
అయిజలో తెగుళ్లు సోకిన మిరప పంట
అయిజ: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్ సౌకర్యం కల్పించాల్సిన అధికారులు చేతిలెత్తేయడంతో మిరప పండించిన రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మార్కెట్ సౌకర్యం సంపూర్ణంగా లేకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. పురుగులు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడి ఘననీయంగా తగ్గిపోయింది. గతేడాదితో పోల్చితే ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి తగ్గింది. అదేవిధంగా క్విటాకు ధర రూ.10వేలు తక్కువ పలుకుతోంది. పండిన పంటను విక్రయిద్దామంటే జిల్లాలో సరైన మార్కెట్ లేదు. అధికారులు జిల్లా కేంద్రంలో మొక్కుబడిగా మార్కెట్‌ను నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న మార్కెట్‌కు పంటను తరలించాలంటే రైతులు ఎన్నో వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తుంది. దళారులకు విక్రయిద్దామంటే మార్కెట్ రేటు కంటే రూ.2వేల నుంచి రూ.3 వేలు తక్కవకు కొంటున్నారు. దీనికితోడు తూకంలో మోసం చేస్తున్నారు. అధికారులు మిర్చికి మార్కెట్ సౌకర్యం కల్పించి ఆదుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు కోరుతున్నారు.
తెగుళ్లు.. వర్షాభావంతో దెబ్బ
జిల్లాలో గత ఏడాది 19,690 ఎకరాల్లో ఎండు మిరపను సాగుచేసారు. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఎండుమిర్చి రకాలను బట్టి ధర క్వింటా రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు పలికింది. మిరపను సాగుచేస్తే లాభాలు వస్తాయనే ఆశతో అన్నదాతలు ఈ ఏడాది వానాకాలంలో 65,115 ఎకరాల్లో ఎండుమిర్చిని సాగుచేశారు. పంటకు వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించాయి. తామర పురుగు పంటపై పగబట్టింది. దానికి తోడు పంటకు వైరస్ సోకింది. రైతులు ఎన్ని రకాల మందులు పిచికారి చేసినా ఫలితం లేకపోయింది. అప్పులు మిగిలాయి కానీ పురుగులు మాత్రం చావలేదు. పంట రకాలను బట్టి, నాణ్యతను బట్టి ధర కేవలం రూ. 10 నుంచి రూ. 15వేల వరకు ధర పలుకుతోంది. దిగుబడి ఎకరాకు 10 క్విటాంళ్లు తగ్గిపోయింది. ఈ ఏడాది పెట్టుబడి ఎకరాకు సుమారు రూ.లక్ష నుంచి రూ. లక్ష యాబైవేలు ఖర్చుచేశారు. ఎకరాకు సరాసరి 10 క్వింటాళ్లు దిగుబడి లెక్కించి, ధర సుమారు రూ.10 వేలు లెక్కగట్టినా ఎకరానికి రూ.లక్షకు మించి రాబడి రావడంలేదు. దానితో రైతులు ఎకరాకు సరాసరి రూ. 20 వేలనుంచి రూ. 50 వేల వరకు నష్టపోతున్నారు.
మార్కెట్ సౌకర్యం లేక ఇక్కట్లు..
పండించిన మిరుప పంటకు అధికారులు మార్కెట్ సౌకర్యం కల్పించకపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో మొక్కుబడిగా మార్కెట్ సౌకర్యం కల్పించారు. ప్రతి వారంలో ఒకసారి సోమవారం మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దానితో రైతులు మిర్చి పంటను హైదరాబాద్‌కు, బెంగళూరుకు తరలించాల్సి వస్తుంది. దానికోసం ట్రాన్స్‌పోర్ట్ చార్జి తడిసి మోపడవుతుంది. హైదరాబాద్‌కు తరలించేందుకు ఒక క్వింటాకు రూ. 250 ఖర్చు వస్తుంది. బెంగుళూరుకు తరలించాలంటే క్వింటాకు సుమారు రూ.1000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
తెగుళ్లు దెబ్బతీశాయి
ఎండుమిర్చికి ఆకుముడత తెగులు సోకి పంట గిడసబారింది. ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 10 నుంచి 15 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. మిరప పంట నాణ్యత లేనందుకు ధర కేవలం రూ. 10 వేల నుంచి రూ.15 వేలు పలుకుతోంది. పెట్టుబడి ఎకరాకు సుమారు రూ.1.50 లక్షలు అవుతోంది. పంటను విక్రయిస్తే నష్టమే వస్తోంది. ప్రభుత్వం మిరుప రైతులను ఆదుకోవాలి.
– జగన్నాథరెడ్డి, అయిజ
గిట్టుబాటు ధర కల్పించాలి
ఎండు మిర్చి పంటకు అధికారులు మార్కెట్ సౌకర్యం, గట్టుబాటు ధర కల్పించాలి. మార్కెట్ సౌకర్యం సరిగా లేకపోవడంతో పంటను హైదరాబాద్‌కు, బెంగుళూరుకు తరలించాల్సి వస్తోంది. రవాణా చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. అధికారులు జిల్లా కేంద్రంలో ప్రతిరోజు మార్కెట్ సౌకర్యం కల్పించాలి.
– గోవిందు, రైతు, అయిజ
కొనుగోలుదారులు ముందుకురావాలి
ఎండు మిర్చి కొనుగోలు చేసేందుకు వారానికి ఒక రోజు జిల్లా కేంద్రంలో మార్కెట్ ఏర్పాటు చేశాం. కానీ, కొనుగోలు దారులు ఎక్కువమంది రాకపోవడంతో సమ స్యలు ఉత్పన్నమవుతున్నాయి. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తాం. కొనుగోలుదారులు ముందుకు రావాలి.
– పుష్పమ్మ, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్
తెగుళ్లతో ఎకరాకి 10క్వింటాళ్లకుపైగా తగ్గిన దిగుబడి
ధర సైతం గతేడాది కంటే రూ.8వేలనుంచి రూ.10వేలు పడిపోయిన వైనం
గద్వాలలో మొక్కుబడిగా మార్కెట్ నిర్వహణ
ఎండుమిర్చి రైతును వెంటాడుతున్న కష్టాలు
జిల్లాలో 65వేల ఎకరాల్లో పంట సాగు



Comments
Please login to add a commentAdd a comment