విద్యార్థినికి అభినందనలు
భూపాలపల్లి అర్బన్: ఇన్‌స్పైర్ అవార్డు సాధించిన జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థిని మాచర్ల ఆశ్రితను పాఠశాల యాజమాన్యం గురువారం అభినందించింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మారుతి మాట్లాడుతూ.. గత నెలలో కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, సైన్స్ టెక్నాలజీ విభాగంలో నిర్వహించిన ఇన్‌స్పైర్ అవార్డులో పాఠశాల విద్యార్థిని ఎంపికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.10వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించినట్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో ఆశ్రితకు పూలగుచ్ఛంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాన్సీరాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రవాణాలో జాగ్రత్తలు
పాటించాలి
భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. ఈ మేరకు జిల్లాలోని కస్తూర్బాగాంధీ, మోడల్ స్కూళ్ల స్పెషల్ అధికారులు, ప్రిన్సిపాళ్లతో గురువారం జూమ్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు రవాణా చేసే సందర్భాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తప్పనిసరిగా ఒక ఉపాధ్యాయురాలు లేదా ఉపాధ్యాయుడిని ఎస్కార్ట్‌గా విద్యార్థులతో పంపాలని, దూర ప్రాంతం ఉన్న పాఠశాలలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ డీఎంను ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఆహార విషయాలలో శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులందరూ పరీక్షకు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ఆర్టీసీ, మైనారిటీ, సోషల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ ఫైలింగ్‌పై
అవగాహన అవసరం
భూపాలపల్లి అర్బన్: కేసుల ఆన్‌లైన్ ఫైలింగ్ నమోదుపై న్యాయవాదులు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు తెలిపారు. జిల్లా కోర్టులో గురువారం న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ లిటరసీ అనేది చాలా ముఖ్యమన్నారు. కేసుల ఈ ఫైలింగ్ విధానం తెలిసినప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడైన కేసులు వేసుకునే వీలుంటుందని తెలిపారు. విలువైన సమయం, డబ్బులు పొదుపు అవుతాయని, ప్రయాణ భారం తగ్గుతుందని తెలిపారు. రిసోర్స్ పర్సన్‌లు అఖిల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జయరాంరెడ్డి, ఏఓ అనితావని, న్యాయవాదులు పాల్గొన్నారు.
మహదేవపూర్‌లో
గంజాయి స్వాధీనం
కాళేశ్వరం: మండలకేంద్రంలోని ఒకరి వద్ద పోలీసులు నిషేఽధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం మండలకేంద్రంలో సోదాలు చేయగా ఒకరి నుంచి 350–400 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై పలువురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై సీఐ రాంచందర్‌రావును ఫోన్‌లో సంప్రదించగా పూర్తి వివరాలు త్వరలో తెలుపుతామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment