If Zaporizhzhia Nuclear Plant Blast, It's More Dangerous Than Chernobyl - Sakshi
Sakshi News home page

రష్యా మొండితనం.. సర్వనాశనానికి సెకన్లు చాలు, పుతిన్‌కూ అది తెలుసు!

Published Fri, Mar 4 2022 2:18 PM | Last Updated on Fri, Mar 4 2022 4:29 PM

Ukraine Crisis: Zaporizhzhia Nuclear Plant Dangerous Than Chernobyl - Sakshi

న్యూక్లియర్‌ ప్లాంట్‌లను యుద్ధంలో భాగం చేయకూడదు. అవి యుద్ధ స్థావరాలు కాకూడదు.  ఉక్రెయిన్‌ జాపోరిజ్జియా అణు కేంద్రంపై రష్యా దాడుల నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఈ మాట చెప్తోంది. నిజానికి ఇదేం కొత్త మాట కాదు. అలాగే అదొక హెచ్చరిక.  ఈ యుద్ధంలో యూరప్‌లోని అతిపెద్ద అణు రియాక్టర్‌ గనుక పేలితే?..  యూరప్ మొత్తం తుడిచిపెట్టుకుని పోతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది ఇప్పుడు.  శాంపిల్‌గా..  చెర్నోబిల్‌ విషాదాన్నే ప్రస్తావిస్తున్నారు. 

సుమారు 36 ఏళ్ల కిందట(ఏప్రిల్‌ 26, 1986).. ఒక రాత్రి. చిన్నతప్పిదం, ఏమరపాటుతో వ్యవహరించిన తీరు..  సెకన్ల వ్యవధిలోనే అత్యంత విషాదకరమైన విధ్వంసం చోటు చేసుకుంది. అణు విద్యుత్‌ కేంద్రం భద్రతను పరీక్షిస్తున్న సమయంలో.. కరెంట్‌ సరఫరా ఆపేస్తే ఎలా ఉంటుందనే కోణంలో ప్రయోగాలు చేపట్టారు ఇంజినీర్లు.  అయితే అప్పటికే అక్కడ చిన్న సమస్య ఉందని గుర్తించలేకపోయారు. నాలుగో నెంబర్‌ అణు రియాక్టర్‌లో కూలింగ్‌ వాటర్‌ సరఫరా ఆగిపోయి.. ఆవిరి ఒత్తిడి కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఆ దెబ్బకు రియాక్టర్‌ మూత ఊడిపోయి అందులోంచి ‘కోర్‌’ బయటకు లీక్‌ అయ్యింది. చరిత్రలోనే అతిపెద్ద అణు ప్రమాదం.. పెనువిషాదం చోటు చేసుకుంది. 

ఘటనలో చెలరేగిన మంటలు పదిరోజుల పాటు మండుతూనే ఉన్నాయి. చెర్నోబిల్‌ ప్రమాదం జరిగిన టైంలో..  అక్కడికక్కడే చనిపోయింది ఇద్దరే. అటుపై రేడియేషన్‌ ఎఫెక్ట్‌తో 134 మంది అస్వతస్థకు గురయ్యారు. అందులో 28 మంది కొన్ని నెలలకు, మరికొందరు ఆ తర్వాత చనిపోయారు.  కానీ, ఆ ప్రభావం ఏళ్ల తరబడి కొనసాగుతూనే వస్తోంది. ఎంతలా అంటే క్యాన్సర్‌, చర్మ.. గొంతు సంబంధిత వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలతో సుమారు 2 లక్షల మందికిపైగా చనిపోయారని ఒక అంచనా. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని చెర్నోబిల్‌ ప్రమాదంపై పరిశోధనలు చేసిన రీసెర్చలు చెప్తుంటారు. విశేషం ఏంటంటే.. ఆ విషాదం తాలుకా జ్ఞాపకాలు మోస్తూ ఇంకా మంచానికే పరిమితమైన వాళ్లూ ఉన్నారు.   

బతకడం కష్టమే!
చెర్నోబిల్‌ దుర్ఘటనలో విడుదలైన  రేడియో ధార్మికత ప్రభావం కొన్ని వేల కిలోమీటర్లకు విస్తరించింది.  హిరోషిమా, నాగసాకిల అణు బాంబు పేలుళ్ల కంటే ఎన్నో రెట్ల రేడియో ధార్మికతను విరజిమ్మింది. సుమారు పదమూడు దేశాలకు రేడియేషన్‌(ఇందులో రష్యా కూడా ఉంది) విస్తరించింది. ఈ ప్రాంతానికి దూరంగా లక్షల మందిని తరలించి.. నిషేధిత ప్రాంతంగా ప్రకటించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. పదుల కిలోమీటర్ల పరిధిలో గట్టి కాపలా ఉంటుంది. చెర్నోబిల్‌ దుర్ఘటన జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ నివాస యోగ్యం కాదు. సాగు కూడా నిషేధం. అక్కడ కాసే పండ్లలో, పూసే పువ్వుల్లోనూ రేడియేషన్‌ ఎఫెక్ట్‌ కనిపిస్తుంటుంది. రేడియేషన్‌ను తట్టుకోలుగుతున్న కొన్ని జంతువులు మాత్రమే బతకగలుగుతున్నాయి.

