
ఈ ఫొటో చూశారా? చేయి తిరిగిన రెజిన్ ఆర్టిస్ట్ గీసిన రంగురంగుల హరివిల్లులా ఉంది కదూ! కానీ, ఇది పెయింటింగ్ కాదు.. ఫొటోగ్రాఫ్. వాషింగ్టన్‌లో ఉన్న మౌంట్ రైనర్ నేషనల్ పార్క్‌లోని ఓ మంచు గుహలో తీసిన చిత్రం. మంచుకు అన్ని రంగులెలా వచ్చాయంటే... ఆ గుహకు ఉన్న ఒక ద్వారం గుండా సూర్యరశ్మి లోపలికి ప్రవేశించి, మంచుపై పడి ఇలా ప్రతిఫలిస్తుందన్నమాట. వీటిని చూడటానికి పర్యాటకులు, ఫొటోగ్రాఫర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. నేషనల్ పార్క్ సర్వీస్ అధికారులు మాత్రం అది ప్రమాదమని ప్రవేశాన్ని నిషేదించారు. ‘
‘నిత్యం కరుగుతోన్న ఆ మంచు గుహలు ఎప్పుడైనా విరిగిపడొచ్చు. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల.. లోపలికి వెళ్లినవాళ్లకు ఊపిరి అందకుండా పోయే ప్రమాదమూ ఉంది’’ అని హెచ్చరించారు. మంచు కరిగి ప్రవహిస్తున్న నీటిపాయ గుహ రాళ్ల మధ్య కనిపిస్తోంది కదా! నిజానికి ఒకప్పుడు ఈ పార్కు మంచు గుహలకే ప్రత్యేకం. కానీ.. వాతావరణంలో వస్తున్న మార్పులతో కరిగి అంతరించి పోతున్నాయి. కరిగిన మంచు చిన్నపాటి కారు సైజులో విరిగి పడుతుండటంతో ప్రమాదమని 1980లోనే గుహలను మూసేశారు. అయితే ప్రాణాలకు తెగించి తీసిన ఫొటోలను ఫోటోగ్రాఫర్ మాథ్యూ నికోల్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి వైరలవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment