మహబూబ్‌నగర్: బహుజన రాజ్యం సాధించడానికి ప్రతిఒక్కరు కృషిచేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన నల్లమల నగారా సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బహుజన అధికారం తెచ్చి.. ప్రగతిభవన్‌లో సీఎం పీఠంపై కూర్చోబెట్టే వరకు నిద్రపోమన్నారు.
బీఆర్‌ఎస్ నాయకులు దొంగలని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని, వాళ్లు కూడా దొంగలేనని దుయ్యబట్టారు. ఒక శాతం ఓట్లు ఉన్నోళ్లు సీఎంలు, మంత్రులు అయితే.. 99 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏమవ్వాలని ప్రశ్నించారు. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో చెప్పేది మీరు కాదు.. మేం అని ఓ పెద్దమనిషికి సమాధానం చెప్పానన్నారు. ఎవరితోనూ పొత్తులు ఉండవని, మాకు మేమే పోటీ చేస్తామని చెప్పారు.
రసమయి బాలకిషన్, గువ్వల బాలరాజు దొరల పాట పాడుతున్నారని విమర్శించారు. సాయిచందు బీఆర్‌ఎస్‌కు ఊడిగం చేశారని, ఆయన చనిపోతే కనీసం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేని దుర్మార్గమైన ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ది అన్నారు. 1,300 మంది తెలంగాణ బిడ్డల త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణ నేడు దొంగలు, కబ్జాదారుల పాలైందని దుయ్యబట్టారు.
ఈ ప్రాంతంలో ఉన్న అనుబంధం మర్చిపోలేమని, గువ్వల బాలరాజు నేను ఇక్కడ పుట్టి పెరిగినా.. నీవు అతి చేస్తే మా దెబ్బ చూపుతామని హెచ్చరించారు. అంతకు ముందు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్, అసెంబ్లీ ఇన్‌చార్జ్ నాగార్జున్, జిల్లా ఉపాధ్యక్షుడు రామన్న, యేసేపు, ప్రధాన కార్యదర్శి రామచందర్, విష్ణువర్ధన్, కుమార్, సుజన, ఈశ్వర్, జాకీర్, రమేష్, రాము పాల్గొన్నారు.
పాలమూరు రైతులకు తీరని అన్యాయం..
ప్రత్యేక రాష్ట్రంలోనూ పాలమూరు రైతులకు అన్యాయమే జరుగుతుందని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. తొమ్మిదేళ్లుగా ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రంలో పాలమూరు– రంగారెడ్డి పథకానికి ఒక న్యాయం.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మరో న్యాయమా అని ప్రశ్నించారు.
పాలమూరు ప్రాజెక్ట్‌కు అరకొర నిధులు విడుదల చేయడం వల్లే ఇప్పటి వరకు కాల్వల నిర్మాణమే పూర్తి కాలేదన్నారు. పాలమూరుకు జరుగుతున్న అన్యాయాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో శ్రీనివాస్‌యాదవ్, అధ్యక్షుడు ఆంజనేయులు, స్వాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment