లైట్ తీసుకొ'నీరు'
నీరు.. మానవాళికి తప్పనిసరిగా అవసరమైన వనరు. ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా లభ్యమయ్యే నీటిని ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. ఒక లీటరు వాటర్ బాటిల్ ఖరీదు సాధారణంగా రూ.20 ఉంటుంది. కంపెనీ, ఇతరత్రా అంశాలను బట్టి రూ.2వేల బాటిల్ కూడా ఉంది. కానీ జపాన్‌కు చెందిన ఫిల్లికో అనే కంపెనీ ఇంతకుమించిన ధరకు మంచినీళ్లను అమ్ముతోంది. ఆ కంపెనీ వాటర్ బాటిళ్ల ధర రూ.84వేల నుంచి మొదలై ఏకంగా రూ.8 లక్షల వరకు ఉంది.
ధర చూస్తే గుండె గుభేల్‌మనడం ఎంత నిజమో.. ఆ బాటిల్ చూసిన తర్వాత వావ్ అని అనకుండా ఉండలేకపోవడం కూడా అంతే నిజం. ఆ బాటిల్ అందం అలాంటిది మరి. ఇంతకీ ఆ బాటిల్ నీళ్లకు అంత రేటెందుకు? అవేమైనా పైనుంచి దిగొచ్చాయా అనే కదా మీ సందేహం? ఔను.. జపాన్‌లో అత్యంత స్వచ్ఛమైన ప్రదేశంగా భావించే కోబ్‌లోని రౌకా నేషనల్ పార్క్‌లో ఉన్న నునోబికి ఫాల్స్ నుంచి రాతిశిలల ద్వారా సహజసిద్ధంగా శుద్ధి అయి కిందకు వచ్చిన నీళ్లవి.
నునోబికి ప్రాంతం అటు పరిశ్రమలకు, ఇటు వ్యవసాయానికి చాలా దూరంగా ఉండటం వల్ల అక్కడ ఎలాంటి కాలుష్యం ఉండదు. అందువల్ల అక్కడ నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. పైగా రాతిశిలల్లో నుంచి ఫిల్టర్ కావడం వల్ల మరింత స్వచ్ఛత కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ నీటిలోని సహజసిద్ధమైన ఖనిజ లవణాలు, స్వచ్ఛత పోకుండా కనీస ప్రాసెసింగ్ పద్ధతులను ఉపయోగించి ప్యాక్ చేస్తారు.
ఎంత కష్టపడి నాణ్యమైన నీటిని తీసుకొచ్చి జాగ్రత్తగా ప్యాక్ చేసినా.. రంగు, రుచి, వాసన లేని నీటికి మరీ ఇంత రేటేంటి బాస్ అంటారా? ఇదే డౌట్ ఫిల్లికో కంపెనీ యజమాని క్రిస్టియన్ డయోర్‌కీ వచి్చంది. మనిషికి నిత్యావసరమైన నీటిని లగ్జరీ వస్తువుగా అధిక ధరకు అమ్మడం ఎలా అని ఆలోచించారు.
దేవతా రెక్కలు.. కిరీటాలు..
» ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేయడం ద్వారా మార్కెటింగ్ చేయడం సులభం అని డియోర్ భావించారు. దానికి తగినట్టుగా తమ బాటిల్ డిజైన్‌ను వినూత్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. శాటిన్ గాజుతో కంటికి ఇంపుగా కనిపించేలా బాటిల్ డిజైన్ చేయించారు. తాము విక్రయించే ధరకు అది చాలదనే భావనతో దానికి అదనపు సొబగులద్దారు. బాటిల్ మూతలను రాజు, రాణి కిరీటాలను పోలి ఉండేలా రూపొందించారు.
దేవతలకు రెక్కలు ఉన్నట్టుగా బాటిల్‌కు రెండు రెక్కలు కూడా జోడించారు. అవసరమైన చోట వెండి పూత పూయించారు. లగ్జరీ బ్రాండ్ స్ఫటికాలను ఉత్పత్తి చేసే స్వరోవ్‌స్కీ స్ఫటికాలను బాటిల్‌పై అమర్చారు. వెరసి.. చూసిన తర్వాత చూపు తిప్పుకోలేనంత అందమైన కళాఖండంగా తీర్చిదిద్దారు. దీనికి ఫిల్లికో జ్యవెలర్ వాటర్ అని పేరు పెట్టి.. ఇది సార్ మా బ్రాండ్ అంటూ తొలుత తమ వీఐపీ కస్టమర్లకు పరిచయం చేశారు.
వారి నుంచి అద్భుత స్పందన వచ్చిoది. అనంతరం ఫిల్లికో కంపెనీ 2008లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించడంతో ఈ బ్రాండ్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. అంతే అక్కడ నుంచి వెనుతిరిగి చూడలేదు. 2005లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. అయితే, బాటిళ్ల డిజైన్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిని చేతితోనే తయారుచేస్తారు.
అందువల్ల నెలకు 5వేల బాటిళ్లను మించి ఉత్పత్తి చేయరు. ఇది కూడా ఈ బ్రాండ్ డిమాండ్ కొనసాగడానికి మరో కారణం. ప్రస్తుతం ఫిల్లికో జ్యువెలరీ వాటర్ రెండో తరం నడుస్తోంది. ఈ బాటిల్ ప్రారంభ ధర వెయ్యి డాలర్లు. (దాదాపు రూ.84 వేలు). ఒక్కోసారి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మరింత వినూత్నమైన బాటిళ్లను ఉత్పత్తి చేసి విక్రయిస్తుంటారు. వాటి ధర ఏకంగా రూ.8.40 లక్షల వరకు కూడా ఉంటుంది.
వాస్తవానికి ఆ బాటిల్‌లో ఉన్న నీళ్లను కాదు.. ఆ నీళ్లున్న బాటిల్‌ను ఇంత ధర పెట్టి కొనాలన్న మాట. అయితే, దాహం వేసిన ప్రతిసారీ ఈ నీటిని తాగితే కష్టమే కదా? కేవలం తమ స్టేటస్ సింబల్ చాటుకోవాల్సిన సందర్భాల్లో ఓ రెండు గుటకలు వేయక తప్పదు మరి. అసలే బ్రాండ్ వాటర్.. పైగా లిమిటెడ్ ఎడిషన్స్. ఆ మాత్రం ముందు జాగ్రత్త తప్పనిసరి.. కాదంటారా?
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment