కాటారం: కౌలు రైతు ఆత్మహత్య ఎక్స్‌గ్రేషియా చెక్కుల పంపిణీలో జరిగిన అవకతవకలపై వివరాలు అడిగితే కలెక్టర్ రాహుల్‌శర్మ తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కాటారం మండలకేంద్రానికి చెందిన రామిళ్ల రాజబాబు శుక్రవారం ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రాజబాబు తండ్రి రామిళ్ల మల్లయ్య కౌలు రైతు కాగా కొంత కాలం క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వం విడుదల చేసిన ఎక్స్‌గ్రేషియా మంజూరు జాబితాలో మల్లయ్య పేరు ఉండగా జిల్లా అధికారులు వెల్లడించిన జాబితాలో మాత్రం మల్లయ్య పేరుతో పాటు మరికొంత మంది రైతుల పేర్లు లేవని రాజబాబు తెలిపారు. దీంతో గత వారం జరిగిన ప్రజావాణిలో ఎక్స్‌గ్రేషియా జాబితాలో అవకతవకలపై కలెక్టర్‌ను అడగగా సరైన సమాధానం చెప్పకుండా తమ పట్ల దురుసుగా ప్రవర్తించి అసహనం వ్యక్తం చేసినట్లు రాజబాబు పేర్కొన్నారు. ఈ విషయాలను ఎస్సీ కమిషన్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కలెక్టర్ వ్యవహార శైలిపై విచారణ జరపాలని, ఎక్స్‌గ్రేషియా అందేలా న్యాయం చేయాలని కోరినట్లు రాజబాబు తెలిపారు. దీంతో స్పందించిన డైరెక్టర్ కలెక్టర్‌కు నోటీస్ జారీ చేసినట్లు వివరించారు.