సోవియట్‌ యూనియన్‌లో అంతర్భాగంగా ఉన్న టైంలో జరిగిన ఈ అణు దుర్ఘటన.. ఇప్పటికీ ప్రభావం చూపెడుతోంది. అందుకే ఇక్కడ  రోబోలతో అణువ్యర్థాలకు గోరీ కడుతున్నారు. నిషేధిత ప్రాంతం కాబట్టే.. ఇక్కడ ఒక అణు ఇంధన నిల్వ కేంద్రాన్ని నిర్మించాలని ఉక్రెయిన్‌ ప్రభుత్వం అనుకుంది. కానీ, యుద్ధ పరిణామాలతో అది రష్యా చేతికి వెళ్లింది. రష్యా ఆక్రమణలో భాగంగా పట్టణాల కంటే ముందుగా చెర్నోబిల్‌నే ఆక్రమించుకుంది రష్యా. ఆ టైంలో రష్యా అణు యుద్ధానికి దిగుతుందేమో అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తం అయ్యింది.  

కావాలనే రష్యా.. 
రష్యా యుద్ధ ట్యాంకులకు థర్మల్ ఇమేజ్ స్కానర్లున్నాయి. దేనిపై షూట్ చేస్తున్నారో రష్యా సైనికులకు పక్కాగా తెలుసు. కాబట్టి జాపోరిజ్జియా Nuclear Plantపై జరిగిన దాడి ప్రమాదవశాత్తూ జరిగింది కాదనేది ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ఆరోపణ.  ఒకవేళ ఈ దాడి కావాలనే జరిగినా.. జరిగే నష్టం ఏ రేంజ్‌లో ఉంటుందో పుతిన్‌కి తెలుసు. ఎందుకంటే చెర్నోబిల్‌ పరిణామాలను ఆయన దగ్గరుండి చూశాడు.. ఆ ప్రభావానికి గురైన జాబితాలో రష్యా కూడా ఉంది కాబట్టి. అయినా కూడా అణు బూచితో ఉక్రెయిన్‌ ఆక్రమణలో ముందుకెళ్లాలని చూస్తోంది. ఉక్రెయిన్‌ను.. మద్ధతుగా వచ్చే దేశాన్ని అణ్వాస్త్ర దాడులతో బూడిద చేస్తామంటూ హెచ్చరిస్తున్నాడు పుతిన్‌. ఇందులో భాగంగానే ఒకవైపు ప్రధాన నగరాల ఆక్రమణ.. మరోవైపు ఉక్రెయిన్‌లో ఉన్న 15 న్యూక్లియర్‌ రియాక్టర్ల స్వాధీనం కొనసాగిస్తోంది రష్యా. 

శుక్రవారం రష్యా బలగాలు దాడి చేసింది, స్వాధీనం చేసుకుంది.. అలాంటి ఇలాంటి రియాక్టర్‌పైన కాదు. యూరప్‌లోనే అతిపెద్ద అణు రియాక్టర్‌ జాపోరిజ్జియా. జరగరానిది ఏదైనా జరిగితే ఆ విధ్వంసం ఊహించడమే కష్టం. ఎందుకంటే చెర్నోబిల్‌తో పోలిస్తే కొన్ని రెట్లకు పైగా నష్టం వాటిల్లుతుంది. ఉక్రెయిన్‌ సహా యూరప్‌ దేశాలు చాలామట్టుకు నామ రూపాలు లేకుండా పోవచ్చు. ఆఖరికి రష్యా కూడా ఆ ప్రతిఫలం అనుభవించాల్సిందే. 
 
జాపోరిజ్జియా న్యూక్లియర్‌ ప్లాంట్‌లోని ఆరు రియాక్టర్లలో ఒకదానికి మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తూ అది రిన్నోవేషన్‌లో ఉంది. ఆపరేటింగ్‌లో లేదు. అయితే అందులో అణు ఇంధనం మాత్రం ఉంది. ఆ ఇంధనం కూడా రష్యా నుంచే వచ్చింది. మంటలు అంటుకున్నాక ఆర్పడానికి రష్యా దళాలు ఫైర్‌ సిబ్బందిని అనుమతించలేదు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్‌ నెలకొంది. ఆపై సిబ్బంది అనుమతించడంతో సమయానికి మంటలు ఆపేశారు. ఘోర ముప్పు తప్పింది. అక్కడి వాతావరణంలో  రేడియేషన్‌ లెవల్‌ కూడా మారలేదు. పుతిన్‌ ‘అణు దాడి’ హెచ్చరికల వరకు పరిమితం అయితే పర్వాలేదు.  చెర్నోబిల్‌లో జరిగిన ఒక చిన్నతప్పిదానికే ఎఫెక్ట్‌ ఈ రేంజ్‌లో ఉంటే.. కావాలని దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే.. ఆ ప్రభావం ఇంకా ఏ రేంజ్‌లో ఊహించడమే భయంకరంగా ఉంది.

::: సాక్షి, వెబ్‌ ప్రత్యేకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement