తాగునీటి ఎద్దడి రావొద్దు
జనగామ: ప్రస్తుత వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తగిన రక్షణ చర్యలు తీసుకో వాలనే అంశంపై ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దాహార్తి తీర్చేందుకు జిల్లా, మండల స్థాయి కార్యాలయాలు, బస్‌స్టాప్‌లు, రైల్వేస్టేషన్, రద్దీ ప్రాంతాల్లో సిబ్బందిని నియమించి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. వడగాలులతో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించా రు. ఉపాధి హామీ పనులు ఉదయం 11 గంటల వరకు పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోవాలని, జీపీలు, ఉపాధి పనుల ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సరిపడా అందుబాటులో ఉంచాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని చెప్పారు. తహసీ ల్దార్లు, ఎంపీడీఓలు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రక్రియను సజావుగా నిర్వహించి త్వరితగతిన పూర్తి చేయాలని, 25 శాతం రాయితీని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ ప్రక్రియ సత్వరమే పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా సీసీరోడ్ల నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయాలని చెప్పారు. జీపీల్లో 97 శాతం పన్నులు వసూలయ్యాయని, ఈనెల 30 వరకు 100 శాతం లక్ష్యం చేరుకోవాలని సూచించారు. అంతకు ముందు హీట్ స్ట్రోక్‌పై తీసుకునే జాగ్రత్తలపై డీఎంహెచ్ ఓ మల్లికార్జునరావు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఇందుకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. డీపీఓ స్వరూప, డీఏఓ రామారావునాయక్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య పాల్గొన్నారు.
బూత్‌లెవల్ ఏజెంట్లను నియమించాలి
రాజకీయ పార్టీలు బూత్‌లెవల్‌లో తమ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 865 పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులను నియమించాలని చెప్పారు. జనవరి 6వ తేదీన ప్రకటించిన ఓటరు జాబితా అన్ని పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉందని, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ మన్సూరి, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, రాజకీయ పార్టీల నాయకులు భాస్కర్, రవి, విజయభాస్కర్, రమేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి
సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా