జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన విలయ తాండవం మహిళలపై మరో కోణంలో ప్రభావం చూపింది. లాక్‌డౌన్ కాలంలో మహిళలపై తీవ్రతరమైన హింస ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సందర్భంలో శారీరక లేదా లైంగిక హింసకు గురైనట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తాజా అధ్యయనం వెల్లడించింది. మహిళలపై హింసకు సంబంధించి అతిపెద్ద అధ్యయనం ఇదేనని తెలిపింది. మూడొంతుల మంది మహిళలు 20 ఏళ్ళు వచ్చేసరికి పరిచయస్తుడైన ఎవరో ఒక వ్యక్తి చేతిలో లైంగిక హింసకు గురవుతున్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది.
పెరిగిన గృహ హింస
కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించడంతో, ఆ సమయంలో మహిళలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఫలితంగా వారిపై హింస మరింత తీవ్రతరమైనట్టు డబ్ల్యూహెచ్‌ఓ అధ్యయనం గుర్తించింది. మహిళలపై హింస విషయంలో అన్ని దేశాలూ ఒక్కటే అయినా తరతమ స్థాయిల్లో తేడా ఉంటుంది అంతే. స్త్రీలపై హింస అన్నిదేశాల్లోనూ ఉంది. ఇది లక్షలాది మంది మహిళలకు, వారి కుటుంబాలకు తీరని హాని కలిగిస్తోంది. వారి జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా మహిళలపై హింస మరింత పెరిగిందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గేబ్రియేసస్ చెప్పారు. ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు సమస్య పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకతను ఈ అధ్యయనం నొక్కి చెపుతోందని అన్నారు.
15 ఏళ్ల వయసులోనే..
2013 తరువాత డబ్ల్యూహెచ్‌ఓ తొలిసారిగా నిర్వహించిన ఈ అధ్యయనంలో ఇటు జీవిత భాగస్వాముల చేతిలో స్త్రీలు హింసకు గురవుతున్నారని, అంతేకాకుండా పరిచయస్తులు కాని పురుషుల చేతిలోనూ లైంగిక హింసకు గురవుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 73.6 కోట్ల మంది మహిళలు, బాలికలు తమ 15 ఏళ్ల వయస్సులోనే, పైన చెప్పుకున్న కనీసం ఏదైనా ఒక రకమైన హింసకు గురవుతున్నట్టు అధ్యయనంలో వెల్లడయ్యింది.
‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు సన్నిహిత భాగస్వామి హింసను, పరిచయస్తులు కాని వారి చేతిలో లైంగిక íß హింసను ఎదుర్కొంటున్నారు’’ అని డబ్ల్యూహెచ్‌లోని సెక్సువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ రీసెర్చ్ యూనిట్ డాక్టర్ క్లౌడియా గార్సియా–మొరేనో తెలిపారు.
దేశాల మధ్య హింసలో తేడా
తక్కువ ఆదాయ దేశాల్లోని మహిళలు, తక్కువ మధ్య ఆదాయ దేశాల్లోని మహిళలపై ఈ హింస ప్రభావం ఒకేలా లేదని ఈ అధ్యయనంలో గుర్తించారు. కొన్ని దేశాల్లో సగం మంది మహిళలపై ఈ ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. 15 నుంచి 49 ఏళ్ళ మధ్య వయస్సు వారిపై సమీప భాగస్వామి చేతిలో హింస ప్రభావం ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment