కీవ్: చెర్నోబిల్.. ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు ఉలిక్కిపడతాయి.1986లో అతి పెద్ద అణు పేలుడు సంభవించి ప్రపంచ విషాదంగా నిలిచిన మరుభూమిలాంటి ప్రాంతం. ఇప్పుడు అది రష్యా స్వాధీనంలోకి రావడం ఆందోళనలు పెంచుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్రలో మొట్టమొదటి సారిగా రష్యా వ్యూహాత్మకంగానే చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకుందన్న చర్చ కూడా సాగుతోంది.
►చెర్నోబిల్ పట్టణం.. ఇప్పుడు అదొక మరుభూమి. ఉక్రెయిన్ సరిహద్దులైన బెలారస్‌కు 20 కి.మీ. దూరంలో ఉంటుంది. భూ, వాయు, జలమార్గాల ద్వారా ముప్పేట దాడికి సిద్ధమైన రష్యా పక్కా ప్రణాళికతో చెర్నోబిల్‌ను తొలుత స్వాధీనం చేసుకుంది. ఆ దేశంలోకి చేరాలంటే చెర్నోబిల్ దగ్గర దారి కావడంతో దానికి అనుగుణంగా అడుగులు వేసింది. బెలారస్ రష్యా మిత్రపక్షాల్లో ఒకటి కావడంతో ఆ సరిహద్దుల నుంచి సైన్యాన్ని తరలించానికి వీలైంది.
►సరిహద్దులకి సమీపంలోనే ఉండడంతో చెర్నోబిల్ రష్యాకు ఈజీ టార్గెట్‌గా మారింది. అంతేకాకుండా చెర్నోబిల్ చుట్టూ 2,600 చదరపు కిలోమీటర్ల మేర నిషేధిత ప్రాంతం కావడంతో సైనికులు ఉండరు. అణు కార్యకలాపాలు కూడా జరగకపోవడంతో భద్రత తక్కువగా ఉంటుంది. దీంతో ఇక్కడ్నుంచి రష్యా సేనలు ముందుకు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు.
చదవండి: (కమెడియన్ నుంచి అధ్యక్షుడిగా.. జెలెన్‌స్కీ ప్రస్థానం)
►భౌగోళికంగా చూస్తే చెర్నోబిల్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు కేవలం 108 కి.మీ. దూరంలో ఉంటుంది. దీంతో చెర్నోబిల్‌ను ఆక్రమించుకుంటే రాజధాని స్వాధీనానికి ఎక్కువ సమయం పట్టదని రష్యా ప్రణాళికలు వేసుకుంది.
►మిలటరీ పరంగా చెర్నోబిల్‌కు ఎలాంటి ప్రాముఖ్యత లేకపోయినప్పటికీ ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని భావిస్తున్న పుతిన్ లక్ష్యం చేరుకోవాలంటే ఈ ప్రాంతం అత్యంత కీలకంగా ఉందని అమెరికా ఆర్మీ మాజీ చీఫ్ జాక్ కీన్ వ్యాఖ్యానించారు.
►చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా స్వాధీనం చేసుకుందని అంటే దానిని వినియోగించుకోవడానికి కాదని, పశ్చిమ దేశాలు తమ దారికి అడ్డుగా వస్తే ఏమైనా చేస్తామని హెచ్చరికలు పంపడానికేనన్న అభిప్రాయాలున్నాయి.
చదవండి: (యువత జీవితాలతో క్రూర పరిహాసం)
►సోవియెట్ రష్యా పతనానికి చెర్నోబిల్ అణుబాంబు పేలుడు కూడా ఒక రకంగా కారణభూతమైంది. అప్పట్లో జరిగిన ఈ భారీ పేలుడుతో వెలువడిన అణు ధార్మికత ఉక్రెయిన్, బెలారస్, రష్యా, యూరప్‌లో కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారికంగా వాటి లెక్కలు ఇప్పటికీ తేలలేదు. రేడియేషన్ కారణంగా అణు విద్యుత్ ప్లాంట్ చుట్టుపక్కల కొన్ని వేల ఏళ్ల వరకు జీవనం సాగించే పరిస్థితి లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అంతిమ లక్ష్యం తిరిగి సోవియెట్ యూనియన్ స్థాపించడం కావడంతో చెర్నోబిల్ స్వాధీనంపై ఆయన ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment