Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు | Year Ender 2024 Somewhere the Government Changed Somewhere the Ruling Party Lost the Majority | Sakshi
Sakshi News home page

Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు

Published Wed, Dec 18 2024 7:27 AM | Last Updated on Wed, Dec 18 2024 8:34 AM

Year Ender 2024 Somewhere the Government Changed Somewhere the Ruling Party Lost the Majority
  • 2024లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్నికలు

  • బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్, రష్యా, యునైటెడ్ స్టేట్స్‌లలో ఎన్నికలు

  • పలు దేశాల్లోని ఓటర్లు ప్రభుత్వ మార్పును కోరుకున్నారు

  • డెమొక్రాట్‌లు అమెరికా అధ్యక్ష పదవిని కోల్పోయారు

  • యునైటెడ్ కింగ్‌డమ్‌లో వామపక్షాల చేతుల్లోకి  రాజకీయ అధికారం 

  • దక్షిణాఫ్రికా సాధారణ ఎన్నికల్లో మెజారిటీ కోల్పోయిన అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్

  • భారత్‌లో బీజేపీ సొంత మెజారిటీని సాధించలేకి ఇతర పార్టీల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు

న్యూఢిల్లీ: 2024ను ఎన్నికల సంవత్సరంగా అభివర్ణించారు. ప్రపంచంలోని పలుదేశాల్లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ జాబితాలో బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్, రష్యా, యునైటెడ్ స్టేట్స్  ఉన్నాయి. ఇదేవిధంగా 2024 జూన్‌లో యూరోపియన్ పార్లమెంటుకు ఎన్నికలను నిర్వహించారు.

ఎన్నికల పరంగా 2024 పలు రాజకీయ పార్టీలకు కష్టతరమైన సంవత్సరంగా నిలిచింది. పలు దేశాల్లోని ఓటర్లు ప్రభుత్వ మార్పు కోసం ఓటు వేశారు. ఈ నేపధ్యంలో కొన్ని దేశాల్లో అధికార పార్టీ మెజారిటీ కోల్పోయింది. 2024లో ఓటింగ్ ద్వారా అధికారంలో మార్పులు చోటుచేసుకున్న దేశాల జాబితాలోకి వెళితే..

అమెరికా 
ఈ ఏడాది డెమొక్రాట్‌లు అమెరికా అధ్యక్ష పదవిని కోల్పోయారు. రిపబ్లికన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను ఓడించారు. కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోవడం ఇది వరుసగా మూడోసారి.



యునైటెడ్ కింగ్‌డమ్ 
2024, జూలై 4న జరిగిన సాధారణ ఎన్నికల్లో రాజకీయ అధికారం వామపక్షాల చేతుల్లోకి వెళ్లింది. లేబర్ పార్టీ అత్యధిక పార్లమెంటరీ మెజారిటీని సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ 14 ఏళ్ల పాలనకు ముగింపు పలికింది.


బోట్స్వానా 
ఈ దక్షిణాఫ్రికా దేశంలో 2024, అక్టొబర్‌ 30న జరిగిన సాధారణ ఎన్నికలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. బోట్స్వానాలోని డెమోక్రటిక్ పార్టీ దాదాపు 60 ఏళ్ల తర్వాత తొలిసారి అధికారాన్ని కోల్పోయింది. 1966లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించిన బీడీపీ.. సెంటర్-లెఫ్ట్ ప్రతిపక్షం  అంబరిల్లా ఫర్ డెమోక్రటిక్ చేంజ్ (యూడీసీ) చేతిలో ఓడిపోయింది. ఓటర్లు ప్రత్యర్థి పార్టీల వైపు ఎక్కువగా మొగ్గు చూపడంతో బీడీపీ నాలుగో స్థానానికి చేరుకుంది.



దక్షిణ కొరియా 
2024 ఏప్రిల్‌లో దక్షిణ కొరియా ఓటర్లు నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీకి మెజారిటీ సీట్లు ఇచ్చారు. దీంతో పీపుల్స్ పవర్ పార్టీ అధ్యక్షుడు యున్ సుక్ యోల్‌ అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. 2024 డిసెంబరు ప్రారంభంలో అధ్యక్షుడు యున్ మార్షల్ లా విధించారు. డెమోక్రటిక్ పార్టీ నేతలు  దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీని తరువాత జాతీయ అసెంబ్లీ కూడా యున్‌పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో యున్ అధికారం నుంచి దిగిపోవల్సి వచ్చింది. ప్రధాన మంత్రి హన్ దుక్-సూ తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు.



ఘనా
ఘనాలో కొత్త అధ్యక్షునితో పాటు 275 మంది పార్లమెంటు సభ్యులను ఎన్నుకునేందుకు 2024, డిసెంబర్‌ 7న సాధారణ ఎన్నికలు జరిగాయి. నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ (ఎన్‌డీసీ) అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు జాన్ మహామా మొదటి రౌండ్‌లో మెజారిటీ సాధించారు. రీకౌంటింగ్ లేకుండానే గెలిచారు. అధికార న్యూ పేట్రియాటిక్ పార్టీ (ఎన్‌పీపీ)అభ్యర్థి మహముదు బవుమియా  ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. పార్లమెంటరీ ఎన్నికల్లో ఎన్‌డీసీ 276 స్థానాలకు గాను 185 స్థానాలను గెలుచుకుంది. ఎన్‌పీపీ 87 స్థానాలను గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థులు నాలుగు స్థానాల్లో విజయం సాధించి ఎన్‌డీసీకి పార్లమెంటులో  మద్దతు పలికారు.

మెజారిటీ కోల్పోయిన అధికార పార్టీల జాబితాలో..

దక్షిణాఫ్రికా 
2024, మే 29న దక్షిణాఫ్రికాలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ)కి మెజారిటీ గణనీయంగా తగ్గింది. ఎఎన్‌సీ అతిపెద్ద పార్టీగా నిలిచినా, పార్లమెంటరీ మెజారిటీని కోల్పోయింది. వర్ణవివక్ష శకం ముగిసిన తర్వాత  ఏఎన్‌సీ మెజారిటీని కోల్పోవడం ఇదే తొలిసారి.

జపాన్
ఈ ఏడాది  జరిగిన జపాన్ సార్వత్రిక ఎన్నికలు చర్చనీయాంశమయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దేశాన్ని చాలాకాలం పాటు పరిపాలించిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, దాని సంకీర్ణ భాగస్వామి కొమెయిటో పార్లమెంటులో మెజారిటీని కోల్పోయారు.

భారతదేశం
అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్‌లో 2024లో జరిగిన సాధారణ ఎన్నికలు ఈ ఏడాది టాప్‌లో నిలిచాయి. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించించింది. అయితే అధికార పార్టీ అంచనాలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేదు. ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: Year Ender 2024: లీకుల నామ సంవత్సరం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement