రైల్వే స్టేషన్లకు కొత్త సొబగులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే పనుల్లో భాగంగా ఈ మార్గంలోని రైల్వేస్టేషన్లు కొత్త సొబగులు సంతరించుకుంటున్నాయి. తాజాగా పూడూరు రైల్వేస్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గంలో కీలకమైన కొత్తపల్లి రైల్వేస్టేషన్ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. వచ్చేనెలలో ఈ స్టేషన్‌ను దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి పెద్దపల్లి–నిజామాబాద్ సెక్షన్‌లో అధికారులు తాజాగా పూడూరు క్రాసింగ్ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరించి, అదనపు సౌకర్యాలు కల్పించి అందుబాటులోకి తీసుకొచ్చారు. కాజీపేట–సికింద్రాబాద్ మార్గంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లను పెద్దపల్లి నుంచి నిజామాబాద్ మార్గంమీదుగా దారి మళ్లిస్తున్నారు. దీంతో క్రాసింగ్ స్టేషన్‌ల ఆవశ్యకత పెరిగింది.
ఆధునిక వసతులతో పూడూరు, కరీంనగర్..
పెద్దపల్లి నుంచి నిజామాబాద్ రైల్వే మార్గంలో పూడూరు నూతన క్రాసింగ్ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్టేషన్‌లో ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ, బ్లాక్ ప్యానెల్, 12 మెయిన్ సిగ్నల్స్, 2 శనటింగ్ సిగ్నల్స్, రెండో లూప్‌లైన్లకు ఓవర్ హెడ్ విద్యుత్తు అమర్చారు. రెండు లూప్‌లైన్లకు ఇన్సులేటర్లు బిగించారు. 1.7 ట్రాక్ కిలోమీటర్ల మేర ఓవర్ హెడ్ విద్యుత్ తీగలు అమర్చారు. వాస్తవానికి ఇది పాతస్టేషనే. పెద్దపల్లి– నిజామాబాద్ సెక్షన్‌లో పెరుగుతున్న రైళ్ల ఫ్రీక్వెన్సీ కారణంగా ఈ స్టేషన్‌ను క్రాసింగ్ స్టేషన్‌గా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ మార్గంలోని కొత్తపల్లి, గంగాధర, సుల్తానాబాద్ క్రాసింగ్ స్టేషన్లు ఉన్నాయి. మల్యాల రైల్వే స్టేషన్‌కు కూడా పునరుజ్జీవం కల్పించి క్రాసింగ్ స్టేషన్‌గా అందుబాటులోకి తీసుకురానున్నారు. లింగంపేట జగిత్యాల నుంచి కోరుట్ల స్టేషన్ల మధ్య ఉన్న మేడిపల్లి రైల్వేస్టేషన్‌ను కూడా క్రాసింగ్‌స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో పెద్దపల్లి జంక్షన్‌కు సమీపంలో బైపాస్ రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే నేరుగా కాజీపేట లేదా వరంగల్ నుంచి నిజామాబాద్‌కు నేరుగా పెద్దపల్లి టౌన్ మీదుగా వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే రూ.25.93 కోట్లతో అమృత్‌భారత్ స్టేషన్ పథకంలో భాగంగా చేపట్టిన కరీంనగర్ స్టేషన్ సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. కొత్త స్వాగత మార్గం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ర్యాంప్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఆధునిక మరుగుదొడ్ల సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్స్ వేదికగా ఇటీవలే ప్రకటించారు.
రెండేళ్లలో అందుబాటులోకి..
ఉమ్మడి జిల్లావాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వేలైన్ పనుల కోసం కేంద్రం గతేడాది రూ.350 కోట్లు కేటాయించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027లో కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే మార్గం పూర్తయి ఉమ్మడి జిల్లావాసులకు భాగ్యనగరానికి రైలు ప్రయాణ యోగం దక్కనుంది. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అప్పటి ప్రభుత్వం 2016లో కేంద్రాన్ని ఒప్పించింది. రూ.1,167 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించింది. ఇప్పటివరకూ మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు లైన్ పూర్తయింది. రైలు సేవలూ అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 151 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం.. ఇప్పటివరకూ 75కిలోమీటర్లు పూర్తయింది. ప్రస్తుతం సిరిసిల్ల– సిద్దిపేట (37 కిలోమీటర్లు) వరకు పనులు నడుస్తున్నాయి. అలాగే రూ.300 కోట్లకుపైగా నిధులతో చీర్లవంచ వద్ద మిడ్‌మానేరుపై ఐరన్ బ్రిడ్జి కూడా నిర్మించనున్నారు. 39.01 కి.మీ పొడవైన సిరిసిల్ల నుంచి కొత్తపల్లి మార్గంలో ఉన్న పూడూరు, కొత్తపల్లి రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. 2026 లేదా 2027 నాటికి ఈ మార్గంలో రైల్వేలైన్ పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికారులు ఉన్నారు.
కొత్తపల్లి –మనోహరాబాద్ మ్యాప్
అందుబాటులోకి పూడూరు.. త్వరలో కొత్తపల్లి స్టేషన్
మల్యాల, మేడిపల్లిలకు సైతం పునరుజ్జీవం
సిరిసిల్ల నుంచి కొత్తపల్లికి వేగంగా ట్రాక్ పనులు
రూ.25.93 కోట్లతో కరీంనగర్ స్టేషన్ ఆధునీకరణ
2027 నాటికి భాగ్యనగర ప్రయాణ యోగం
వడివడిగా కొత్తపల్లి – మనోహరాబాద్ ట్రాక్ పనులు
రైల్వే స్టేషన్లకు కొత్త సొబగులు
Comments
Please login to add a commentAdd a comment