లు ఉంటాయి. మధ్య అమెరికాలో కొంత తక్కువగా... యూరప్‌ కొంత ఎక్కువగా ఈ దీవుల రేట్లు ఉన్నాయి. ప్రైవేట్‌ ఐలాండ్స్‌ వంటి ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ల ప్రకారం దక్షిణ అమెరికాలో అతితక్కువగా మన కరెన్సీలో రూ. 5 కోట్లుగా ఓ దీవి విలువ ఉంటే యూరప్‌లో రూ. 7 కోట్లకు ఎంచక్కా దీవిని సొంతం చేసుకోవచ్చు. ఎందరో హాలీవుడ్‌ స్టార్లతోపాటు బాలీవుడ్‌ స్టార్లు ఇలాంటి దీవులను కొనుగోలు చేశారు. షారుక్‌ఖాన్‌ దుబాయ్‌ సమీపంలో 70 కోట్ల డాలర్లకు ఓ దీవిని సొంతం చేసుకోగా బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, పాప్‌సింగర్‌ మీకా కూడా దీవులు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు.

30 భద్రత, ఆర్థిక లేదా వాణిజ్య అవసరాల కోసం ఓ దేశం మరో దేశాన్ని మొత్తంగా లేదా కొంత భాగాన్ని కొన్న ఉదంతాలు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement