అందని ప్రసాద్‌ం
అన్నవరం: కేంద్ర ప్రభుత్వ ‘పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్పిరిట్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీముకు అన్నవరం దేవస్థానం ఏ ముహూర్తాన ఎంపికై ందో కానీ ఆది నుంచీ అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఫలితంగా వస్తాయనుకున్న నిధులు రాక, రత్నగిరికి ‘ప్రసాద్’ం అందడంలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ పథకం కింద రూ.20 కోట్లతో చేపట్టే నిర్మాణాలకు రీ టెండర్లు పిలిచిన 35 రోజులు గడిచినా ఇంకా ఖరారు కాలేదు. ఇవి మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రధాని శ్రీకారం చుట్టినా..
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను పర్యాటక కేంద్రా లుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం ప్రసాద్ పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికి అన్నవరం దేవస్థానం కూడా ఎంపికై ంది. అప్పటి ప్రజాప్రతినిధులు దఫదఫాలుగా చేసిన విజ్ఞప్తులు, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, నాటి కాకినాడ ఎంపీ వంగా గీత తదితరుల కృషితో కేంద్ర ప్రభుత్వ అధికారులు అన్నవరం దేవస్థానాన్ని సందర్శించారు. ఇక్కడ చేపట్టాల్సిన పనులపై ఒక అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో ఇక్కడి అధికారులు సుమారు రూ.100 కోట్లతో వివిధ పనులకు ప్రతిపాదించగా.. తర్వాత దీనిని సుమారు రూ.55 కోట్లకు, ఆ తర్వాత సుమారు రూ.20 కోట్లకు ఈ పనులను కుదించారు. ఆ మేరకు సుమారు రూ.20 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టే వివిధ పనులకు గత ఏడాది మార్చి 7న ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. కొద్ది రోజులు గడిస్తే ఈ పనులను ప్రధాని ప్రారంభించి ఏడాది కానుంది. అయినప్పటికీ ఇప్పటికీ ఈ పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు.
‘ప్రసాద్’ పనులివీ..
● దేవస్థానంలోని పాత టీటీడీ భవనం స్థలంలో రూ.10 కోట్లతో రెండంతస్తుల అన్నదాన భవనం నిర్మాణం.
● ప్రస్తుతం అన్నదాన భవనం పక్కనే రూ.6 కోట్లతో క్యూ కాంప్లెక్స్.
● ప్రకాష్ సదన్ భవనం వెనుక ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా ఉన్న ప్రదేశంలో అటు సత్యగిరి, ఇటు రత్నగిరికి దగ్గరగా ఉండేలా రూ.3 కోట్లతో టాయిలెట్ బ్లాక్‌ల నిర్మాణం.
● సత్రాల నుంచి ఆలయానికి, వ్రత మండపాలకు భక్తులను తరలించేందుకు రూ.కోటితో రెండు బ్యాటరీ కార్ల కొనుగోలు.
తొలుత రెండు ప్యాకేజీలుగా..
అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ పనులపై గత ఏడాది అక్టోబర్ 9న రెండు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. మొత్తం 12 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. వీటిని అదే నెల 25న ఖరారు చేయాల్సి ఉండగా కూటమి సర్కార్ ఆ పని పూర్తి చేయలేదు. చివరకు గత డిసెంబర్‌లో ఆ టెండర్లను రద్దు చేశారు.
ఒకే ప్యాకేజీగా రీటెండర్
ప్రసాద్ పనులకు ఈ ఏడాది జనవరి 9న రీటెండర్ పి లిచారు. ఈసారి రూ.18.97 కోట్లకు ఒకే ప్యాకేజీగా టెండర్లు ఆహ్వానించారు. ఈసారి ఆరుగురు మాత్రమే టెండర్లు వేశారు. వీటిని జనవరి 24న తెరచి ఖరారు చేయాల్సి ఉండగా ఆ పని ఇప్పటి వరకూ జరగలేదు. ఫిబ్రవరి నెల కూడా గడిచిపోయినా దీనిపై ఇంతవర కూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణమని అధికారులు చెబుతున్నారు.
‘టెండర్’ పెట్టేందుకేనని ఆరోపణలు
రాష్ట్రంలోని అన్ని పథకాల టెండర్లలో చక్రం తిప్పుతున్న కూటమి ప్రభుత్వ పెద్దల కన్ను రత్నగికి ‘ప్రసాద్’ టెండర్లపై కూడా పడిందనే ఆరోపణలు రెండు నెలలుగా వినిపిస్తున్నాయి. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌కు ఈ టెండర్లు దక్కాలనే ఆలోచనతో కూటమికి చెందిన ఒక మంత్రి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఆ విధంగా తమ అనుకూల కాంట్రాక్టర్‌కు పనులు దక్కే అవకాశం లేదని తేలినందువల్లనే తొలుత పిలిపించని టెండర్లను డిసెంబర్‌లో రద్దు చేశారనే ఆరోపణలు వచ్చాయి. రెండోసారి టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లలో అర్హత పత్రాలు జత చేయలేదనే కారణంతో టెక్నికల్ బిడ్ సమయంలో ఇద్దరిని అనర్హులను చేసినట్లు సమాచారం. ఈ విధంగా తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌కే ఈ టెండర్లు దక్కేలా కూటమి నేత ఒకరు తెర వెనుక చక్రం తిప్పుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల కోడ్ వల్లనే..
అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ స్కీమ్ పనులకు రీ టెండర్లను ఖరారు చేసే ప్రక్రియ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వీటిని ఖరారు చేస్తారు.
– ఈశ్వరయ్య, చీఫ్ ఇంజినీర్, పర్యాటక శాఖ
రత్నగిరిపై మరింత జాప్యం
అక్టోబర్‌లో పిలిచిన మొదటి టెండర్ రద్దు
జనవరిలో మళ్లీ టెండర్లు
రూ.18.98 కోట్లతో ఒకే ప్యాకేజీగా ఆహ్వానం
35 రోజులైనా ఖరారవ్వని వైనం
మరింత ఆలస్యం జరిగే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment