త్రిముఖ పోరు
● ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్‌మార్ ● పార్టీలే బలంగా అంజిరెడ్డి, నరేందర్‌రెడ్డి ● బీసీ నినాదంతో ప్రసన్న హరికృష్ణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. పార్టీలే బలంగా బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వూట్కూరి నరేందర్‌రెడ్డి, బీసీ నినాదంతో ప్రసన్న హరికృష్ణ బరిలో నిలిచారు. పోలింగ్‌కు మూడు రోజులు మాత్రమే గడువు మిగలడంతో ప్రచారం చివరి అంఖానికి చేరింది. చాలామంది పోటీలో ఉన్నా.. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్యే పోటీ ఉంది.
హోరాహోరీగా ప్రచారం
గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు భిన్నంగా ఈసారి హోరాహోరీగా సాగుతున్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఈ ఎన్నిక ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, గ్రాఫ్ పడిపోయిందని విపక్షాల ప్రచారం నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌కు ఈ ఎన్నిక సవాల్‌గా మారింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ సొంత నియోజకవర్గం కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలోనే ఉండడంతో ఆ ఫలితం పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక భవిష్యత్ తమదేనంటున్న బీజేపీ ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా తమ బలాన్ని మరింత పెంచుకోవాలనే తలంపుతో ఉంది. బీ ఆర్‌ఎస్ పోటీలో లేనప్పటికీ.. బీజేపీ, కాంగ్రెస్‌ను ఓడించే అభ్యర్థికి అండగా నిలవాలని అంతర్గతంగా పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపిస్తోంది. రెండు పార్టీలు ఓడిపోతే తమ ఎదుగుదలకు తి రు గు ఉండదనేది గులాబీ పార్టీ వ్యూహంలా ఉంది.
పార్టీయే బలం
కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న నరేందర్‌రెడ్డి, చిన్నమైల్ అంజిరెడ్డి వారివారి పార్టీలనే నమ్ముకున్నారు. జాతీయవాదం బలంగా పెరుగుతుండడం.. ఇటీవలి ఢిల్లీ ఫలితాలతో బీజేపీకి వాతావరణం అనుకూలంగా ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆలస్యంగా బరిలోకి వచ్చిన అంజిరెడ్డి కేవలం బీజేపీ బలంతో గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. ఇక మెదక్ మినహా నియోజకవర్గవ్యాప్తంగా తన విద్యాసంస్థలు విస్తరించి ఉన్న నరేందర్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ బలంపై ఆధారపడ్డారు. ప్రభుత్వంపై నిరుద్యోగులు, ఉద్యోగుల్లో ఉన్న సానుకూలత తనకు అనుకూలంగా మారుతుందనే భావనతో ఉన్నారు.
బీసీ నినాదంతో ప్రసన్న హరికృష్ణ
తన సొంత క్యాడర్ సహకారంతో కొన్ని నెలలుగా క్షేత్రస్థాయిలో ప్రచారంలో దూసుకుపోతున్న ప్రసన్న హరికృష్ణ బీసీ నినాదాన్ని నమ్ముకున్నారు. తన ప్రత్యర్థులు ఇద్దరి సామాజికవర్గం ఒకటే కావడం.. తాను బీసీ కావడం కలిసొస్తుందనే అంచనాతో ఉన్నారు. పట్టభద్రులు అధికులు బలహీనవర్గాలకు చెందిన వారే కావడం, బీసీ నినాదం గ్రౌండ్ లెవెల్‌కు బలంగా వెళ్లడంతో విజయంపై ధీమాగా ఉన్నారు. పైగా పోటీలో లేని బీఆర్‌ఎస్ నాయకులు, క్యాడర్ కూడా ప్రసన్న హరికృష్ణవైపు మొగ్గుచూపుతుండడం, కాంగ్రెస్, బీజేపీల్లోని అసమ్మతి వర్గాలు అంతర్గతంగా మద్దతునిస్తుండడం కూడా తనకు కలిసొచ్చే అంశంగా ఆయన భావిస్తున్నారు.
మొదటి ప్రాధాన్యతకే ఫలితం తేలేనా..?
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్న సందర్భంగా మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితంపై వచ్చేనా..? అనే చర్చసాగుతోంది. పోటీ త్రిముఖంగా మారడంతో ఎన్నికల్లో ఒక అభ్యర్థికి సగానికి పైగా ఓట్లు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా అయితే రెండో ప్రాధాన్యత ఓటు ఎక్కువగా పడే అభ్యర్థికి విజయం వరించే అవకాశం ఉంది. అందుకే ప్రధాన పార్టీలు కేవలం మొదటిప్రాధాన్యత ఓటు మాత్రమే వేయాలంటూ ప్రచారం చేస్తుండడం విశేషం.
త్రిముఖ పోరు
Comments
Please login to add a commentAdd a comment