పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. వారం రోజులుగా ఇరు వర్గాల మధ్య భయంకరమైన పోరు కొనసాగుతోంది. బాంబులు, వైమానిక దాడులతో నువ్వా-నేనా అనే రీతిలో ఇరు వర్గాలు విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 1,417 మంది మృత్యువాడినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మహాస్ ఉగ్రవాదులకు చెందిన 1500 మృతదేహాలను ఇజ్రాయెల్‌లో గుర్తించారు, మరోవైపు హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్‌కు చంఎదిన 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మందిని బంధీలుగా పట్టుకొని గాజాకు తరలించారు.
గాజా సరిహద్దుల్లో హమాస్ దాడుల్లో మరణించిన ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు రోడ్లపై, వీధుల్లో కుప్పలుకుప్పలుగా పడి ఉండిపోయాయి. ఈ మృతదేహాలను వివిధ స్వచ్చంద సంస్థలకు చెందిన వాలంటీర్లు సేకరిస్తున్నారు. అష్‌దోద్ ప్రాంతానికి చెందిన యోసి లాండౌ.. జాకా అనే సంస్థలో గత 33 ఏళ్లుగా వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సంస్థ ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల సమయంలో అసహజ మరణాలు సంభవించినప్పుడు అక్కడి మృతదేహాలను సేకరిస్తుంటుంది. దశాబ్ధాలుగా ఇదే పని చేస్తున్న యోసి.. తాజాగా హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలోనూ ఈ విధులే నిర్వర్తిస్తున్నారు.
చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో బందీల మృతి
ఈ క్రమంలో గాజా సరిహిద్దులో మరణించిన వారి మృతదేహాలను సేకరించే పనిలో పడ్డ యోసి.. హమాస్ మరణహోమంలో బలైన వారి శవాలను చూసి అతని గుండె తరుక్కుపోయింది. రోడ్డుపై శవాల కుప్పల, అత్యంత ఘోర స్థితిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను చూసి అతడికి కన్నీళ్లు ఆగలేదు. గర్భిణి అయిన మహిళ పొట్టను చీల్చి మరీ లోపలున్న శిశువును చంపడం చూసి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఒళ్లు గగుర్పొడిచే ఆ భయానక దృశ్యాల అనుభవాలను అతను ఓ మీడియాతో పంచుకున్నాడు.
‘రాకెట్ దాడులు జరుగుతున్నట్లు శనివారం ఉదయం నేను సైరన్ శబ్ధాలు రావడంతో క్షణాల్లోనే షెల్టర్లలోకి వెళ్లిపోయాం. అప్పటికే ప్రధాన భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొచ్చుకొచ్చారని మాకు తెలిసింది. అనంతరం మృతదేహాలను సేకరించేందుకు మా బృందంతో కలిసి గాజా సరిహద్దుకు బయల్దేరాం. ఆ దారిలో మేం చూసిన దృశ్యాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి.
గాజా సరిహద్దులోని అనేక ప్రాంతాల్లో కార్లు బోల్తా పడి ఉన్నాయి. వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇదే విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఇంత దారుణ విధ్వంసాన్ని ఎప్పుడూ చూడలేదు. ఒక రోడ్డుపై పడి ఉన్న మృతదేహాలను సేకరించేందుకు మేం వెళ్లాం. సాధారణంగా ఆ రోడ్డును దాటాలంటే 15 నిమిషాలు పడుతుంది. కానీ ప్రతి మృతదేహాన్ని సేకరించి బ్యాగుల్లో పెడుతూ ఆ రోడ్డు దాటేసరికి 11 గంటలు పట్టింది. బుల్లెట్లు దిగి, ధ్వంసమైన అనేక కార్లు ఇప్పటికీ దక్షిణ ఇజ్రాయెల్‌లో చెత్తకుప్పల్లా పడి ఉన్నాయి. పదుల సంఖ్యలో మృతదేహాలను గుర్తించి ట్రక్కులో ఎక్కించాం.
అక్కడి నుంచి కిబ్బుట్జ్‌లోని బీరీ ప్రాంతానికి చేరుకున్నాం. ఈ ప్రాంతం గాజాకు కేవలం 5 కి.మీల దూరంలోనే ఉంటుంది. అక్కడ మొదట ఓ మహిళ మృతదేహాన్ని చూడగానే నాతో పాటు మా బృందం మొత్తానికీ స్పృహ కోల్పోయి కళ్లు తిరిగి పడిపోయినంత పనైంది. గర్భవతైన మహిళ పొట్టను చీల్చి శిశువును బయటకు తీసి చంపారు. ఆ బిడ్డకు బొడ్డుతాడు ఇంకా అలానే ఉంది’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
చదవండి: ఇక విధ్వంసమే.. 'వైట్ పాస్పరస్ ఆయుధాలతో ఇజ్రాయెల్ దాడి'
20 మంది చిన్నారులతో సహా కొందరు పౌరుల చేతులను వెనక్కి కట్టి వారిని కాల్చి చంపిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని లాండౌ తెలిపారు. కొందరు యువతలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ కిబ్బుట్జ్ ప్రాంతంలో 100 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ జరిపిన మారణహోమంలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment