
గుర్తింపు రాలే.. బాధలు తీరలే
కోరుట్ల: ఏడాది క్రితం జగిత్యాల జిల్లాకు ఉమెన్స్ అగ్రికల్చర్ కళాశాల మంజూరైంది. ఎంసెట్ ద్వారా సుమారు 50 మంది విద్యార్థినులు ప్రవేశం పొందారు. జిల్లా కేంద్రంలో సొంత భవనం లేక ఏడాదిపాటు జగిత్యాల సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలతో చదివారు. అక్కడ వసతులు సరిపోకపోవడంతో వారిని కోరుట్లలోని పురాతన ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో పదేళ్ల క్రితం నిర్మించిన భవనంలోకి తరలించారు. ఇక్కడా వసతులు సరిగా లేవు. ప్రస్తుతం ఈ విద్యార్థిను బీఎస్సీ అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ కళాశాలకు హైదరాబాద్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్(అనుంబంధ గుర్తింపు) రాకపోవడం మరో సమస్యగా మారింది. ఫలితంగా విద్యార్థినులు మహాశివరాత్రి పండుగపూట బుధవారం రోడెక్కి, బోరున విలపించాల్సిన దుస్థితి నెలకొంది.
దోమలు.. ఎలుకలు.. పాములు
ప్రస్తుతం కోరుట్లలో విద్యార్థినుల వసతి కోసం ఏర్పాటు చేసిన భవనం చుట్టూ శిథిలావస్థలో ఉన్న ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనాలున్నాయి. పెద్ద పెద్ద మర్రిచెట్లు, ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయిన చెత్త, విరిగిపోయిన చెట్ల కొమ్మలు, దోమలు, పాములు, గదుల్లో ఎలుకల సంచారంతో విద్యార్థినులు భయపడుతున్నారు. గతంలో ఒకటి, రెండుసార్లు ఎలుకలు కరిచాయి. కళాశాల ఆవరణలో పాములు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. డైనింగ్ హాల్ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కుళ్లిన ఆహార పదార్ధాల వాసనతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. టాయ్‌లెట్లలో రెండు మాత్రమే పని చేస్తున్నాయి. వీటినే అందరూ వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాచ్‌మెన్ లేకపోవడంతో రక్షణ కరువైంది.
ఫ్యాకల్టీ ఐదుగురే.. స్థానికంగానే మార్కులు?
2023–24 సంవత్సరంలో అగ్రికల్చర్ కళాశాల ప్రారంభమైంది. రెండేళ్లు గడుస్తున్నా యూనివర్సిటీ నుంచి అనుబంధ గుర్తింపు రాలేదు. మొదటి సంవత్సరం పూర్తయిన విద్యార్థుల సమాధాన పత్రాలను స్థానికంగానే దిద్ది, మార్కులు వేస్తున్నట్లు సమాచారం. మొత్తం ఏడుగురు ఫ్యాకల్టీ అవసరం ఉండగా ఐదుగురే పని చేస్తున్నారు. ల్యాబ్ సౌకర్యం లేకపోవడంతో పొలాస వ్యవసాయ పరిశోధన క్షేత్రానికి వెళ్లొస్తున్నారు. లైబ్రరీలో బుక్స్ లేవు. అనుబంధ గుర్తింపు సకాలంలో రాకపోతే తమ పరిస్థితి ఏంటని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. వసతులు కల్పించి, గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు.
అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్ లేదు
కాలేజీ ఆవరణలోకి పాములు
గ్యాస్ సిలిండర్లు లేక కట్టెల పొయ్యిపై వంట
ఆవేదనతో రోడ్డెక్కిన కోరుట్ల అగ్రికల్చర్ కళాశాల విద్యార్థినులు
కన్నీరు పెట్టుకున్న పలువురు

గుర్తింపు రాలే.. బాధలు తీరలే
Comments
Please login to add a commentAdd a comment