అవకతవకలకు పాల్పడితే చర్యలు
అదనపు కలెక్టర్ బీఎస్ లత
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని పలు ఫర్టిలైజర్ షాపులను శుక్రవారం అదనపు కలెక్టర్ బీఎస్ లత, జిల్లా వ్యవసాయాధికారి రాంచందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని జగిత్యాల సొసైటీ, ధర్మపురి రోడ్‌లోని రైతు బజార్, బుగ్గారం మండలం శెకల్లలోని ఆర్‌పీవీ ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా నిల్వలను పరిశీలించారు. ధర్మపురి రోడ్‌లోని రైతు బజార్‌లో ఎఫ్‌సీవో నిబంధనల మేరకు ఈపాస్ మిషన్ పనిచేయకపోవడంతో సంబంధిత డీలర్ లైసెన్స్‌ను రద్దు చేశారు. అలాగే, రైతు సేవా కేంద్రంలో 46 బస్తాల తేడా రావడంతో సంబంధిత డీలర్ లైసెన్స్‌ను, శెకల్ల గ్రామంలో 90 బస్తాల యూరియా అమ్మినా, ఈపాస్ మిషన్‌లో ఎంటర్ చేయకపోవడంతో డీలర్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఫర్టిలైజర్ డీలర్స్ అవకతవకలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. యూరియాను బ్లాక్ చేయడం, అధిక ధరలకు అమ్మడం, ఈపాస్‌లో నమోదు చేయకపోవడం వంటి చర్యలకు పాల్పడితే డీలర్ల లైసెన్స్ రద్దు చేస్తామని పేర్కొన్నారు.
కోటాకు మించి యూరియా సరఫరా
యాసంగి సీజన్‌లో జిల్లాకు సరఫరా కావాల్సిన యూరియా కోటా 38 వేల మెట్రిక్ టన్నులు కాగా 38,205 మె.ట యూరియా సరఫరా జరిగిందని జిల్లా వ్యవసాయాధికారి రాంచందర్ అన్నారు. శుక్రవారం డీఏవో ఆధ్వర్యంలో సిబ్బంది జగిత్యాల, ఎండపల్లి మండలాల్లో యూరియా నిల్వలను పరిశీలించారు. జగిత్యాల అర్బన్ ఎఆర్‌ఎస్‌కేలో 520 బస్తాలు, ఎండపల్లి మండలం ఉమామహేశ్వర్ ఫర్టిలైజర్ షాపులో 450, రాజరాజేశ్వర్ ఫర్టిలైజర్ షాపులో 450 బస్తాల యూరియా నిల్వ ఉందని, రైతులకు సరపడా అందుబాటులో ఉందని వివరించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి తిరుపతినాయక్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment